ప్రాచీన హిందూ దేశంలో దక్షిణ ప్రాంతాన్ని. పరిపాలించిన
పల్లవ చక్రవర్తులు కళాపోషకులు. సాహిత్యం , సంగీతం , నృత్యం , శిల్పం మొ. కళా రూపాలెన్నో పల్లవుల కాలంలో ఎక్కువగా అభివృద్ధి చెందాయి.
పల్లవుల కాలం నాటి శిల్పకళా చాతుర్యాన్ని ,
ఆనాటి కళా వైభవానికి
ప్రత్యక్ష సాక్షి మహాబలిపురం.
శిల్పకళలో మహేంద్ర వర్మ పల్లవుని, కల్పనాశక్తి చూసి
ఆశ్చర్యపడిన ఆనాటి సుప్రసిధ్ధ శిల్పులు ఆయనకి
" విచిత్ర సిధ్ధుడు" అనే బిరుదు యిచ్చారు.
"చిత్ర శార్దూలుడు" అనే మరో బిరుదు వున్నది.
మహేంద్రవర్మ సంస్కృత భాషలో గొప్ప పండితుడు. 'మత్తవిలాస
ప్రహసనం' అనే హాస్యనాటకం వ్రాసినందున
ఆయనకి
"మత్త విలాసర్"
అనే బిరుదు వున్నది.
సంగీతంలో సుప్రసిద్ధ వైణికుడైన రుద్రాచార్యుని వద్ద సంగీత కళని నేర్చుకుని, ' పరివాదని' అనే వీణ వాయించడంలో,
సంకీర్ణ జాతి" అనే తాళాన్ని ఎంతో లాఘవంగా వేసే శక్తి ని
కలిగినవాడు మహేంద్రవర్మ
పల్లవ చక్రవర్తి.
అందువలన
" సంకీర్ణ జాతి ప్రకణర్"
అనే బిరుదుని కూడా పొందేడు.
ఈ విధంగా పలుకళలో ఖ్యాతిగాంచిన మహేంద్రవర్మ
చక్రవర్తి నిర్మించిన శిల్ప కళా ఖండాలలో ఒకటి సీయమంగళం గుహాలయం.
తిరువణ్ణామలై జిల్లా, దేసూరు నుండి సుమారు రెండు కి.మీ దూరంలో సీయమంగళం.
ఇక్కడ వున్న ఒక కొండ మీద పడమటి ముఖంగా నిర్మించబడినది యీ గుహాలయం.
మహేంద్రవర్మ చక్రవర్తికి ఎన్నో బిరుదులు. అందులో ఒకటి అయిన
" అవనిభాజనన్" అనే పేరుతో యీ గుహాలయం
పిలువబడుతున్నది.
7 వ శతాబ్దంనాటి ఈ గుహాలయం నిర్మాణానికి
30 సంవత్సరాలు పట్టింది.
ఈ ఆలయంలోని ఈశ్వరుని
"తూణ్ ఆండార్" అని
(స్ధంభేశ్వరుడు) అని పిలుస్తారు.
గర్భగుడి, అర్ధమండపం,
ముఖమండపం, గోపురాలతో
నిర్మించబడినది. రెండు వరసల స్ధంభాలు,యీ గుహాలయంలో అలంకరించబడి వున్నాయి.
ఈ గుహాలయానికి, రాష్ట్రకూటుల రాజైన కణ్ణరదేవుని కుమార్తె , మరెందరో చోళరాజులు ఈ ఆలయానికి మడులు మాన్యాలు
ఇచ్చి దైవకార్యాలకు
తమని అర్పించుకున్నారు.
మహేంద్రవర్మ చక్రవర్తి తండ్రియైన సింహవిష్ణువుని పేరు మీద " సింహవిష్ణు చతుర్వేదిమంగళం" అని పిలవబడిన యీ ఆలయం వున్న
ప్రదేశం తర్వాత కాలంలో
" సీయ మంగళం" గా మారినది. ఈ ఆలయంలోని
శిల్పాలన్నీ అపూర్వ నైపుణ్యానికి ఆలవాలం.
గుహాలయ దక్షిణ దిశగా
అర్ధ స్తంభంపై 'రిషభాందకర్'
శిల్పం వున్నది. పరమశివుడు , పార్వతి
నందిని ఆనుకుని నిలబడి వున్న భంగిమ.
