విజయవాడ, ఆగస్టు 10,
జగన్ ఒక్కడుగా కాంగ్రెస్ నుంచి వచ్చారు. తల్లితో కలసి ఇద్దరుగా ఎన్నికల్లో సొంత పార్టీ తరఫున గెలిచారు. ఆ తరువాత ఇంతింతై వటుడింతే అన్నట్లుగా ఎదుగుతూ ఈ రోజు దేశంలోని అన్ని చట్ట సభల్లో ప్రాతినిధ్యం సంపాదించారు. ఏపీలో అసెంబ్లీ, కౌన్సిల్లో వైసీపీ గట్టిగానే ఉంది. అలాగే పార్లమెంట్ లో చూస్తే లోక్ సభలో 22 మంది ఎంపీలతో నాలుగవ అతి పెద్ద పార్టీగా ఉంటే ఇపుడు తాజాగా ఎన్నికైన నలుగురు ఎంపీలతో రాజ్యసభలో కూడా వైసీపీ అతి పెద్ద పార్టీల్లో ఒకటిగా ఉంది. తాజాగా రాజ్యసభ కార్యకలాపాలను నిర్దేశించే బిజినెస్ అడ్వైజర్ కమిటీలో మెంబర్ గా విజయసాయిరెడ్డి నామినేట్ అయ్యారు. అంటే పెద్దల సభలో ఇకపైన వైసీపీకి కూడా తనదైన పాత్ర పోషించే చాన్స్ వస్తుందన్న మాట.ఇక వైసీపీ ప్రైవేట్ బిల్లులు అనేకం పెడుతూ వచ్చింది. గతంలో ఒక్కడుగా ఉన్నపుడు విజయసాయిరెడ్డి ఇలా కీలకమైన అంశాలపై బిల్లులు పెట్టారు. దానికి సభ అనుమతి కొరకు ఆయన కొంత ఇబ్బందిపడాల్సివచ్చింది. అయితే ఇపుడు అలా కాకుండా సభలో వైసీపీ తనకంటూ ప్రత్యేకతను నిలుపుకునేందుకు వాయిస్ గట్టిగా వినిపించేందుకు అవకాశం ఏర్పడుతుంది. బీఏసీ అజెండా తయారిలో విజయసాయిరెడ్డి కూడా పాత్ర పోషించనుండడం వల్ల వైసీపీ బిల్లులు కూడా వివిధ అంశాలపైన పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే రాజకీయంగా వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇకపైన రాజ్యసభలో మాట్లాడేందుకు కూడా వైసీపీకి ఎక్కువగా అవకాశాలు లభిస్తాయివైసీపీ ఇపుడు దేశంలో అతి పెద్ద పార్టీలలో నాలుగవ స్థానంలో ఉంది. ఇది భవిష్యత్తుకు సూచికగా చెబుతున్నారు. వైసీపీకి ఉభయ సభల్లో ఉన్న సభ్యులు, వారికి ఉన్న బలం ఆధారంగా కేంద్రం సైతం ఆ పార్టీని తక్కువ చేయడానికి వీలు లేకుండా పోతోంది. ఇదే కేంద్రం వద్ద వైసీపీ పలుకుబడిని మరింతగా పెంచడానికి కారణం అవుతోంది. వైసీపీ ఈ అవకాశాలను జాగ్రత్తగా వాడుకుంటే మాత్రం ఏపీకి ఎంతో మేలు చేయగలిసే స్థితిలో ఉంటుంది. రాజకీయంగా కూడా తాను కూడా మరింత బలంగా మారేందుకు వీలు ఉంటుందిఇప్పటికే వైసీపీ మీద మోడీకి మంచి భావన ఉంది. జగన్ సైతం కేంద్రం ప్రవేశపెట్టే అనేక బిల్లుల విషయంలో ఏమాత్రం సంశయం లేకుండా మద్దతు ఇస్తున్నారు. ఆ విషయాన్ని ఆ పార్టీలో అతి ముఖ్యుడైన జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక జగన్ కి మోడీ దగ్గర మరింతగా వెయిట్ పెరిగిందని కూడా అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో బీజేపీ నుంచి కొంత ఇబ్బందిని కూడా జగన్ ఈ విధంగానే తాజాగా జరిగిన పరిణామాల ద్వారా తప్పించుకున్నారని చెబుతున్నారు. ఇవన్నీ చూసుకున్నపుడు రానున్న రోజుల్లో ఇదే ఊపుతో జాతీయ స్థాయిలో తనదైన మార్క్ పాలిటిక్స్ ప్లే చేసేందుకు కూడా యువ ముఖ్యమంత్రి ప్రిపేర్ అవుతున్నారని అంటున్నారు