హైద్రాబాద్, ఆగస్టు 7,
ఎప్పుడైనా రాజకీయాల్లో వెయిట్ చేయాలి. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాత్రం రాజకీయం ఏమాత్రం వంటబట్టినట్లు లేదు. ఎన్నికలు జరిగి ఆరునెలలు కాకముందే భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. నిజానికి అంత హడావిడిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. అందులోనూ పవన్ కల్యాణ్ లాంటి పార్ట్ టైం పొలిటికల్ లీడర్ ఎన్నికలకు ముందు పొత్తు విషయాలను ఆలోచించ వచ్చు.ఏరాజకీయ పార్టీ అయినా అదే చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉంది. కానీ పవన్ కల్యాణ్ ఆవేశంతో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు జనసేన ఉనికికి ఇబ్బందిగా మారింది. నిజానికి బీజేపీ మీద ఎంతో హోప్స్ పెట్టుకుని పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. కానీ బీజేపీ అజెండా చూసిన పవన్ కల్యాణ్ పొత్తుపై పునరాలోచనలో పడినట్లే కన్పిస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు మళ్లీ బీజేపీ నుంచి వేరు పడే సాహసం చేయకపోవచ్చు. కానీ భవిష‌్యత్ లో పవన్ కల్యాణ‌్ బీజేపీకి దూరం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.పవన్ కల్యాణ్ కు జగన్ ఒక్కరే శత్రువు. జగన్ ముఖ్యమంత్రి కాకూడదని పవన్ బలంగా కోరుకున్నారు. కానీ గత ఎన్నికల్లో తన కోరిక నెరవేరలేదు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే బీజేపీ జగన్ కు పరోక్ష సహకారం ఇస్తుందన్నది అందరి అభిప్రాయం. మూడు రాజధానుల విషయంలో ఈ విషయం స్పష్టమయింది. రాజ్యసభలో జగన్ అవసరం బీజేపీకి ఉండబట్టే ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోదన్నది పవన్ కల్యాణ్ కు ఇప్పుడు అర్థమయింది.నిజానికి పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిస్తేనే బలం పెరుగుతుంది. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న టీడీపీతో జత కడితే భవిష‌్యత్ లో ప్రయోజనం ఉంటుంది. కలసి పోటీ చేస్తే కనీస స్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయి. కానీ ఇద్దరూ కలిస్తే ఇప్పుడు జనం ఆదరించరు. ఇప్పుడు పవన్ కల్యాణ‌్ బీజేపీతో కలసి ఉండలేని పరిస్థితి. అలా అని విడిపోయి ఏమీ చేయలేని స్థితి. దీంతో భవిష్యత్ లో జనసేన పార్టీని పవన్ కల్యాణ ఏ దరి చేరుస్తారోనన్న చర్చ ఆపార్టీలోనే జరుగుతుండటం విశేషం.