విజయవాడ, ఆగస్టు 7,
ఏపీలో ఇద్దరు బలమైన నేతలు ఉన్నారు. ఇద్దరూ ఏపీ కోసం ఏదో చేయాలని తపన ఉన్నవారే. అయితే వారి రాజకీయమే వక్ర మార్గం పట్టడంతో చివరికి వారే కాదు, ఏపీ కూడా నానా అవస్థలు పడుతోందని విశ్లేషణలు ఉన్నాయి. నిజానికి చంద్రబాబు తెలివి ముంది ఎవరు సరిపోతారు. ఉమ్మడి ఏపీలో హైటెక్ సిటీ కట్టింది ఆయనేగా. అటువంటి బాబు అమరావతికి వచ్చేసరికల్లా మారిపోయారు. ఒకనాడు కులాన్ని దూరంగా పెట్టిన బాబుకు పదేళ్ల ప్రతిపక్ష అనుభవం ఏం చెప్పిందో కానీ తనవారికి దగ్గర తీసి భారీగానే మేలు చేద్దామనుకున్నారు. ఆ అభిమానం, ఆ ప్రేమ మరీ ఎక్కువై విభజన ఏపీకి అమరావతి పేరిట తీరని అన్యాయం చేశారు.
మరో వైపు చూస్తే జగన్ అయిదేళ్ల పాటు విభజన ఏపీ తొలి శాసనసభలో విపక్ష నేతగా ఉన్నారు. అన్నీ వదులుకుని వచ్చిన ఏపీకి శాశ్వతంగా రాజధాని ఉండాలన్నది జగన్ కి కూడా తోచినట్లు లేదు. పైగా బాబు ఏం చేస్తే అది కాదు అనడమే నరనరాల జీర్ణించుకున్న రాజకీయం చేస్తూ వచ్చారు. అమరావతి రాజధానికి మొదట అసెంబ్లీలో ఒప్పుకుని ఆ తరువాత ఇపుడు అధికారం చేతిలో పడగానే మూడు రాజధానుల పాట పాడుతున్నారు. నాడే బాబుని హెచ్చరించి మూడు వేల ఎకరాల్లోనే రాజధాని నిర్మించమని చెప్పవచ్చుగా. తీరా బాబు హై టెక్ హంగులన్నీ చూసిన జనం పక్కన పెడితే అలా దక్కిన సువర్ణావకాశాన్ని జగన్ మూడు ముక్కలాటతో ఏపీకి ఏం చేయలనుకుంటున్నాడో తెలియదంటున్నారు మేధావులు.ఏపీలో అమరావతి రాజధానినే ఉంచి జగన్ తాను అనుకుంటున్నట్లుగానే మూడు వేల ఎకరాల్లోనే నిర్మించి, మిగిలినది రైతులకు ఇచ్చేసి ఉండాల్సింది. ఇక విశాఖపట్నం స్వతహాగానే అభివ్రుధ్ది చెందిన సిటీ. పరిశ్రమలు కోసం ఎవరైనా వస్తే విశాఖను ఎటూ చూపించవచ్చు. అలాగే మొత్తం నష్టపోయిన రాయలసీమకు హైకోర్టుని కచ్చితంగా తరలించాల్సిందే. ఇలా కనుక జగన్ చేసి ఉంటే బాబు తప్పులూ జనాలకు తెలుసును, జగన్ దూర దృష్టి, ఏపీ పట్ల ఉన్న చిత్తశుద్ధి కూడా తెలిసేది. కానీ జగన్ అన్నీ తెలిసినా కూడా బాబు ఆనవాళ్ళు ఏవీ అమరావతిలో ఉండకూదనుకున్నారు. అందుకే మూడు రాజధానుల పేరిట ముగ్గులోకి దింపాడని అంటున్నారు.ఏపీ జనాన్ని ఇప్పటికే బీజేపీ అన్ని విధాలుగా వంచించింది అన్న భావన ఉంది. అందుకే 2019 ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఆ పార్టీకి దక్కాయి. అదీ జనాగ్రహం. కానీ ఏపీలో ఏమీ లేని, ఎందుకూ కానీ బీజేపీ ఇపుడు పెద్దన్న పాత్ర పోషిస్తోంది. అంటే దానికి కారణం చంద్రబాబు, జగనే, ఈ ఇద్దరు నేతల వైఖరి వల్లనే ఏపీకి ప్రత్యేక హోదా పోయింది. విభజన హామీలకు దిక్కులేదు, రెవిన్యూ లోటు అలాగే ఉంది. ఆఖరుకు ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులకు కూడా బీజేపీ పెద్దలు అడ్డుపుల్ల వేస్తున్నారు. ఇపుడు ఏపీలో మూడు రాజధానుల ముచ్చటకు జగన్ తెరతీస్తే తెర వెనక మద్దతు ఇస్తూ రెండు పార్టీల అధినేతల మధ్య చిచ్చు పెట్టి చోద్యం చూస్తున్నారు. రేపటి రోజున బీజేపీ హైకోర్టు కర్నూలు కి ఇవ్వకపోయినా జగన్ అనుకున్నట్లుగా విశాఖలో ప్రగతి వికసించకపోయిన బాబు పక్క సీటే జగన్ కి గతి అవుతుందన్న విశ్లేషణలూ ఉన్నాయి. అపుడు ఏపీలో రాజ్యం అందుకునేందుకు తాము రెడీ అనేందుకే బీజేపీ ఇన్ని ఎత్తులు వేస్తోందని కూడా అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో లూజర్స్ ఏపీ జనం అయితే పందెం కాయకుండా ఫలితం దక్కించుకునే తెలివిడి బీజేపీదే మరి.