విజయవాడ, ఆగస్టు 10,
ఏపీ రాజధాని అమరావతి మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళన ఒకవైపు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ప్రజల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత మరోవైపు అధికార పార్టీ వైఎస్సార్‌సీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పైకి ప్రశాంతంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నా.. ఈ మూడు జిల్లాల ప్రజాప్రతినిధులు ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నాయకులు తీవ్రంగా మదనపడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకపోయినా.. రాకపోయినా.. అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రజల మధ్యకు వెళ్తే..రేపు తీవ్ర వ్యతిరేకత, ఉద్యమాలు, ఆందోళనలు, నిరసనలు వారిని చుట్టుముడతాయనే ఆలోచనలో ఉన్నారు.
ఇక, సీఎం జగన్ కూడా బ్రాండ్ అమరావతి పోతే.. పెట్టుబడులు వస్తాయా ? నిజంగానే రాష్ట్రానికి బ్యాడ్ నేమ్ వస్తుందా? అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ సమస్యకు విరుగుడు కనిపెట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా రెండు వ్యూహాలతో ముందుకు వెళ్లాలని పార్టీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనిలో ప్రధానంగా అమరావతి బ్రాండ్ చెడిపోకుండా ఇక్కడ నిర్మాణాలు చేపట్టేలా ఒప్పందాలు చేసుకున్న కంపెనీలతో చర్చించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంటే.. ప్రధానంగా అమరావతి బ్రాండ్ చెడిపోకుండా ఇక్కడ ఒక్క శాసన రాజధానినే కాకుండా విద్యలకు ఆలవాలంగా తీర్చిదిద్దాలని కూడా నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెబుతున్నారు.ఫలితంగా అమరావతి పేరు సజీవంగానే ఉంటుంది. ఇక, రెండో కీలకమైన నిర్ణయం.. మూడు రాజధానుల ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నిర్ణయించడం. గతంలో చంద్రబాబు అమరావతి కోసం చేసిన ఫొకస్‌ను ఇప్పుడు మూడు రాజధానులపై చేయాలని జగన్ సర్కారు నిర్ణయించుకుందని అంటున్నారు. రాబోయే రోజుల్లో మూడు రాజధానుల ప్రాధాన్యం, దానివల్ల రాష్ట్రం ఎలా అభివృద్ది చెందుతుంది ? ప్రయోజనాలు ఏంటి? రాబోయే రోజుల్లో దీనిని ఎలా డెవలప్ చేస్తారు? అనే అంశాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అంటే.. మొత్తంగా అమరావతి బ్రాండ్‌ను కాపాడుతూనే.. మూడు రాజధానులకు ప్రజల నుంచి ఆమోద ముద్ర లభించేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని, తద్వారా టీడీపీ కన్నా వైఎస్సార్ సీపీ బెస్ట్ అనుకునేలా ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలని నిర్ణయించుకున్నట్టు తాజా సమాచారం. మరి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి