YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*అసలైన పూజ*

*అసలైన పూజ*

ఎన్ని పూజలు,నోములు, ఎంతో సాధన చేస్తున్నాను, అయినా నాకెందుకు ఈ కష్టాలు? అనుకోని సంఘటనలు ఎందుకు నాకెదురౌతున్నాయి? ఏమిటీ బాధలు....అని ఒక గొప్ప సందేహం ...
*అసలు పూజ, సాధన, ప్రార్ధన అంటే ఏమిటి?*
దేవుడిచ్చిన ప్రతీదానిని నిరసనలు లేకుండా, ప్రసాదంలాగా స్వీకరించడమే నిజమైన పూజ.
దేవుడు మనకిచ్చిన బంధాలపట్ల, చేస్తున్న వృత్తిపట్ల, ప్రవృత్తి పట్ల, ప్రకృతి పట్ల, మన చుట్టూ ఉన్న ప్రతిదానిపట్ల, కృతజ్ఞతాపూర్వకంగా ఉండడమే పూజ.
అహం, మనస్సు, రాగద్వేషాలు నాశనమే నిజమైన సాధన.
అంతఃకరణను శుద్ధి చేసుకోవడమే సాధన.
సత్కార్యమే అత్యుత్తమ ప్రార్ధన.
సర్వుల యందు సమస్తమందు ప్రేమగా దయగా ప్రవర్తించడమే నిజమైన ప్రార్ధన.
భూమి మీద కొన్ని అనుభవాలు పొందటానికే శరీరం వచ్చింది. ఆ అనుభవాలు పొందింపచేయటం ద్వారా ఈశ్వరుడు మిమ్మల్ని వివేకవంతులను చేస్తాడు. చెరుకుగడ గెడలాగే ఉంటే రసం రాదు. దానిని యంత్రంలో  పెట్టి పిప్పి చేస్తేనే తియ్యటి రసం వస్తుంది. అలాగే మీ దేహం అనేక కష్టాలకు గురి అయితేగానీ, దానినుండి అమృతత్వం రాదని అంటారు.
'నీకు కష్టాలు వస్తే కంగారు పడకు. నీ ప్రారబ్ధం పోగొట్టడానికీ, నీలో విశ్వాసం పెంచటానికీ కొన్ని కష్టాలు. నీకు ఇష్టమైనది చేస్తాడనుకో, గర్వం వచ్చి నీవు పాడైపోయే ప్రమాదం ఉంది. నీకు ఏది మంచిదో నీకంటే భగవంతుడికే బాగా తెలుసు. నీకు ఇష్టం లేని సంఘటనలు పంపినా, భగవంతుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని అనుకోకు, అన్నీ నీలోపల సౌందర్యం పెంచటానికి, నిన్ను మహోన్నతుడుని చేయటానికి, నీకు శిక్షణ ఇవ్వడానికీ, నీ జ్ఞానం పూర్ణం చేయటానికి ఈశ్వరుడు ఇలా చేస్తున్నాడు అని అర్ధం చేసుకోగల్గితే నీలో ఆవేదన, ఆందోళన అణిగిపోతుంది. అంతేగానీ, భగవంతుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టకు..
చాకలి బట్టలను బండ పై బాదటం వాటిపై కసితోకాదు, మురికి వదిలించి శుభ్రం చేయటానికే కదా.
దైర్యం, ధర్మం, దయ, మనో నిగ్రహం, శుచిత్వం, సహనం, సత్యభాషణం, శాంతం.......ఇత్యాది సద్గుణాలతో, నిరాడంబరంగా, కోరికలు లేకుండా, క్రోధం కల్గిన కటువుగా మాట్లాడకుండా, లోభత్వం లేకుండా, విషయవాసనలయందు ఆకర్షణలు లేకుండా, గర్వం లేకుండా, అసూయభావనలు లేకుండా సర్వస్థితులయందు సమానబుద్ధి కలిగియుండి, మనో మాలిన్యా మేఘాలను తొలగించుకుంటామో అప్పుడే సహజవైభవ సంపన్నుడగు భగవంతుడుని చూడగలం.. శివబుద్ధి కల్గితే జీవుడే ఉండడు, ఉన్నది ఈశ్వరుడే అన్న అనుభూతి కల్గుతుంది. అప్పుడే దేహం దేవాలయం అవుతుంది.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts