అమరావతి ఆగష్టు 7
నేత నైపుణ్యానికి పట్టంకట్టించేలా ప్రభుత్వం అండదండ వుంటాయని జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున 'ఈ–మార్కెటింగ్'ను అందుబాటులోకి తీసుకువస్తాం. చేనేత, హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్స్. మనకు ఉన్న ఏటికొప్పాక, కొండపల్లి, బుడితి, కళంకారి, తొలుబొమ్మలు, చేనేత వస్త్రాల ఖ్యాతిని ప్రపంచానికి చాటుతాం. కరోనా కష్టకాలంలో 6 నెలల ముందుగానే రెండవ ఏడాది సాయమందించాం. చేనేత రంగంలో చెయ్యితిరిగిన తెలుగు నేతన్నలు జాతీయ స్థాయిలో మెరిశారు. యువత భాగస్వామ్యంతో చేనేతకు మరింత భవిత వుంది. చేనేతరంగం వైవిధ్యభరితం, పర్యావరణ హితకరం. వ్యవసాయం తరవాత అత్యధికులకు ఉపాధి అందించే రంగం. బాల్యం నుంచే చేనేత వస్త్రాల పట్ల అభిరుచిని కలిగిస్తే అది జీవన శైలిగా అభివృద్ది చెందుతుంది. చేనేతల విలువను పెంచడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి. చేనేతల ఉత్పత్తులకు ప్రచారం కల్పించే బాధ్యత అందరిదీ. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని కనీసం ఆ రోజైనా చేనేత దుస్తులనే ధరించాలి. చేనేత రుమాళ్లను, దుస్తులను విరివిగా కొనుగోలు చేస్తే నేతన్నతలను ప్రోత్సహించినట్టే. ఇప్పటికే ఆప్కో ద్వారా పాఠశాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుస్తులు, దుప్పట్లు అందిస్తోంది. అధునాతన ఫ్యాషన్లు, ఆకర్షణీయమైన వస్త్రధారణ పట్ల మక్కువ చూపే యువతే చేనేతకు భవిష్యత్.
యువతకు, విద్యా, ఉద్యోగ, నైపుణ్యాభివృద్దిరంగాలలో శిక్షణ, ఉపాధికి కృషి చేస్తాం. చేనేతకు ప్రత్యామ్నాయంగా జౌళి వస్త్రాలు వచ్చాయి. మరమగ్గాల వంటివి విస్తరించాయి. అతి తక్కువ శ్రమతో కోరిన డిజైన్లతో అనుకున్న వస్త్రాన్ని తయారు చేసే వెసులుబాటు వుంది. దేశంలో జౌళి పరిశ్రమ ఔషధ, ఆహారశుద్ధి, ఇంజినీరింగ్, ఐటీ తరవాతి స్థానంలో ఉంది. ప్రస్తుతం ఉన్న విధానాలు, పథకాలకు సంబంధించీ చేనేత కార్మికులకు సరైన సమాచారం లేదు. గుంతమగ్గాల స్థానంలో తక్కువ శ్రమతో పనిచేసేలా ఆధునిక మగ్గాలు వినియోగంలోకి రావాలి. చేనేతల కళా నైపుణ్యం వల్లే ఉప్పాడ, తిప్పసముద్రం, మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం, పొందూరు, చీరాల, పెడన, మాధవరం, జమ్మలమడుగు, మదనపల్లి ప్రాంతాలకు ప్రత్యేక పేరు ప్రతిష్ఠలు వున్నాయి. చేనేత రంగంలో మహిళలకు ఉపాధి..మహిళా సాధికారతకు ఎక్కువ అవకాశాలు. రాయలసీమ ప్రాంతంలో వస్త్ర పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లతో ఒప్పందం చేసుకొని ఆన్లైన్ లో ఆప్కో వస్త్రాలు తీసుకువచ్చాం. ధర్మవరం, ఉప్పాడ, వెంకటగిరి చీరలు, డ్రస్ మెటిరియల్స్, చొక్కాలు, ధోవతులు సహా మొత్తం 104 ఉత్పత్తులు ఆన్ లైన్ లో కి తెచ్చాం. చేనేత పరిశ్రమకు భరోసా ఇవ్వడమే కాకుండా , ఆర్థికంగా నేతన్న లాభపడే విధంగా ఉత్పత్తులకు ప్రభుత్వమే సర్టిఫికేషన్, మార్కెటింగ్, బ్రాండింగ్ ఇస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం.. 13 నెలల కాలంలోనే చేనేతలకు రూ.600 కోట్ల సాయం చేసాం. గత ఏడాది డిసెంబరు 21న సీఎం పుట్టినరోజునాడు అనంతపురం జిల్లా ధర్మవరంలో 'వైఎస్సార్ నేతన్న నేస్తం' పథకానికి శ్రీకారం చుట్టాం. మొదటి విడతగా గత ఏడాది రూ.200 కోట్లు, రెండవ విడతగా ఈ ఏడాది జూన్ 20వ తేదీన దాదాపు రూ.400 కోట్లు సాయం చేసాం. 'వైయస్ఆర్ నేతన్న నేస్తం' ద్వారా దాదాపుగా 81,024 వేల కుటుంబాలకు రూ.24వేల చొప్పున ఆర్థిక సాయం చేశాం. మగ్గం ఉన్న ప్రతి అక్క, చెల్లెమ్మకు ఏటా రూ.24 వేలు ఇస్తామన్న సీఎం హామీని నెరవేర్చాం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా వృత్తిని వదిలేసినవారు, కొత్తవారు ఈ రంగంలోకి రావడానికి మక్కువ చూపుతున్నారని అయనఅన్నారు.