YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*సర్వం 'లక్ష్మీ'మయం*

*సర్వం 'లక్ష్మీ'మయం*

◆ 'చంద్రాం చంద్రసహోదరీం'  లక్ష్మీదేవి రసస్వరూపిణి. అందుకే రసమయుడxైన చంద్రుని కళల వృద్ధిననుసరించి ఆమెను ఆరాధించడం. ఆహ్లాదం, ప్రసన్నత, ఆర్ద్రత (రసస్వభావం), నిండుదనం, ప్రీతి... మొదలైనవన్నీ చంద్రభావనలు. ఈ భావనల దేవత "లక్ష్మీ".
◆ భగవంతుని కృపే లోకాన్ని లక్షిస్తోంది (చూస్తోంది). ఆ చూపుల చలువే లోకాలకు కలిమి. అందరికీ లక్ష్యమైన దేవి, అందరినీ 'లక్షిం'చే శక్తి - "లక్ష్మి".
◆ మంచి అలవాట్లు, సద్గుణాలు, సౌమనస్య వాతావరణం, శుచి, శుభ్రత, సదాచారం కలిగిన ఇంట లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది. ఏ ఇంట దేవ, పితృకార్యాలు నిత్యం జరుగుతాయో, ఆ ఇంట సిరి తాండవిస్తుంది.
◆ పూజలో ఆరాధించే స్వరూపం 'కలశం'. కలశంలో బియ్యమో, జలమో వేసి పచ్చని చిగుళ్ళు పెట్టి, దానిపై ఫలాన్ని ఉంచి ఆరాధించడం విశేషం. బ్రహ్మాండమనే కలశంలో సంపద, పచ్చదనం (మంగళం), సత్ఫలం నిండి ఆరాధన పొందుతున్నాయి.
◆ జగతిని పోషించి ఐశ్వర్య శక్తి, లక్షణ శక్తి..లక్ష్మి. ఏ వస్తువు లక్షణం దానికి ఐశ్వర్యం. కంటికి చక్కని చూపు, శరీరానికి చక్కని ఆకృతి లక్ష్మి. ఇలా ప్రకృతిలో ప్రతి పదార్థానికి ఉండవలసిన లక్షణ సమృద్ధి, కళ లక్ష్మీస్వరూపం.
◆ ప్రతికూల పరిస్థితులను దాటడమే "జయలక్ష్మీ". పనికి కావాల్సిన తెలివితేటలు, సమయస్ఫూర్తి, సరియైన నిర్ణయశక్తి, విజ్ఞానం... వంటివన్నీ "విద్యాలక్ష్మి". ఫలితంగా పొందే సంపద, ఆనందం "శ్రీలక్ష్మి". దాని వలన కలిగే శ్రేష్ఠత్వం, ఉన్నతి "వరలక్ష్మి. చివరి లక్ష్యం ఇదే కనుక వరలక్ష్మీవ్రతం అంటే మిగిలిన ఐదు లక్ష్ములను కూడా ఆరాధించి, ఆ అనుగ్రహాన్ని సంపాదించడమే.
◆ విశ్వేశ్వరుని విభూతియే విశ్వం. విభూతి అనే పదానికి ఐశ్వర్యం అని అర్థం. సామాన్యంగా అంతటా ఈ విభూతి వ్యాపించి ఉన్నప్పటికీ, 'విశేషం'గా కొన్నిటియందు భాసిస్తుంది. దాన్ని 'గొప్పది'గా భావించి గౌరవిస్తారు. ఆ గొప్పతనమే 'వరం'. ఆ విభూతియే 'లక్ష్మి'. ప్రతీవారు ఆశించే ఆ 'గొప్ప ఐశ్వర్యశక్తి'యే 'వరలక్ష్మి.
◆ ఏ కార్యమైన సిద్ధే ప్రయోజనం. ఇది లెనప్పుడు కార్యానికి ప్రయత్నమే ఉండదు. అందుకే "సిద్ధి" అనేది మొదటి లక్ష్మి. సిద్ధి లభించాక, కార్య శ్రమనుండి విడుదల పొందడమే "మోక్ష లక్ష్మి".
◆ సుందరమైన బుద్ధియే - 'చారుమతి'. దురాలోచనలు, దుష్ట సంకల్పాలు, దుర్గుణాలు లేని మంచి మనసే చారుమతి. అటువంటి మంచి మనస్సునే మహాలక్ష్మి అనుగ్రహిస్తుందనే సందేశమే 'వరపక్ష్మీవ్రత కథ'లోనున్న సందేశం.
          పూజ్య గురుదేవులు,
  బ్రహ్మశ్రీ౹౹ సామవేదం షణ్ముఖ శర్మ గారు.
                (ఋషిపీఠం సంచికలో నుంచి)

Related Posts