తిరుపతి, ఆగస్టు 10,
పిలిచి పిల్లనిస్తే.. ఏదో చేసినట్టుగా వ్యవహరిస్తున్నారట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పుడు ఈ విషయం వైఎస్సార్‌సీపీ వర్గాల్లో బాగా వైరల్ అవుతోంది. పెద్దిరెడ్డి కుటుంబానికి ఆది నుంచి వైఎస్ కుటుంబంతో అత్యంత చనువు ఉంది. వైఎస్ హయాంలోనూ పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇక, తర్వాత జగన్ పార్టీ పెట్టడంతో పెద్దిరెడ్డి కుటుంబానికి రెండు సీట్లు కేటాయిస్తున్నారు. ఆయన కుమారుడు మిధున్ రెడ్డికి రాజంపేట ఎంపీ సీటును, పెద్దిరెడ్డికి పుంగనూరు ఎమ్మెల్యే టికెట్‌ను ఇస్తున్నారు. 2014లో ఇద్దరూ గెలిచారు. మొన్న ఎన్నికల్లో తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి కూడా భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీనిని బట్టి పెద్దిరెడ్డి కుటుంబానికి మూడు సీట్లు ఇవ్వడంతోనే జగన్ ఎంత ప్రయార్టీ ఇస్తున్నారో అర్థమవుతోంది. పైగా మిథున్‌రెడ్డి లోక్‌సభలో పార్టీ పక్షనేతగా కూడా ఉన్నారు.ఇక పార్టీ కోసం ఎంపీ మిథున్, మంత్రి పెద్దిరెడ్డి ఇద్దరూ పనిచేస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి వివాదాలు, సందేహాలు లేకపోయినా.. గత ఏడాది ఎన్నికల తర్వాత .. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జగన్ తన కేబినెట్‌లోకి చేర్చుకున్నారు. వాస్తవానికి చిత్తూరు జిల్లాలోపార్టీకోసం ఎంతో పనిచేసిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంటివారిని కూడా పక్కనపెట్టిన జగన్.. పెద్దిరెడ్డికి పెద్దపీట వేశారు. ఏకంగా ఆయనకు గనుల శాఖను అప్పగించారు. కానీ, ఈ పెద్దరికాన్ని ఆయన నిలబెట్టుకోలేక పోతున్నారనే చర్చలు సొంత పార్టీ వర్గాల్లోనే జోరందుకున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఇటీవల కాలంలో తీవ్రంగా ఇరుకున పెడుతున్న ఇసుక విషయంలో మంత్రి జోక్యం పెరగిపోయిందన్న చర్చలు నడుస్తున్నాయి.ఏపీలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా ఆయన ఎందుకు పట్టించుకోవడం లేదని.. పెద్దిరెడ్డే దీనిని ప్రోత్సహిస్తున్నారని సొంత పార్టీలోనే ఎమ్మెల్యేల స్థాయి నాయకులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక, ప్రతిపక్షాల నుంచి కూడా ప్రభుత్వానికి సెగ బాగానే ఉంది. దీంతో ఇప్పటికే ఒకసారి పెద్దిరెడ్డిపై జగన్ ఫైరయ్యారని వార్తలు వచ్చాయి. ఇక, ఇసుక విషయాన్ని పక్కన పెడితే.. సొంత జిల్లా చిత్తూరులోనూ ఎమ్మెల్యేలను ఆయన ఎదగనివ్వడం లేదనే ఫిర్యాదులు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే రోజా సహా మరికొందరిని ఉద్దేశ పూర్వకంగానే ఆయన అణగదొక్కుతున్నారంటూ ఫిర్యాదులు వస్తున్నాయట. ఈ విషయంలో రోజా ఓపెన్‌గానే ఫైర్ అవ్వడం చూశాం.అదే సమయంలో ప్రొటోకాల్ వివాదాలు కూడా తెరమీదికి వస్తున్నాయి. జిల్లాలో కీలక అధికారులు అందరినీ తన కనుసన్నల్లోనే ఉంచుకున్నారని, తనకు తెలిసే నియామకాలు జరగాలని హుకుం జారీ చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. వాస్తవానికి ఇలాంటి ఫిర్యాదులు ఎవరిపైనైనా వస్తే.. వాటిని పరిష్కరించాల్సిన పెద్దిరెడ్డి ఇలా వ్యవహరించడంపై జగన్ ఇప్పుడు మరోసారి ఆగ్రహంతో ఉన్నారని, అందుకే కీలక భేటీలకు ఆయనను పిలవడం లేదని చర్చించుకుంటున్నారు. మరి మున్ముందు ఆయన మారకపోతే.. పక్కకు తప్పించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.