హైద్రాబాద్, ఆగస్టు 7,
రాంగోపాల్ వర్మకు న్యాయపరమయిన చిక్కులు ఏర్పడ్డాయి. నిత్యం ఏదో వివాదం వేడిలో చలికాచుకునే వర్మకు తిప్పులు వచ్చిపడ్డాయి. తమ ప్రేమ గాథను, తన భర్త ప్రణయ్ హత్య, తండ్రి మారుతీరావుపై వాస్తవానికి విరుద్ధంగా మర్డర్ మూవీ తీస్తున్నారని అమృత మండిపడుతూనే వుంది. తాజాగా దర్శకుడు రాంగోపాల్ వర్మపై అమృత న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘మర్డర్’ సినిమా నిర్మిస్తుండటం... ట్రైలర్, కొత్తగా విడుదలైన పాటలో వాస్తవానికి దూరంగా ఉన్న అంశాలను చూపించడంపై అమృత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలకు దూరంగా ‘మర్డర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఆమె ఆరోపించారు. వెంటనే ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టు మెట్లు ఎక్కారు. ఇందుకు సంబంధించి ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు అమృత. అమృత పిటిషన్‌ను న్యాయస్థానం.. ఎస్సీ ఎస్టీ కోర్టుకు ఫార్వర్డ్ చేసింది. దీనిపై స్పందించిన కోర్టు ఈ నెల 6న ‘మర్డర్’ చిత్ర దర్శక నిర్మాతలు కోర్టుకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అడ్వకేట్ ఈమెయిల్, వాట్సాప్ ల ద్వారా దర్శక నిర్మాతలకు నోటీసులు పంపారు.ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ‘పిల్లల్ని ప్రేమించడం తప్పా’? అంటూ పాటను విడుదల చేశారు వర్మ.ఈ సినిమా ప్రారంభం నుంచి అమృతను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. పెళ్లైన ఏడాదికే భర్తను పోగొట్టుకుని.. చిన్నబిడ్డతో రోడ్డున పడ్డ అమృత విషాధ గాధను పక్కన పెట్టిన వర్మ.. మారుతీరావు చూపించిన ప్రేమపైనే ఫోకస్ పెట్టి పాటను రాయించుకున్నారు.పిల్లల్ని ప్రేమించడం తప్పా.. తప్పు చేస్తే దండించడం తప్పా.. చెప్పుతో కొట్టడం తప్పా.. అంటూ వర్మ దృష్టితో అమృతను దండించే ప్రయత్నం చేశారు వర్మ. పనిలో పనిగా ప్రణయ్‌ని ఒక ముప్పుగా అభివర్ణించాడు వర్మ. సిర శ్రీ లిరిక్స్ అందించగా.. డీఎస్ఆర్ సంగీతం అందించారు. ఎవరు పాట రాస్తే ఏంటి?? ఎవరు ట్యూన్ ఇస్తే ఏంటి కాని.. వర్మ మాత్రం ఈ పాటను ఖూనీ చేసేశాడు అంటూ యూట్యూబ్‌లో జనం గగ్గోలు పెడుతున్నారు. వర్మ ఏంటి మాకు ఈ కర్మ.. దయచేసి మళ్లీ నువ్ పాటపాడమాకయ్యా నీకు దండం పెడతాం అంటున్నారు నెటిజన్లు. అందరూ కత్తులతో , తుపాకీతో చంపుతారు ... మీరు గ్రేట్ వాయిస్‌తో మర్డర్ చేసిపారేశారు వర్మ.. మా ఖర్మ అంటున్నారు.