గుంటూరు, ఆగస్టు 10,
గత ఏడాది ఎన్నికలకు ముందు, తర్వాత జగన్ తన పార్టీలోనే ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులకు కొన్ని హామీలు ఇచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా.. వారిని పట్టించుకోలేదు. దీంతో వారంతా జగన్ తమ హామీలు ఎప్పుడు అమలు చేస్తారా? తమకు కనీస గుర్తింపు ఎప్పుడు లభిస్తుందా? అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ జాబితా పెద్దదిగానే ఉన్నప్పటికీ.. కొందరి విషయాన్ని పరిశీలిద్దాం..
మర్రి రాజశేఖర్: గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన నాయకుడు. కాంగ్రెస్ హయాంలో ఇక్కడ నుంచి విజయంసాధించారు. వైఎస్ అన్నా ఆయన కుటుంబం అన్నా కూడా ప్రాణం పెడతారు. ఈ క్రమంలోనే జగన్ పార్టీలోకి వచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా చేశారు. గత ఏడాది ఎన్నికల్లో “మీరు తప్పుకోండి అన్నా.. విడదల రజనీకి ఛాన్స్ ఇస్తున్నాను. మన ప్రభుత్వం ఏర్పాటయ్యాక మీకు మంత్రి పదవి ఇస్తాను“ అని జగన్ హామీ ఇచ్చారు. దీంతో ఆయన అప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్సీ అయినా దక్కక పోతుందా అనుకున్నారు. కానీ, ఇప్పటికీ ఎలాంటి పదవీ దక్కలేదు.
బొప్పన భవకుమార్: విజయవాడ రాజకీయాల్లో కార్పొరేటర్‌గా చక్రం తిప్పిన కాంగ్రెస్ నాయకుడు. జగన్ పిలుపుతో వైఎస్సార్ సీపీ జెండా కప్పుకొన్నారు. గత ఏడాది ఎన్నికల్లో విజయవాడతూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలోనే ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని జగన్ అనుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, విజయవాడ నగర పార్టీ ఇంచార్జ్‌గా నియమించారు తప్ప ఇంకెలాంటి ప్రాధాన్య పదవినీ ఇవ్వలేదు. దీంతో ఈయన కూడా ఎదురు చూపులు చూస్తున్నారు.
రావి వెంకటరమణ: గుంటూరు జిల్లా పొన్నూరులో వైఎస్సార్ సీపీని డెవలప్ చేసింది ఈయనే. బలమైన టీడీపీ కంచుకోటలో వైఎస్సార్ సీపీకి పునాదులు వేశారు. 2014 ఎన్నికల్లో ఓడిన ఆయనను గత ఏడాది ఎన్నికలకు ముందు అనూహ్యంగా ఈయనను తప్పించారు. కిలారు రోశయ్యకు టికెట్ ఇచ్చారు. దీంతోఈయన సహకరించి రోశయ్య గెలుపునకు కారణమయ్యారు. ఈ క్రమంలో ఈయనకు కూడా ఎమ్మెల్సీ లేదా మరేదైనా పదవి ఇస్తారని ఎదురు చూస్తున్నారు. కానీ, ఇంకా సాకారం కాలేదు. కనీసం జిల్లా స్థాయిలో డీసీసీబీ, జడ్పీచైర్మన్ స్థాయి పదవులు అయినా రాకపోవా ? అని వెయిట్ చేస్తున్నారు.
గొట్టిపాటి భరత్: ప‌్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి బాటలు పరిచారు. 2014లో ఈయన ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయినా.. వైఎస్సార్ సీపీని సజీవం చేయడంలో మాత్రం మంచి పాత్ర పోషించారు. ప్రకాశం రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈయనకు బహిరంగంగా ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. దీంతో భరత్ కూడా ఏదైనా పదవి దక్కక పోతుందా? అని ఎదురు చూస్తున్నారు.
తాతినేని పద్మావతి: కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీని బలోపేతం చేశారు. గత రెండు ఎన్నికల్లోనూ ఆమె తన సీటు త్యాగం చేశారు. గత ఎన్నికల్లో ఈ టికెట్‌ను మాజీ మంత్రి పార్థసారధికి ఇచ్చారు. నిజానికి బెజవాడలో వైఎస్సార్ సీపీకి ఉన్న ఏకైక మహిళానాయకురాలు ఈమే కావడం గమనార్హం. ఈమె కూడా పదవి కోసం ఎదురు చూస్తున్నారు.
పీవీపీ: పొట్లూరి వర ప్రసాద్‌గా పిలిచే పీవీపీ ప్రముఖ నిర్మాత, పారిశ్రామిక వేత్త. గత ఏడాది ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా వైఎస్సార్ సీపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఈయన కూడా రాజ్యసభ టికెట్‌ను ఆశించారనే వార్తలు వచ్చాయి. కానీ, ఈయన విషయాన్ని కూడా జగన్ పట్టించుకోవడం లేదు. మరి వీరందరికీ ఎప్పుడు న్యాయం జరుగుతుందో ? లేదో ? చూడాలి