కర్నూలు, మహబూబ్ నగర్, ఆగస్టు 10,
లుగు రైతుల దాహార్తిని, సాగునీటి అవసరాలను తీరుస్తున్న కృష్ణమ్మ శ్రీశైలం ప్రాజెక్టులోకి పరుగులు పెడుతోంది. ఎగువ నుంచి శనివారం సాయంత్రం 98,975 క్యూసెక్కులు చేరుతుండగా రాత్రి 12 గంటలకు ఇది రెండు లక్షల 25 వేల క్యూసెక్కులకు పెరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ దఫా వరదకు ఆగస్టు చివరిలోపే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నిండవచ్చని అంచనా వేస్తున్నాయి.
పశ్చిమ కనుమల్లో ప్రధానంగా కృష్ణా, ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సగటున 72 మి.మీ.ల వర్షపాతం పడింది. దాంతో కృష్ణా, ఉపనదుల్లో గంట గంటకూ వరద పెరుగుతోంది. ఆల్మట్టిలోకి వరద పెరుగుతుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎంఏ) సూచనల మేరకు డ్యామ్ నీటినిల్వలను ఖాళీ చేసి దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోనూ అదే పరిస్థితి. దాంతో జూరాలకు భారీగా వరద చేరుతోంది. జూరాల వరదను దిగువకు వదులుతున్నారు.
శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు జలాలు విడుదల చేస్తుండటంతో నాగార్జునసాగర్ నీటిమట్టం 558.20 అడుగులకు చేరుకుంది. అప్పర్ తుంగ, భద్ర డ్యామ్, సింగటలూరు బ్యారేజీ నుంచి భారీ వరదను దిగువకు వదులుతుండటంతో తుంగభద్రలోకి వరద ప్రవాహం పెరుగుతోంది.
పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, కిన్నెరసాని నుంచి నీటి ప్రవాహం చేరుతుండటంతో గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1.17 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 7 వేల క్యూసెక్కులు డెల్టాకు, మిగిలిన 1.11 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలు నిండుతున్నాయి. జూరాల నుంచి ఔట్‌ఫ్లో మొదలైంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, పూర్తి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా 849.90 అడుగుల వద్ద 79.8115 టీఎంసీల నీరు చేరింది. శనివారం సాయంత్రానికి జూరాల నుంచి 2.25లక్ష క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ నీరు అర్ధరాత్రి దాటాక శ్రీశైలానికి చేరుకునే అవకాశం ఉంది. రోజూ 15-20 టీఎంసీల చొప్పున నీరు రావచ్చని అంచనాలున్నాయి. రెండ్రోజుల్లో ఏపీ కూడా విద్యుదుత్పత్తి మొదలుపెట్టే అవకాశం ఉంది. నారాయణపూర్ గరిష్ఠ నీటి మట్టం 490.76మీటర్లు, నీటి నిల్వ 28 టీఎంసీలు కాగా 26.89 టీఎంసీల నీరు చేరింది. ఇన్‌ఫ్లో 2లక్షల క్యూసెక్కులుండగా 2,20,620 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి గరిష్ఠ నీటి మట్టం 517 అడుగులు, నీటి నిల్వ 129.27 టీఎంసీలుండగా ప్రస్తుతం 108 టీఎంసీల నీరు చేరింది. ఇన్‌ఫ్లో 2.23లక్షల క్యూసెక్కులు ఉంది. 2.20లక్షల క్యూసెక్కులు జూరాలకు విడుదల చేస్తున్నారు. వారంపాటు ఇదే స్థాయిలో వరద నీరు రావచ్చని, శ్రీశైలం నీటిమట్టం 875-880 అడుగులకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. 10-15 రోజుల్లో సుమారు 150 టీఎంసీల నీరు చేరుకోవచ్చని చెబుతున్నారు.తెలుగు రాష్ట్రాల్లో జూలై 7వ తేదీ నుంచి కురిసిన వర్షాలకు సుంకేసుల నుంచి 12.5 టీఎంసీలు, హంద్రీ నుంచి 12 టీఎంసీలు, జూరాల నుంచి 79 టీఎంసీలు మొత్తం 103 టీఎంసీల నీరు శ్రీశైలానికి చేరింది. జలాశయం నుంచి తెలుగు రాష్ట్రాలు కలిసి ఇప్పటిదాకా 72 టీఎంసీలు వాడుకోగా.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుదుత్పత్తి ద్వారా 64.5 టీఎంసీలు, ఎత్తిపోతల పథకాల ద్వారా 2.64 టీఎంసీలను తెలంగాణ ప్రభుత్వం డ్రా చేసుకుంది.ఏపీ ప్రభుత్వం మాత్రం మల్యాల, హంద్రీనీవా నుంచి 1.5 టీఎంసీలు, పోతిరె డ్డిపాడు నుంచి 2.3 టీఎంసీలను అవసరాల రీత్యా మాత్రమే వాడుకుంది. శ్రీశైలం నీటిమట్టం పెరిగితే విద్యుదుత్పత్తి ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. కుడి గట్టు భూగర్భ విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి కూడా నీటిని డ్రా చేసుకునే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీటి విడుదలపై జిల్లా అధికారులు అప్రమత్తం కావాల్సి ఉంది. లేకుంటే జూలైలో వచ్చిన వరదను ఉపయోగించుకోలేని దుస్థితే పునరావృతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు