సమ్మిళిత అభివృద్ధి విషయంలో ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 62వ స్ధానంతో సరిపెట్టుకుంది. చైనా 26వ స్ధానం, పాకిస్ధాన్ 47వ స్ధానంలో మనకంటే మెరుగైన ర్యాంక్‌లు సాధించాయి. ప్రపంచంలోనే మెరుగైన సమ్మిళిత ఆర్థిక వ్యవస్థగా నార్వే అగ్రభాగాన నిలిచింది. ఇక ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో లిథునియా టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకుంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం భేటీకి ముందు వార్షిక సమ్మిళిత వృద్థి సూచిక జాబితాను విడుదల చేసింది. ఆయా దేశాల్లో ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, రుణాల ఊబి నుంచి భవిష్యత్ తరాలను కాపాడటం వంటి ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ సూచీ రూపొందించినట్టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెల్లడించింది. నూతన సమ్మిళిత వృద్ధి, అభివృద్ధి పద్ధతులను అనుసరించాలని ప్రపంచ నేతలను కోరింది. జీడీపీ గణాంకాలనే ఆర్థిక వృద్ధికి కొలమానాలుగా చూడటం అసమానతలకు దారితీస్తుందని హెచ్చరించింది.