ప్రధమ రాజరాజన్ మరియు
ఆది రాజేంద్రన్ రాజుల కాలాలలో
ఈ ఆలయంలోని భగవంతుడు, "తిరు కట్రళి మహాదేవర్" అని, పిలవబడినా ,
విక్రమచోళుని కాలము నుండి "తూణ్ఆండార్"
(స్ధంభేశ్వరుడు)
అని పిలవబడినట్లుగా శాసనాలు తెలుపుతున్నాయి.
కణ్ణరదేవుని పుత్రిక
అక్కయదేవి భగవంతుని
నివేదనలకి ఎంతో భూమిని దానం చేసిన శాసనాలు ఇక్కడ కనిపిస్తాయి.
సహజ ప్రకృతి సౌందర్యాల మధ్య ,
మహా సిధ్ధపురుషులు సేవించుకున్న ఈశ్వరునిగా నేటికీ
సీయమంగళం ఈశ్వరుడు విరాజిల్లుతున్నాడు
అతి గొప్ప ప్రాచీన శిల్పకళా సంపద
కలిగిన యీ శివాలయాన్ని
నిత్యం అనేక మంది భక్తులు
దర్శించుకొని స్ధంభేశ్వరుని
కృపకి పాత్రులు అవుతున్నారు.
ఆలయ స్ధంభం పైన
నాలుగు చేతులతో నటరాజస్వామి మూర్తి,
ఆయనను సేవించుకుంటున్న
ఇద్దరు భక్త దాసుల మూర్తులు
శిల్పాలుగా చెక్క బడి వున్నాయి. ఈ శిల్పం
పురాతనమైన "నటరాజస్వామి విగ్రహం " అని , ' అరవై నాలుగు కళల
వైభవం' అనే తమిళ గ్రంథం వలన అవగతమవుతున్నది.
భరతనాట్య శాస్త్రంలో వర్ణించబడిన "భుజంగ త్రాసం" అనే కరణం
ఆధారం మలచబడిన " భుజంగ త్రాసిత
మూర్తి శిల్పం అత్యద్భుతం. ఈ శివుని శిల్పం కాలికింద
సాధారణంగా కానవచ్చే ముయలకన్ ఉండడు. బదులుగా కుడిప్రక్కన సర్పము ఒకటి వుంటుంది. పైకి వున్న చేతిలో ఢమరుకానికి బదులు గొడ్డలి వుంటుంది. క్రిందకి వున్న హస్తం "డోలా ముద్ర" చూపి అనుగ్రహిస్తున్నది.
అనుగ్రహ స్ధంభేశ్వరుని
గుహాలయ గర్భాలయంలో
స్ధంభేశ్వరుని లింగరూపం,
చతురస్రంగా వున్న పానువట్టంతో వుంటుంది.
ఈ శివలింగాన్ని ప్రత్యేకంగా ప్రతిష్టించినట్లుగా గోచరిస్తుంది.
గర్భగుడి ప్రవేశ ద్వారం
వద్ద ద్వార పాలకుల
విగ్రహశిల్పాలు బహు రమణీయం.
కుడి ప్రక్కన ఉన్న ద్వారపాలకుని
తలమీద కొమ్ము కనిపిస్తుంది.
మెట్ట మీద కుమారస్వామికి
ఒక ప్రత్యేక ఆలయం నిర్మించబడినది. ఆ మెట్టపైకి మెట్లు
లేనందువలన ఎక్కడం
శ్రమపడవలసి వున్నది.
స్థంభేశ్వరునికి నిత్యమూ పూజలు
అభిషేకాలు , ప్రత్యేకోత్సవాలు ఘనంగా జరుగుతాయి.
దిండివనం నుండి వందవాసి , కాంచీపురం
వెళ్ళే మార్గంలో 20 కి.మీ దూరంలో తెళ్ళారు అనే ఊరు వున్నది. ఈ ఊరు నుండి 8 కి.మీ
దూరంలో సీయమంగళం.
తెళ్ళారుకి దేసూరు 6 కి.మీ దూరంలో వున్నది. దేసూరు నుండి సీయమంగళానికి ఆటో
వసతి కూడా లభ్యం.