YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*ఆయన ఆదిశేషుడి అవతారమే !*

 *ఆయన ఆదిశేషుడి అవతారమే !*

సాధారణంగా ఏ గ్రామానికి వెళ్లినా అక్కడి సీతారామాలయంలో సీతారాములతో పాటు లక్ష్మణుడు కూడా దర్శనమిస్తూ వుంటాడు. సీతారాములతో పాటు లక్ష్మణుడు కూడా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. లోకంలో సీతారాముల దాంపత్యం ఎంతటి ఆదర్శప్రాయమైనదిగా చెప్పబడుతూ వుంటుందో, అన్నదమ్ములుగా రామలక్ష్మణుల అనుబంధం గురించి కూడా అదే విధంగా చెప్పుకుంటూ వుంటారు.
కైకేయి కోరినది .. దశరథుడు అడవులకు వెళ్లమన్నది రాముడిని మాత్రమే. అయితే రాముడిని విడిచి క్షణమైనా ఉండలేని లక్ష్మణుడు, అన్నకంటే ముందుగానే సిద్ధమై కూర్చుంటాడు. కొన్ని సంవత్సరాల పాటు భార్యకి దూరంగా ఉండవలసి వస్తుందని తెలిసి కూడా, రాముడు ఎంతగా వారిస్తున్నా వినిపించుకోకుండా బయలుదేరుతాడు.
సీతారాముల విశ్రాంతి ప్రదేశాలను ఎంపిక చేస్తూ .. అనుక్షణం వాళ్లని కాపాడుకుంటూ వస్తాడు. అన్నావదినలతో పాటు తాను కూడా కష్టాలు పడుతూ, ఆ కష్టాల గురించిన ప్రస్తావన చేయకుండా సేవలు చేస్తూ ఉండేవాడు. మారీచుడు మాయలేడిగా వచ్చినప్పుడు రాముడి ఆదేశానికి కట్టుబడి సీతకి రక్షణగా వుంటాడు. సీతమ్మ ఆవేదనను అర్థం చేసుకుని రాముడి కోసం వెళతాడు. సీతమ్మను రావణుడు అపహరించాడని తెలిసి, రాముడితో పాటు ఆమె జాడ తెలుసుకోవడానికి అనేక కష్టాలను అనుభవిస్తాడు.
మేఘనాథుడు వంటి వీరులతో లక్ష్మణుడు తలపడతాడు. ఏ శక్తి అయినా ముందుగా తనని దాటుకునే రాముడిదాకా వెళ్లాలనే బలమైన ఉద్దేశం లక్ష్మణుడిలో కనిపిస్తుంది. రాముడికి అండగా ఉండటం కోసమే తాను వెన్నంటి వచ్చినట్టుగా వుండేవాడే తప్ప, రాముడు తీసుకునే ఏ నిర్ణయంలోను జోక్యం చేసుకునేవాడు కాదు. ఎందుకంటే రాముడు చెప్పిందే ధర్మం .. చేసేదే ధర్మమని లక్ష్మణుడికి తెలుసు.
అనుక్షణం రాముడిని నీడలా అనుసరించిన లక్ష్మణుడు, సాక్షాత్తు ఆదిశేషుడి అవతారమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతుంటాయి. ఇక లక్ష్మణుడు వంటి సోదరుడు లభించడం తన అదృష్టంగా రాముడే స్వయంగా సెలవిచ్చాడు. అందుకే రాముడిచే లక్ష్మణుడు ప్రశంసలు అందుకున్నాడు. ఆయనతో పాటు అశేష భక్తజనావళిచే పూజలు అందుకుంటున్నాడు.

Related Posts