YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి దేశీయం

స్కూళ్ల ప్రారంభంపై మార్గదర్శకాలు

స్కూళ్ల ప్రారంభంపై మార్గదర్శకాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 10, 
కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలు, విద్యా సంస్థలను మూసివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కావడంతో విద్యా సంస్థలను దశలవారిగా తెరవడానికి కేంద్రం కసరత్తు చేపట్టింది. పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలను సెప్టెంబరు 1 నుంచి నవంబరు 14 మధ్య దశల వారీగా పునః ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. లాక్‌డౌన్ అనంతరం పలు దేశాల్లో విద్యా సంస్థలను పునఃప్రారంభించిన విధానంపై అధ్యయనం చేసి, మార్గదర్శకాలను రూపొందిస్తోంది.అయితే, ఈ విషయంలో తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలిపెట్టనుంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించనుందని అధికార వర్గాలు తెలిపాయి. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా ఆగస్టు నాటికి విస్తృతస్థాయి ‘స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌’ను కేంద్రం విడుదల చేయనుంది. విద్యా సంస్థల పునఃప్రారంభం గురించి ఇందులో వివరించనుంది.లాక్‌డౌన్‌ ఎత్తివేసే క్రమంలో ఆగస్టు 31 తర్వాత అనుసరించాల్సిన విధానాలపై కేంద్రం మార్గదర్శకాలను జారీ చేయనుందని సంబంధిత ఓ అధికారి తెలిపారు. అయితే, విద్యార్థులు ఎప్పుడు, ఎలా తరగతులకు హాజరుకావలన్నది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించాలని అన్నారు. ఈ విషయంలో కరోనా కేసుల తీవ్రతను పరిశీలించడంతో పాటు పాఠశాల నిర్వాహకులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో 33% సామర్థ్యంతో తరగతులను షిఫ్టుల వారీగా నడపాలని, పాఠశాలలో విద్యార్థులు 2-3 గంటలు మాత్రమే ఉండేలా చూడాలని కేంద్రం సూచనలివ్వనుందని ఆయన వివరించారు.మొదటి షిఫ్టు ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ, రెండో షిఫ్టు 12 నుంచి 3 గంటల వరకూ ఉండాలి. రెండు షిఫ్టుల మధ్య విరామ సమయంలో గదులను శానిటైజేషన్ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం మాత్రం 10 నుంచి 12వ తరగతుల విద్యార్థులకే ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని, చిన్నారులకు మాత్రం ఆన్‌లైన్‌ తరగతులనే కొనసాగించాల్సి ఉంటుంది. సెక్షన్ల వారీగా విద్యార్థులు నిర్దిష్ట రోజుల్లో నేరుగా పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

Related Posts