రైల్వేకోడూరు జాతీయ రహదారిపై జరుగుతున్న తారుపనుల్లో నాణ్యత నిబంధనలను రోడ్డు రోలరుతో తొక్కేస్తున్నారు. ఇక్కడ కొత్తగా తారురోడ్డు పనుల కోసం సుమారు రూ.40 కోట్లు వెచ్చిస్తున్నారు. నిర్మాణ సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో వేసిన మూణ్నాళ్లకే దెబ్బతింటోంది. లక్ష్యం నీరుగారిపోతోంది. రోజుకు వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారి పనుల్లో నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో నాణ్యత దెబ్బతింటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తారులేచిపోతోంది... రోడ్డు పగుళ్లు బారుతోంది.కొత్త రోడ్డుపొర కింద ఉన్న పాతరోడ్డు కనిపిస్తోంది. రైల్వేకోడూరు - మంగంపేట మధ్యలో పది కిలోమీటర్లు, రెడ్డిపల్లి - ఆకేపాడు మధ్యలో 22 కి.మీ, మంటంపల్లి- ఒంటిమిట్ట పరిధిలో 12 కిలోమీటర్ల మేర కొత్తగా రహదారి నిర్మాణం కోసం సుమారు రూ.40 కోట్లను ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తి చేశారు. మండలంలోని బోయనపల్లికి సమీపంలో రాజంపేట పట్టణం, బైపాస్ మార్గం కలిసే ప్రాంతంలో ఇటీవల వేసిన తారురోడ్డు దెబ్బతింది. సాధారణంగా కొత్తగా వేసేటప్పుడు పాతరోడ్డును తొలగించి లేదంటే గాట్లు పెట్టి వేయాలి. మరి ఇక్కడ ఎలా వేశారోగానీ కొద్ది రోజులకే పాడైపోయింది. పగుళ్లుబారి పాతరోడ్డు కనిపిస్తోంది. ఒంటిమిట్ట చెరువుకు సమీపంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. రహదారి అంచులు కూడా సక్రమంగా లేవు. రూ.కోట్లు ఖర్చుపెట్టి చేస్తున్న పనులపై అధికారులు దృష్టిసారించకపోతే ఇలాగే ఉంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. దెబ్బతిన్న ప్రాంతంలో పూర్తిగా తొలగించి కొత్తగా వేస్తామని అధికారులు చెబుతున్నా అతుకుల్లాగే ఉండే పరిస్థితి. ఆ రోడ్డు ఎన్నాళ్లు ఉంటుందో తెలియని స్థితి.