న్యూఢిల్లీ, ఆగస్టు 10,
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి నుంచి ముంబయి, చెన్నై, ఢిల్లీ మహానగరాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత కేసుల సంఖ్య క్రమంగా తగ్గు ముఖం పడుతుండటంతో ఈ మూడు నగరాల్లో కొంత ఉపశమనం కలిగింది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా తీసుకున్న చర్యల కారణంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఢిల్లీ నగరంలో 89 శాతం రికవరీ రేటు ఉండటం బిగ్ రిలీఫ్ గా చెప్పాలి.ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్న నగరాలు హైదరాబాద్, బెంగళూరు, పూనే, థానే నగరాలు. ఈ నాలుగు నగరాల్లో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తుంది. ముఖ్యంగా బెంగళూరు నగరంలో కేసుల సంఖ్య అధికంగా ఉంది. కర్ణాటకలో నమోదవుతున్న కేసుల్లో 90 శాతం కేసులు బెంగళూరు నగరంలోనే వస్తుండటం విశేషం. మరోసారి లాక్ డౌన్ విధించినా ఫలితం కన్పించడం లేదు. నిపుణులు కూడా బెంగళూరు నగరాన్ని హాట్ స్పాట్ లుగా గుర్తించారు.
ఇక మరో నగరం హైదరాబాద్. ఇక్కడ కూడా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. హైదరాబాద్ నగరంలో రోజుకూ 500 కేసుల నుంచి 600 వరకూ నమోదవుతున్నాయి. కోటి జనాభా ఉన్న నగరంలో వైరస్ వ్యాప్తి రానున్న కాలంలో మరింత ఎక్కువవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకూ హైదరాబాద్ నగరంలో నలభై ఐదు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నగర శివార్లలోనూ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది.ముంబయిని వైరస్ ముప్పు వీడిందనుకుంటున్న తరుణంలో మహారాష్ట్రలోని పూనే, థానే నగరాలకు పాకింది. ఈ రెండు నగరాల్లో లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు. ఈ రెండు నగరాల్లో ప్రభుత్వం పరీక్షల సంఖ్య కూడా పెంచింది. మహారాష్ట్రలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఐదు లక్షల కేసులు దాటయి. పూనే, థానే నగరాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. హైదరాబాద్, బెంగళూరు, పూనే, థానే నగరాల్లో పరిస్థిితిని గమనిస్తూ తగిన సూచనలను అందజేస్తుంది.