YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

నిబంధనలు తీయండి కేంద్రానికి కేటీఆర్ లేఖ

నిబంధనలు తీయండి కేంద్రానికి కేటీఆర్ లేఖ

హైద్రాబాద్, ఆగస్టు7, 
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌కు లేఖ రాశారు. వ్యాక్సిన్‌ తయారీకి జరుగుతున్న ప్రయత్నాల గురించి ఆయన అందులో ప్రస్తావించారు. ప్రస్తుతం తెలంగాణలో వ్యాక్సిన్ అభివృద్ధికి జరుగుతున్న పనులను వివరించారు. కరోనా వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, తయారీ, అనుమతుల విషయాలు మరింత వేగంగా కదలాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ ప్రపంచానికి వ్యాక్సిన్ క్యాపిటల్‌గా ఉందని తెలిపారు. వ్యాక్సిన్‌ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవసరమన్న కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. కొవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.కేవలం హైదరాబాద్ నుంచి ఏటా సుమారు 5 బిలియన్ డోసుల వ్యాక్సిన్ తయారవుతుందని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని వెల్లడించారు. ఇప్పటికే నగరానికి చెందిన మూడు కంపెనీలు కొవిడ్ వ్యాక్సిన్ తయారీకి సంబంధించి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయని లేఖలో వెల్లడించారు. త్వరలోనే వ్యాక్సిన్ ఇక్కడి నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందన్న ఆశతో ఉన్నామని కేటీఆర్ చెప్పారు. ఇది తమకెంతో గర్వకారణమని మంత్రి తెలిపారు.ప్రపంచ బయోటెక్ రంగంలో భారత్‌ను అగ్ర స్థానంలో నిలపాలని, ఈ రంగంలో పోటీతత్వాన్ని తట్టుకోవాలంటే అనుమతులు, క్లియరెన్స్‌ల విషయంలో మరింత సులభంగా ఉండేలా నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. భారతదేశంలో వ్యాక్సిన్ల తయారీకి సుమారుగా 6 కేంద్ర మంత్రిత్వ శాఖలు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని, దీంతో పాటు రాష్ట్ర స్థాయిలోనూ అనుమతుల ప్రక్రియ ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచ పోటీతత్వాన్ని తట్టుకోవాలంటే ఈ క్లిష్టతరమైన ప్రక్రియను సులభతరం చేయాల్సిన అవసరం ఉందని కోరారు.

Related Posts