YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*వైరాగ్య సంపన్నులు*

*వైరాగ్య సంపన్నులు*

శుభవార్త వినడం అందరికీ సంతోష దాయకమే! పెండ్లి, జననం, షష్టి పూర్తి... ఇలాంటి విషయాలు ఆనందకరమైన సంగతులు. ఎక్కువమందికి ఇష్టంలేని పదం ‘మరణం’. ఆ పదం అనడం, వినడం అశుభంగా భావించేవారూ ఉన్నారు. ఆత్మీయుల మరణం అందరి మనసుల్ని కలతపెడుతూ ఉంటుంది. జ్ఞాపకాల అలలతో కన్నులు తడిసిపోతాయి. పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టక తప్పదని తెలిసీ, తామూ ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వీడిపోవాల్సి వస్తుందని తెలిసీ, పోయినవారి కోసం ఏడవడంలో ఆంతర్యం ఏమిటి?
తన మృత్యువుకు ఏడురోజులే సమయం ఉందని పరీక్షిత్తు తెలుసుకొని, దిగులుపడే బదులు జీవితంపై విరక్తి పొందాడు. మృత్యుభీతికి విరుగుడు వైరాగ్యం. వైరాగ్యం ముక్తికి మొదటి మెట్టు. ‘హరినామస్మరణ వల్ల ప్రాణికి ముక్తి లభిస్తుంది’ అని శుకమహర్షి పరీక్షిత్తుకు భాగవతాన్ని బోధించాడు.
కురుక్షేత్ర యుద్ధం తరవాత ధృతరాష్ట్రుడు దయనీయమైన స్థితిలో ఉన్నాడు. ‘దేహం నిత్యంకాదని గ్రహించి, మోహం విడిచి, సంసారం నుంచి బయటపడినవారు తప్పక ముక్తినొందుతారు’ అని విదురుడు ధృతరాష్ట్రుడికి హితవు చెబుతాడు. గాంధారి భర్తను అనుసరించి హిమాలయాలకు పయనమైంది. పెదతండ్రి కనిపించకపోయేసరికి ధర్మరాజు కంగారుపడ్డాడు. ధర్మరాజు సంజయుడిని అడిగాడు. మా నాన్న మరణించిన తరవాత పసివారమైన మమ్మల్ని ఎంతో ప్రేమతో పెంచి, విద్యాబుద్ధులు నేర్పించాడు!’ అని ధర్మరాజు శోకిస్తూ ఉంటే ‘వాళ్ళు ఎక్కడకు వెళ్ళారో నాకూ తెలియదు’ అంటూ సంజయుడు కన్నీరు కార్చాడు. ఇంతలో వారి వద్దకు తుంబుర, నారదులు విచ్చేశారు. నారదుడు ధర్మరాజును ఓదారుస్తూ ‘ధర్మజా! శోకించవలసిన పనిలేదు. కాలాన్ని ఎవరూ దాటలేరు. మీ పెదనాన్న గాంధారి విదురులతో హిమాలయాల దక్షిణ భాగాన ఉన్నాడు. నేటికి అయిదోరోజున యజ్ఞాగ్నిలో శరీరాన్ని విడుస్తాడు. గాంధారి భర్తను అనుసరించి పోతుంది. విదురుడు వైరాగ్య భావనతో తీర్థయాత్రలకు వెళతాడు’ అని చెప్పాడు. ఎంతకాలం జీవితం గడిపినా, ఎన్ని భోగాలు అనుభవించినా తుదకు వైరాగ్యమే మిగులుతుంది. కుమారుడి విద్యాభ్యాసం ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామనుకున్నాడు హిరణ్యకశిపుడు. ‘చదువు ద్వారా నువ్వు నేర్చుకున్నదేమిటి?’ అని ప్రహ్లాదుడిని ప్రశ్నించాడు. పరులు, తాము అనే భేదభావం కేవలం మాయాకృతం. భోగభాగ్యాలను వీడి విష్ణువును స్మరిస్తూ అడవికిపోయి అక్కడే జీవించడం మేలు!’ అని ప్రహ్లాదుడి సమాధానం. కొందరికి ఎన్నటికీ కొంచెమైనా వైరాగ్య భావన కలగదు. మనకు వైరాగ్యం కలగాలన్నా భగవదనుగ్రహం అవసరం. ముచుకుందుడు అనే యోగిపుంగవుడు శ్రీకృష్ణభగవానుణ్ని స్తుతిస్తూ ఇలా అంటాడు- ‘స్వామీ! లోకంలోని స్త్రీలు పురుషులు నీ మాయవల్ల ధనసంపాదన రూపమైన రోగాన్ని, సంసారరూపమైన గృహాన్ని పొందుతారు. అల్పసుఖాలు అనే అంధకారంలో ఉంటారు, కోరికలు మోసగిస్తాయి. గడ్డిని చూసి గొర్రె ఆశతో తినడానికిపోయి నూతిలోపడినట్లుగా, మూర్ఖుడూ ప్రవర్తిస్తాడు...’
భౌతిక సంపదలన్నింటినీ అసహ్యించుకొని, లోకరీతిని విమర్శిస్తూ, నీతిపద్యాలు చెప్పిన వేమన వైరాగ్య సంపన్నుడు. భగవంతుడికి ఇలా జీవించేవారు ఇష్టులు. ‘దేహంపై ప్రేమను వదిలి, భార్యను కుమారులను వీడి సంపదలను కాలదన్ని, భగవంతుడు తప్ప మరే లోకమూ లేకుండా జీవించేవారిని ఈశ్వరుడు తప్పక రక్షిస్తాడు’ అని భాగవత ప్రబోధం. అందరూ అంత వైరాగ్య సంపన్నులు కాకపోయినా, భౌతిక సుఖాలను కొంత దూరంగా ఉంచడానికి ప్రయత్నించమని పౌరాణిక కథలు మనకు సూచిస్తున్నాయి.

Related Posts