విజయవాడ, ఆగస్టు 8,
వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం జగన్ వేసిన మూడు రాజధానుల స్కెచ్.. ఏ మేరకు ఆయన పార్టీకి మేలు చేస్తుందనే విషయాన్ని పక్కన పెడితే.. మిగిలిన పార్టీలకు కూడా ఇది పెద్ద మైనస్ అయ్యేలా ఉందని అంటున్నారు విశ్లేషకులు. రాజధానిగా అమరావతిని పక్కన పెట్టి.. కేవలం శాసన రాజధానిని మాత్రమే చేసిన జగన్‌పై రాజధాని రైతులు, ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో ఇక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జగన్ నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడడంతో వీరిపై ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు.ఇది సహజమే. ప్రజల కోపాన్ని అర్ధం చేసుకోవాల్సిందే. సో.. రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీపైనా ఆ పార్టీ నేతలపైనా కూడా ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేం. ఇంత వరకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, ఇక్కడే ఒక కీలకమైన విషయం తెరమీదికి వచ్చింది. రాజధాని ఎఫెక్ట్ కేవలం వైఎస్సార్ సీపీ మీదేనా? అంటే కాదని అంటున్నారు పరిశీలకులు. టీడీపీ సహా జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులపైనా ఈ రాజధాని ఎఫెక్ట్ తీవ్రంగానే ఉంటుందని చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ తమకు ఉనికి లేకుండా చేసిందనే ఆవేదనతో ఆ పార్టీపైన ఇక్కడ ప్రజలు ఆగ్రహించే అవకాశం ఉంది.దీనికి ప్రధాన కారణం.. రాజధానిని అమరావతిలోనే ఉంచడంలో జగన్ పై పోరాడిన ఈ పార్టీలన్నీ కూడా పూర్తిగా విఫలమయ్యాయి. గత ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలో సీట్లన్ని వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. చివరకు మంగళగిరిలో పోటీ చేసిన చంద్రబాబు తనయుడు లోకేష్‌ను కూడా ఇక్కడ ప్రజలు ఓడించారు. అలాంటి చోట ఉన్న రాజధానిని జగన్ వికేంద్రీకరించడం ఇక్కడ సొంత పార్టీ నేతలకు నచ్చడం లేదు. పైగా బీజేపీ కాపాడుతుందని అనుకున్న రాజధాని ప్రజలకు మొండిచేయి లభించింది. కన్నాను నమ్ముకున్న ప్రజల కన్నీళ్లే మిగిలాయి. ఆ మాటకు వస్తే ఏపీ ప్రజలు బీజేపీని నమ్మడం ఎప్పుడో మానేశారు.ఇక, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ కు వచ్చి పెరుగన్నాలు తిని.. రాజధాని ఎక్కడికీ పోదని చెప్పినా..ఇప్పుడు ఆయన కూడా చేతులు ఎత్తేయడం, బీజేపీతో చెలిమిని కొనసాగించడం వంటి పరిణామాలను గమనిస్తే.. రాజధాని ప్రజలకు జగన్‌పై ఉన్న ఆగ్రహమే వీరిపైనా కనిపిస్తోంది. పవన్ రాజధాని రైతుల తరపున పోరాడాతనని చెపుతున్నా ఇక్కడ ప్రజలు పవన్‌ను నమ్మే పరిస్థితుల్లో లేరు.ఇక, చంద్రబాబు విషయాన్ని తీసుకుంటే..అధికారంలో ఉన్నప్పుడే.. కనీసం 80 శాతం నిర్మాణాలు పూర్తి చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. ఆయన నాన్చుడు ధోరణిని అవలంభించారు. అంతేకాదు, తన వారికి ఇక్కడ భూములు కేటాయించడం.. ఎన్నికల్లో లబ్ధి కోసం అమరావతిని వినియోగించుకునేందుకు ప్రయత్నించారని భావన ఇప్పుడు తెరమీదికి వస్తోంది. చంద్రబాబు రాజధాని పేరుతో చేసింది అంతా హడావిడే అని నమ్మిన ప్రజలు ఆయన తనయుడినే ఓడించారు. ఇంక అంతకన్నా దారుణ పరాజయం ఏం ఉంటుంది ? ఈ పరిణామాల నేపథ్యంలో రాజధాని సెగ .. జగన్‌తోపాటు.. ఇతర పార్టీలపైనా ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.