వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. జగన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముఖ్య నేతలు బొత్స, ఎమ్మెల్యే కొడాలి నాని, వంగవీటి రాధా, వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటూ కార్యకర్తలంతా అధినేతతో కలిసి అడుగులు వేశారు. కార్యకర్తలు భారీగా తరలిరావడంతో... వారధి ఫ్లై ఓవర్ కిక్కిరిసి పోయింది. బ్రిడ్జ్ పొడవునా జనాలు ఉండటంతో వాహనాలన్నీ నిలిచిపోయాయి. దాదాపు అరగంటసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. యాత్ర ఇవాళ వారధి దగ్గర ప్రారంభమై ముగుస్తుంది. మధ్యలో చిట్టినగర్ సెంటర్‌లో జరిగే బహిరంగం సభలో జగన్ ప్రసంగిస్తారు.మరోవైపు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైసీపీలో చేరారు. వారధి దగ్గర రవికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటూ మరికొంతమంది నేతలు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. యలమంచిలి 2009లో పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్‌లో కొనసాగిన ఆయన... 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన... అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది.