YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఆశ అవసరమే..కానీ ...

ఆశ అవసరమే..కానీ ...

ఏ మనిషి అయినా జీవితంలో సుఖంగా జీవించడానికి డబ్బు సంపాదించాలి.  కానీ, దానికి ఒక పరిమితి ఉండాలి.  అంటే సంపాదనకు కాదు.  వయసుకు.  అరవై ఏళ్లపాటు చెమటోడ్చి సంపాదిస్తాము.  ఇల్లూవాకిళ్ళు, బాంక్ బాలన్స్ ఏర్పాటు చేసుకుంటాం.  ఎన్ని అవసరాలు వచ్చినా తీర్చుకోగల ఆర్థికశక్తిని సమకూర్చుకుంటాము.  ఎంత సంపాదించినా మనిషిలో ఆశ మాత్రం చావదు.  ఎనభై ఏళ్ళు దాటినా ఇంకా సంపాదించాలి..ఇంకా కూడబెట్టాలనే వాంఛ మాత్రం చావదు.  వయసు పెరిగేకొద్దీ సత్తువ ఉడిగిపోతుంది.  కళ్ళు మసకబారుతాయి.  జుట్టు మొత్తం రాలిపోతుంది.  దంతాలు ఊడిపోతాయి.  ఎముకల్లో పటుత్వం పోతుంది.  చర్మం ముడుతలు పడి తోలుతిత్తిగా మారుతుంది.  వినికిడిశక్తి తగ్గుతుంది.  జ్ఞాపకశక్తి హరించుకునిపోతుంది.    అయినప్పటికీ ఆశ అనేది నిత్యయవ్వనంతో మిసమిసలాడుతుంటుంది!    శరీరంలో అనేకరకాల వ్యాధులు తిష్టవేస్తాయి.  మృత్యువు సమీపంలోనే ఉంటుంది.    ఆ పరిస్థితిలోనూ  ఇంకా సంపాదించాలనే యావ  మాత్రం చావదు.    వారి కొడుకులు, కూతుళ్లు, మనవళ్ళు కూడా ఆర్ధికంగా ఉన్నత స్థాయికి ఎదిగి ఉంటారు.  ఇరుగుపొరుగువాళ్ళు ఆకలికి మలమల మాడుతున్నా , వారికి ఒక్క పూట భోజనం పెట్టాలనిపించదు.  బంధువుల్లో, మిత్రుల్లో ఎంతోమంది దురదృష్టం కొద్దీ వ్యాధులతో బాధపడుతూ సర్జరీలు చేయించుకోవడానికి, వైద్య ఖర్చులకు  ఆర్థికసాయం కోసం ఎదురుచూసేవారున్నా, వారికి నయాపైసా సాయం చేయాలనిపించదు.    ఎంతోమంది పేదపిల్లలు ఫీజులు కట్టే స్తోమతు లేక బాల్యంలోనే చదువు మానేస్తారు.  అలాంటి నలుగురు పిల్లలకు చదువు చెప్పించి వారి జీవితాలను ఉద్ధరించాలనే ఆలోచన కూడా రాదు.  అప్పటికే  వేలకోట్ల రూపాయలను ఆర్జించి, దేశం మొత్తం ఆస్తులను పోగేసుకుని,  ఎనభై ఏళ్లకు చేరువైనా ఇంకా షూటింగులు,  మీటింగులు, కాంట్రాక్టులు, కమీషన్లు,  రాజకీయాలు,  వ్యాపారాలు అంటూ తిరిగే వారిని చూస్తే నాకు చచ్చే జాలి వేస్తుంది. 
ఒక మహాపండితుడు ఉన్నాడు.  అయన సకలశాస్త్ర పారంగతుడు.  కానీ,  దరిద్రముతో ఓడుతున్నాడు.    ఆయన ఒకరోజు పొరుగు రాజ్యం వెళ్లి అక్కడి రాజును కలిసి తన పాండిత్యంతో మెప్పించాడు.  మనిషి స్వభావాన్ని,  ధనవ్యామోహాన్ని,  దురాశను,  నైతిక పతనాన్ని సోదాహరణంగా వివరిస్తూ పెద్ద ఉపన్యాసం చేశాడు.  రాజుగారు ఆయన పాండిత్య వైభవానికి అబ్బురపడి "మీకు ఏమివ్వాలో నాకు తెలియడం లేదు.  ఎంత ఇచ్చినా తక్కువే.  నా రాజ్యం మొత్తం ఇచ్చినా దోషం లేదు.  అయితే అది సాధ్యం కాదు కాబట్టి  ఒక పని చేస్తాను.  రేపు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ మీరు నా రాజ్యంలో ఎంత దూరం నడుస్తారో, ఆ భూమి అంతా మీకే చెందుతుంది.  మా అధికారులు మీ వెనుకే వస్తారు"  అని అందుకు తగినట్లుగా అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. 
మరునాడు సూర్యోదయం కాగానే పండితుడు నడక ప్రారంభించాడు.  అరగంటసేపు నడిచిన తరువాత పరిగెత్తితే ఇంకా ఎక్కువ భూమి కవర్ అవుతుందని తోచగానే పరుగు ప్రారంభించాడు.  మధ్యాహ్నం పన్నెండు గంటలవరకు నలభై కిలోమీటర్ల దూరం పరిగెత్తాడు.  ఎండ నిప్పులు కక్కుతున్నది.  మంచినీళ్లు తాగుదామని అనిపించినా, రెండు నిముషాలు ఆగితే కనీసం అరకిలోమీటరు భూమిని కోల్పోతానని అనిపించి లేని శక్తిని కూడగట్టుకుని పరుగు వేగాన్ని పెంచాడు.  ఒంటిగంట అయింది.  "బ్రాహ్మణోత్తమా...భోజనవేళ  అయింది.  భోంచెయ్యండి.  అరగంటసేపు విశ్రాంతి తీసుకోండి"  అని కేకలు పెట్టారు వెనుకే గుర్రాలమీద వస్తున్న అధికారులు.  అయితే బ్రాహ్మణుడు మాత్రం "తనకు రావాల్సిన భూమిని తగ్గించి ఆదా చేసుకోవడానికే అధికారులు భోజనం నెపంతో ఆగమంటున్నారు"  అని అనుమానించి  ఇంకా వేగంతో పరిగెత్తడం మొదలు పెట్టాడు. 
సాయంత్రం ఆరుగంటలయ్యేసరికి సూర్యుడు పడమర దిక్కున వాలిపోయాడు.  పండితుడు కూడా సత్తువ మొత్తం చచ్చిపోయి, నాలుక పిడుచగట్టి, భయంకరమైన శిరోభారంతో తల బరువెక్కి, మోకాళ్ళు నొప్పులతో నీరసంగా నేలమీద వాలిపోయాడు.  భూమి మొత్తం గిర్రున తిరుగుతున్నది.  కళ్ళు తెరుచుకోవడం లేదు...అధికారులు అతడిని  సమీపించి "పండితోత్తమా...ఇదిగో మీరు మొత్తం పరిగెత్తినది వంద కిలోమీటర్ల దూరం.  ఆ భూమి మొత్తం మీదే.    ఇవిగో అధికారిక  పత్రాలు.  స్వీకరించి సంతకం చెయ్యండి"  అని కాగితాలను అందించారు. 
పండితుడికి నోట మాట రావడం లేదు.  దాహంతో నాలుక కుదించుకుని  గొంతులోపలికి  వెళ్ళిపోయింది .  ఆయాసంతో వగరుస్తున్నాడు.  ఆయన కళ్ళకు కాగితాలు కనిపించడం లేదు.  మహిషవాహనుడు పాశం చేబూని కనిపిస్తున్నాడు.  పండితుడికి తన భవిష్యత్ అర్ధం అయింది.  బలవంతంగా చేతులు జోడించి " ఎంత చదువుకున్నా, ఎంత విజ్ఞానం సంపాదించినా, ఆశను మాత్రం జయించలేకపోయాను.  ఇప్పుడు నాకు కావలసింది వంద కిలోమీటర్ల భూమి కాదు.  ఆరు అడుగుల నేల.  అది ఇప్పించండి చాలు"  అని తల వాల్చేశాడు!
మనిషి ఆశతో జీవించాలి.  దురాశతో మాత్రం కాదు.  ఒక వయసు వచ్చాక, సంపాదనను సద్వినియోగం చేసినవారే ధన్య జీవులు.  స్వర్లోకానికి వెళ్ళేటప్పుడు ఒత్తి చేతులతో వెళ్ళరాదు.  కాసింత పుణ్యాన్ని మూటగట్టుకుని వెళ్ళాలి.  మరో ఉత్తమ జన్మకు అదే మన పెట్టుబడి! 
- ఇలపావులూరి మురళీ మోహన రావు
 

Related Posts