విజయవాడ, ఆగస్టు 6,
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. దీంతో అమరావతి రాజధాని అవుతుందనే ఆశతో భూములు ఇచ్చిన రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ విషయంలో ప్రత్యక్ష పోరాటానికి దిగాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ తోడు కోసం వెతుక్కుంటోంది. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలపై ఒత్తిడి తీసుకువచ్చి, వారిని కూడా అమరావతికి మద్దతుగా ఉద్యమంలో దింపాలనే వ్యూహంతో వెళుతోంది.
అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీ మాత్రమే ముందు నుంచీ ఒకే స్టాండ్‌పై ఉంది. మూడు రాజధానులు వద్దని, కేవలం అమరావతిలోనే రాజధాని ఉండాలని ఆ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఇందుకు ఆ పార్టీ చెబుతున్న కారణాల్లో తేడాలు వచ్చాయి కానీ డిమాండ్ మాత్రం ఒకటే వినిపిస్తోంది. అయితే, బీజేపీ, జనసేన పార్టీలు మాత్రం స్పష్టమైన వైఖరితో లేవు.
బీజేపీ విషయానికి వస్తే టీడీపీతో కలిసి ప్రభుత్వంలో ఉన్నప్పుడే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. శంకుస్థాపనకు ప్రధాని మోడీ వచ్చారు. అయితే, టీడీపీకి దూరమయ్యాక రాయలసీమకు అన్యాయం జరుగుతుందనే డిమాండ్‌ను బీజేపీ వినిపించింది.
ఇందులో భాగంగా రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించింది. సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పింది. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించి బీజేపీ డిమాండ్ చేసినట్లుగానే రాయలసీమలో హైకోర్టు పెడతామని, అభివృద్ధి వికేంద్రీకరణ జరుపుతామని చెబుతోంది. ఈ సమయంలో బీజేపీలో భిన్న వాదనలు తెరపైకి వచ్చాయి. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సహా కొందరు నేతలు అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైనప్పుడు కేంద్రం రంగంలోకి దిగుతుందని, అమరావతి నుంచి రాజధాని అక్కడ అడుగు కూడా కదలదని చెబుతూ వచ్చారు.అమరావతి రైతులకు బీజేపీ అండగా నిలిచింది. దీంతో రైతులు ఎక్కువగా టీడీపీ కంటే బీజేపీనే నమ్మారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమకు మద్దతు ఇస్తున్నందున మూడు రాజధానుల ఏర్పాటు అసాధ్యమని, జగన్ ప్రభుత్వం అమరావతిని కాదని ముందుకు వెళ్లలేదని భావించారు. అయితే, రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు కొందరు నేతలు అమరావతి రైతులకు మద్దతు ఇస్తూనే రాజధాని విషయంలో కేంద్రం జోక్యం ఉండదని తేల్చేశారు. గవర్నర్ కూడా ఈ బిల్లును ఆమోదించడంతో రాజధాని రైతులు బీజేపీపై పెట్టుకున్న ఆశలు కూడా ఆవిరయ్యాయి.పవన్ కళ్యాణ్ పట్ల కూడా ఇదే జరిగింది. అమరావతి కోసం పోరాటానికి దిగిన రైతులకు పవన్ మద్దతు ప్రకటించారు. రాజధాని ఇక్కడి నుంచి కదలదని ధీమాగా చెప్పారు. దీంతో రైతులకు పవన్ మాటలతో భరోసా లభించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఇటువంటి సమయంలో గవర్నర్ మూడు రాజధానుల బిల్లు ఆమోదించడంతో పవన్ కళ్యాణ్ పట్ల కూడా అమరావతి రైతుల్లో అసంతృప్తి ఉంది. పరోక్షంగా తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీ, పవన్ కళ్యాణ్ కూడా అమరావతి రైతులకు మద్దతుగా నిలవాలని డిమాండ్ చేస్తోంది. ఆ పార్టీ అనుకూల మీడియా కూడా బీజేపీ, జనసేనకే ఎక్కువ బాధ్యత ఉందని పదేపదే చెబుతోంది.తమ పార్టీలను తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని గ్రహించిన బీజేపీ, జనసేన రివర్స్ అటాక్‌కు దిగాయి. అసలు చంద్రబాబు నాయుడు వల్లనే అమరావతి రైతులకు ఈ ఇబ్బందులు అన్నీ అని ఆ రెండు పార్టీల నేతలు అంటున్నారు. రాజధాని మార్పుకు టీడీపీ అవలంభించిన విధానాలు కూడా కారణమని ఆరోపిస్తున్నాయి.అయితే, మూడు పార్టీలు కూడా అమరావతి రైతులకు తమ మద్దతు ఉంటుందని అంటున్నాయి. అయితే, టీడీపీ కోరుకుంటున్నట్లుగా బీజేపీ, జనసేన ప్రత్యక్ష పోరాటానికి మాత్రం దిగడం కష్టమే. పైగా రైతుల్లో ఆ రెండు పార్టీలూ తమకు న్యాయం చేయలేదనే భావనతో ఉన్నారు. అందుకే తప్పు మీదంటే, మీదే అంటూ మూడు పార్టీలూ ఈ విషయంలో బ్లేమ్ గేమ్ మొదలుపెట్టాయి.