YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నగదు లేకపోవడంతో ఆలస్యంగా ఫించన్లు

నగదు లేకపోవడంతో ఆలస్యంగా ఫించన్లు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయిలో పింఛన్లు లబ్ధిదారులకు అందడం లేదు. ఫలితంగా లబ్ధిదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లను కొంత ఆలస్యంగానైనా మొత్తం డబ్బులను ఆయా జిల్లాలకు విడుదల చేస్తోంది.  కాని బ్యాంకర్లు సకాలంలో నగదు ఇవ్వక పోవడంతో పింఛన్‌దారులకు పంచలేక పోతున్నారు.  పెద్ద నోట్లను రద్దు చేయడంతో పాత నోట్లను బ్యాంకుల్లో జమ చేసిన ఖాతాదారులు కొత్త నోట్ల కోసం బ్యాంకులకు క్యూ కడుతున్నారు. అయితే బ్యాంకుల్లో సరిపడా కొత్త నోట్లు సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖాతాదారులు ఆందోళనలకు దిగుతున్నారు. బ్యాంకుల్లో కొత్త నోట్ల రాక ఆలస్యం అవుతుండటం, వచ్చిన కొంత మొత్తం ఎందుకూ సరిపోక పోవడంతో ఖాతాదారులు బ్యాంకుల ముందు ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు సరిపడా నోట్లను సరఫరా చేయడంలో నిర్లక్ష్యం, బ్యాంకుల అధికారులు పెద్దలకు కొత్త నోట్లను అధిక మొత్తంలో ఇస్తుండటంతో ఖాతాదారులు, రైతులు, ఆసరా ఫించన్ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. మూడు నెలలు పింఛన్లు వరసగా తీసుకోకపోతే వారికి నాలుగో నెలలో రాదు. వారంతా ఇతర ప్రాంతాలకు వలస పోయారని జాబితాల నుంచి వారి పేర్లను తొలగిస్తారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనేక మంది పింఛన్‌దారులు గ్రామాలలో ఉండీ నగదు కొరతతో పింఛన్లు తీసుకోలేకపోయారు. మూడు నెలల నిబంధనతో ఇప్పుడు నాలుగో నెలలో డబ్బు వచ్చినా వీరికి ఇచ్చే అవకాశం ఉండకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం గత నెల 23న విడుదల చేసింది. వాటిని ఆ నెల చివరి వారం నుంచి ఈ నెల 11 వరకు పంపిణీ చేశారు. నాలుగు జిల్లాల్లో 4,26,405 మంది ఆసరా పింఛన్‌దారులు ఉన్నారు. వీటి కోసం ప్రభుత్వం రూ.49.66 కోట్లను కేటాయించింది. అందులో నిర్ణీత గడువు ముగిసే నాటికి 3,81,836 మందికి రూ.44.16 కోట్లను మాత్రమే పంపిణీ చేశారు. ఇంకా 44,569 మంది లబ్దిదారులకు పింఛన్లను అందించలేదు. వారికి చెల్లించాల్సిన రూ.5.49కోట్లు కూడ వెనక్కి వెళ్లి పోయాయి. దీంతో ఆసరా పింఛన్‌దారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూడు నెలల నుంచి ఆసరా పింఛన్లు తీసుకోనివారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఉమ్మడి జిల్లాలో 1,566 మంది మూడు నెలల నుంచి పింఛన్లు తీసుకోకుండా ఉన్నారు. వారికి మార్చి నెలకు సంబంధించిన ఆసరా పింఛన్లు మంజూరు అవుతాయో లేదో అనేది అనుమానంగా మారింది. సెర్ప్‌ నిబంధనల ప్రకారం మూడు నెలలు వరసగా పింఛన్లు తీసుకోక పోతే వారికి నాలుగో నెల రాదు. నగదు కొరతతో పింఛన్లను పంచలేకపోయారు. ఇప్పుడు లబ్ధిదారులకు అది శాపంగా మారింది.

Related Posts