YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ఆస్పత్రి వద్దు... హోం క్వారంటైనే ముద్దు

ఆస్పత్రి వద్దు... హోం క్వారంటైనే ముద్దు

ఏలూరు, ఆగస్టు 8, 
రాష్ట్రంలో కోవిడ్‌ బారిన పడిన రోగులకు వైద్యం అందించేందుకు మూడు కేటగిరిల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. ఐదు రాష్ట్రస్థాయి కోవిడ్‌ ఆస్పత్రులతో పాటు 19 జిల్లా స్థాయి కోవిడ్‌ ఆస్పత్రులు, 67 కోవిడ్‌ హెల్త్‌కేర్‌ సెంటర్లు, 275 కోవిడ్‌ కేర్‌ సెంటర్లను అందుబాటులో ఉంచింది. ఈ ఆస్పత్రుల్లో సేవలు అందిచేందుకు 50 వేలకు పైగా వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది పనిచేస్తున్నారని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఇటీవల కేసులు పెరగడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతులు చాలక, సరిపడా వైద్య సిబ్బంది లేక రోగులు అవస్థలు పడుతున్నారు. చాలా ఆస్పత్రుల్లో వెంటిలేటర్స్‌ లేవు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ ఆస్పత్రిలో రోగికి ఊపిరందక ఇబ్బంది పడినా వైద్యులు పట్టించుకోవడం లేదన్న వీడియో ఇటీవల కాలంలో వైరలైంది. ప్రకాశం జిల్లాలో తాగడానికే కాకుండా మరుగుదొడ్లలోనూ నీటి సదుపాయం లేదు. ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో కొకొల్లలుగా జరుగుతున్నా ప్రభుత్వంలో మార్పు రావడం లేదన్న వాదన వినిపిస్తుంది.రాష్ట్రంలో ప్రస్తుతం వరకూ 72 వేల మందికి పైగా కరోనా వైరస్‌తో ఉండగా, ప్రభుత్వం కేవలం 46,198 బెడ్లను మాత్రమే అందుబాటులో ఉంచింది. దీంతో బెడ్లు చాలక చిన్నచిన్న లక్షణాలున్నవారిని పట్టించుకోవడం మానేశారు. అటువంటి వారెవరైనా ఉంటే ఇంటి దగ్గరే హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. కాగా చాలా మంది రోగులు కోవిడ్‌ ఆస్పత్రులు, హెల్త్‌కేర్‌ సెంటర్లు, కేర్‌ సెంటర్లలో సౌకర్యాలు లేవన్న కారణంతో అక్కడ ఉండేందుకు ఇష్టపడటం లేదు. ఇంటికి వెళ్లి హోమ్‌ క్వారంటైన్‌ తీసుకోవడంవైపే దృష్టి పెడుతున్నారు. యంత్రాంగం కూడా రోగి ఆస్పత్రిలో చేరిన తర్వాత వరుసుగా మూడు రోజులు జ్వరం లేకపోతే ఇంటికి పంపించేస్తున్నట్లు సమాచారం.రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పుడు లాక్‌డౌన్‌తోపాటు వైరస్‌ నియంత్రణ పేరిట ప్రభుత్వం అనేక నిబంధనలు అమలు చేసింది. ప్రస్తుతం 72 వేల కేసులు దాటిపోగా మరణాలు కూడా 880కు పైగా ఉన్నాయి. సకాలంలో వైద్యం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనాను కట్టడిచేసి, ప్రజలను జాగ్రత్తగా ఉంచాల్సిన ఈ సమయంలో స్వీయ జాగ్రత్తలు, సొంత వైద్య పర్యవేక్షణ అంటూ ప్రభుత్వం నిబంధలను నీరుగారుస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా సోకిన వారికి అందించాల్సిన చికిత్స, పరీక్షల నిర్వహణ, డిశార్జి తదితరాలపై నిబంధనలు ఇప్పటికి చాలాసార్లు మారాయి. ఇప్పుడు వాటిని మరోసారి మరింత సడలించారు. ఇంట్లోనే వైద్య పర్యవేక్షణకు అలవాటు పడండి అంటూ ఇన్‌స్టాండ్‌ ఆర్డర్‌ ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా డిశార్జి సమయంలో మళ్లీ పరీక్షలు చేయాల్సినవసరం లేదని ఉత్తర్వులు ఇచ్చారు. తర్వాత ఏడు రోజులు ఇంట్లో ఉంటూ సొంతంగా వైద్యపర్యవేక్షణ చేసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా సోకిన వ్యక్తి స్వేచ్ఛగా బయట తిరిగినా, ఎంత మందికి వైరస్‌ అంటించినా అడ్డుకునేవారు లేరు. ఆ వ్యక్తి కదలికలపై సర్కారు నియంత్రణ లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఆస్పత్రుల్లో పడకలు ఖాళీగా లేవని అనేక మందిని తిప్పి పంపిస్తున్నట్లు సమాచారం. అలా వెళ్లినవారు కరోనా ఉందో, లేదో కూడా తెలియకుండానే చనిపోతున్నట్లు తెలిస్తోంది. రానున్న రోజుల్లో కేసులు భారీగా పెరిగితే ఆస్పత్రుల్లో పడకలు పెంచుతారా? లేక ఎవరింట్లో వారే ఉండి సొంత వైద్యం చేసుకోమని సలహా ఇస్తారోనన్న ఆందోళణ వ్యక్తమవుతుంది.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాకు ఐదువేల బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. కోవిడ్‌ ఆస్పత్రుల్లో ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా రోగులు 1902 కాల్‌సెంటర్‌ ద్వారా సమాచారం ఇవ్వొచ్చు. అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల్లోనూ హెల్ప్‌ డెస్కులు ఏర్పాటు చేస్తున్నాం. రానున్న రోజులు ఇంకా కేసులు పెరిగితే సేవలందించేందుకు మరో 17 వేల మంది వైద్యులను, 12 వేల మంది నర్సులను కూడా సిద్ధంగా ఉంచామని కో ఆర్డినేటర్ క్రిష్ణబాబు తెలిపారు.

Related Posts