YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

రామాయణం 24 వేల శ్లోకాలు. మొత్తం 6 కాండలు

రామాయణం 24 వేల శ్లోకాలు. మొత్తం 6 కాండలు

రామాయణం 24 వేల శ్లోకాలు. మొత్తం 6 కాండలు, అవి, బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ కాండలు, 6 కాండల మీద ఒక కాండ, ఉత్తర కాండ. రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు. కేవలం రాక్షససంహారం కోసమే రామావతారము వస్తే, రావణుడిని చంపిన తరువాత ఆయన అవతార సమాప్తం చెయ్యాలి, కాని ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు, అదేంటంటే, "దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ ", నేను పదకొండువేల సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి, ఈ భూమండలాన్నంతటిని పరిపాలిస్తాను అని. రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలలో గడిపాడు, భగవంతుడు కనుక, రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు, భగవంతుడు కనుక, రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు, భగవంతుడు కనుక, రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు, భగవంతుడు కనుక, ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమి ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవానుడిలాగ బతికి చూపించలేదు, ఒక మనిషిలాగ బతికి చూపించాడు. మనం ఎలా బతకాలో చూపించాడు.
అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందొ, అంత కాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు. తల్లితండ్రుల దెగ్గర, సోదరుల దెగ్గర, గురువుల దెగ్గర, భార్య దెగ్గర ఎలా ఉండాలొ, ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలొ రాముడిని చూసి నేర్చుకోవాలి.
యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్,తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్
బాష్పవారి పరిపూర్ణలోచనమ్,మారుతిం నమత రాక్షసాంతకమ్.
ఎక్కడన్నా రామాయణం గూర్చి మాట్లాడుతుంటె స్వామి హనుమ తప్పకుండా వచ్చి వింటారు.
రామ అంటె లోకులందరినీ రమింపచేసే నామం. రావణాసురుడు బ్రహ్మ దేవుడి గురించి తపస్సు చేసి నరవానరములు తప్ప అన్ని జీవరాశులతో చావు రాకూడదని వరం కోరుకున్నాడు. నరవానరాలని ఎందుకు విడిచిపెట్టావు అని బ్రహ్మ అడగలేదు, రావణుడే చెప్పాడు, ఇంతమందిని అడిగాను నాకు నరవానరాలు ఒక లెక్క అన్నాడు. రావణుడి దృష్టిలో మనుషులకి ఉన్న స్థానం అది. నరుడంటె అంత చులకనగా చూసే రోజుల్లో నరుడిగా పుట్టి, ఒక మనిషి తలుచుకుంటె ఏదన్నా సాధించగలడు అని నిరూపించినవాడు శ్రీరామచంద్రుడు. అందుకే మనిషిగా పుట్టిన ప్రతిఒక్కరు రామనామం చెప్పాలి.
కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
రాముడి యొక్క ఆయనం(నడక) కనుక దీనికి రామాయణం అని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు. అలాగే ఆయన రామాయణానికి సీతాయాశ్చచరితమ్ మహత్:, పౌలస్త్య వధ అనే పేర్లు కూడా పెట్టుకున్నారు.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts