అమరావతి ఆగష్టు 7
వికేంద్రీకరణ బిల్లుపై స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణ బిల్లులపై 11 గంటల పాటు చర్చ జరిగిందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులకు 2గంటల 17 నిమిషాల సమయం ఇచ్చామని, అసెంబ్లీలో చర్చ జరగలేదని విమర్శించడం సరికాదని తప్పుబట్టారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కానప్పుడు పెండింగ్‌లో ఎలా ఉంటుందన్నారు. సెలక్ట్ కమిటీకి పంపాలంటే ఖచ్చితంగా ఓటింగ్ జరగాలని, అలా జరగనప్పుడు.. సెలక్ట్ కమిటీ ఎలా ఏర్పాటు అవుతుందని ప్రశ్నించారు. అసెంబ్లీ వ్యవహరాల్లో కోర్టుల జోక్యం వీల్లేదని, 1997లో మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు రూలింగ్ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు సభ తీసుకునే నిర్ణయాలపై కోర్టులకు వెళ్తారా అంటూ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు.