పెళ్లైనా బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చా.
పెళ్లి చేసుకోకుండా ఉండటాన్ని బ్రహ్మచర్యమంటారా..! అవివాహితులందర్ని బ్రహ్మచారులనవచ్చా. పెళ్లైనా బ్రహ్మచర్యాన్ని పాటించడం సాధ్యమా--ముమ్మాటికి సాధ్యమే అందుకు హనుమంతుడే ఉదాహరణ. నిజానికి బ్రహ్మచర్యం అంటే బ్రహ్మ భావనను కలిగి ఉండడం.
సృష్టికి మూలమైన కార్యాన్ని త్యజించిన వారో లేక స్త్రీలను ద్వేషించిన వారికి దూరంగా ఉండేవారో బ్రహ్మచారులు కాలేరు. నిరంతరం బ్రహ్మాన్ని అన్వేషిస్తూ ఆత్మ జ్ఝానానికై భౌతిక సుఖాలకు దూరంగా ఉండే వారు, రాగద్వేషాలకు అతీతంగా ఉండే వారు బ్రహ్మచారులు. ప్రతి పురుషునిలోనూ స్త్రీత్వం ఉంటుంది. అదే ప్రేరణ శక్తి. అలాగే ప్రతి స్త్రీలోనూ పురుషుడు కూడా ఉంటాడు. కాబట్టి స్త్రీ పురుషులు పరస్పర విరుద్దమైన వారు కాదు అందువల్ల ద్వేషించి త్యజించడం బ్రహ్మచర్యం అనిపించుకోదు. బ్రహ్మ చర్యం అనగా కోరికలను అదుపులో ఉంచుకోవడం.
బ్రహ్మచర్యం యొక్క ప్రాముఖ్యత స్పష్టంగా యజుర్వేద లో వివరించారు. ఈ ఆధునిక జీవితంలో బాగా కొన్ని మాత్రమే ఇది అర్థం మరియు సాధన. అన్ని వేదాలు మరియు హిందూ మతం యొక్క ఇతర గ్రంథాల బ్రహ్మచర్యం గురించి గొప్ప ప్రాముఖ్యత ఉంది. బ్రహ్మచర్యం వల్ల అమృతత్వాన్ని పొందవచ్చని విష్ణుపురాణం చెబుతుంది. బ్రహ్మచర్యం గొప్ప సాధన. ఈ లోకంలో ఆత్మగౌరవంతో జీవించాలన్నా బ్రహ్మచర్యం చాలా అవసరం. గోవిందాలయ అర్చకులు మొదట్లో బ్రహ్మచారులుగా ఉండినారట. ఒకరోజు వాళ్ళకు రాజునుంచి పిలుపు వచ్చిందట. "రాజు పిలిస్తే రావడానికి మేమేమైనా ఆయన కింకరులమా? మాతో ఏమైనా పని వుంటే ఆయన్నే ఇక్కడికి రమ్మనండి" అని వారు చాలా ధీటుగా జవాబిచ్చారట. ఆ అర్చకులే పెళ్ళిళ్ళు చేసుకున్నాక రాజు పిలువకపోయినా చాటికిమాటికి ఏదో ఒక నెపంతో రాజు దర్శనానికి వెళ్ళేవారుట, ఏవైనా కానుకలు, దంభావనలు దొరుకుతాయనే ఆశతో.
బ్రహ్మచర్యం అంటే భౌతిక వాంచలను త్యజించడం. ఆత్మ జ్ఞాన సంపాదనకు ఈ సాధన చాలా అవసరం. చాందోగ్యోపనిషత్తు ఒక చోట్లో బ్రహ్మచర్యాన్ని చాలా స్తుతించింది. జీవికి మేలు కలిగించే విషయాన్ని స్తుతించడం, కీడి కలిగించే విషయాన్ని నిందించడం వేదంలో పరిపాటి. దీన్నే అర్ధవాదమంటారు. స్తుతింపబడినదాన్ని సాధకులు అవశ్యం గ్రహించాలి. నిందింపబడినదాన్ని అవశ్యం పరిహరించాలనేది ఉద్దేశ్యం. చాందోగ్యోపనిషత్తు 8వ అధ్యాయం 5వ ఖండంలో బ్రహ్మచర్యం క్రింది విధంగా స్తుతింపబడింది....
యజ్ఞం అని లోకంలో దేన్ని అంటారో అది బ్రహ్మచర్యమే. ఎందుకంటే నిష్కామంగా చేసే యజ్ఞాల ద్వారా కర్మయోగి చిత్తశుద్ధి పొంది తద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. అదే ఫలాన్ని (ఆత్మజ్ఞాన్ని) సాధకుడు బ్రహ్మచర్య సాధన ద్వారానూ పొందుతాడు. కాబట్టి యజ్ఞం అనేది బ్రహ్మచర్యమే అని స్తుతి. ఇష్టం అని లోకంలో దేన్ని అంటారో అది కూడా బ్రహ్మచర్యమే. ఇష్టం అనేది ఒక విధమైన వైదిక కర్మ. ఈ కర్మ ద్వారా భగవంతుని పూజించడం జరుగుతుంది.
సాధకుడు తన బ్రహ్మచర్య నియమమే భగవంతునికి చేసే పూజగా భావించి ఆ దేవుని అనుగ్రహానికి పాత్రుడవుతాడు. కనుక ఇష్టం అనేది కూడా బ్రహ్మచర్యమే అని స్తుతి. మౌనం అని దేన్ని అంటారో అది కూడా బ్రహ్మచర్యమే. మౌనం అంటే ధ్యానం. సాధకుడు శాస్త్రాల ద్వారా ఆచార్యుల ద్వారా ఆత్మ స్వరూపాన్ని గురించి తెలుసుకుని బ్రహ్మచర్య సాధన ద్వారా ఆ స్వరూపాన్ని ధ్యానించగలుగుతారు. కనుక మౌనం అనది కూడా బ్రహ్మచర్యమే అనేది మరో స్తుతి. అరణ్యాయనం అని దేన్ని అంటారో అది కూడా బ్రహ్మచర్యమే.
అరణ్యాయనం అంటే వానప్రస్థాశ్రమ స్వీకారం. ఇది చాలా పుణ్య హేతువు. అరణ్యాయనానికి బ్రహ్మలోకాన్ని పొందుట అని కూడా మరో అర్ధం ఉంది. సాధకునికి బ్రహ్మచర్య సాధన వల్ల బ్రహ్మలోకప్రాప్తి సిద్ధిస్తుంది. కనుక అరణ్యాయనం అనేది కూడా బ్రహ్మచర్యమే అనేది మరో స్తుతి. యజ్ఞం, ఇష్టం, సత్రాయణం, అనాశకాయనం, మౌనం, అరణ్యాయనం - ఇవి వేదంలో ప్రసిద్ధికెక్కిన పురుషార్థ సాధనాలు. ఈ ప్రసిద్ధ పురుషార్థ సాధనాల ద్వారా బ్రహ్మచర్య స్తుతి చాందోగ్యోపనిషత్తు చేసింది. కనుక శ్రేయోమార్గంలో పోదలుచుకొన్న సాధకులకు బ్రహ్మచర్య నియమం అవశ్యాచరణీయం అని తేలింది.