ఈ సమస్త జగత్తుయందలి చదుర్దశ భువనములలోని పుణ్యక్షేత్రములకు బిల్వ వృక్షం ఒక ప్రతీక. ఇంతటి మహిమాన్వితమైన వృక్షం మరొకటి లేదు. సాక్షాత్ శివ స్వరూపమునకు ప్రతీక . శ్రీహరి లక్ష్మీదేవి ఇరువురు ఒక పర్యాయం మహాదేవుని గురించి తపము చేయసాగారు. వారు అలా తపము చేయు సమయంలో లక్ష్మీదేవి హస్తమునుండి ఒక దివ్య వృక్షము వెలువడింది. ఆ వృక్షమే మారేడు వృక్షము. మాతా లక్ష్మీదేవి హస్తమునుండి వెలువడినది కనుక శ్రీ వృక్షము. అప్పుడు శ్రీహరి ఆ మారేడు వృక్షముల దళములతో మహాదేవుని అర్చించసాగెను. ఒకరినొకరు అర్చించుకుంటారు కానీ ఇరువురి మధ్య ఎటువంటి భేదము లేదన్నది నిజం. అపుడు శంకరుడు విష్ణువు , లక్ష్మీదేవి తపమునకు మెచ్చినవాడు అయి ప్రత్యక్షమయ్యెను. అపుడు శ్రీహరికి సర్వ జగత్తును రక్షించేటటువంటి సామర్ద్యమును ఇచ్చెను. ఆరోజునుండి బిల్వ పత్రములతో శివారాధన మొదలైంది. చతుర్దశ లోకముల యందు ప్రతి పుణ్య క్షేత్రమునందు బిల్వ వృక్షము నాటుట జరిగింది. ప్రతిదినం పరమశివుని బిల్వ పత్రములతో పూజిస్తే దారిద్య్రం కంటి చూపుమేర కనపడదు. బిల్వపత్రములతో శ్రేష్టమైన వాటిని అంటే మూడు పత్రములు వున్నవాటిని మాత్రమే పూజకు తీసుకోవాలి.
బిల్వములు ముఖ్యంగా మనకు మూడురకములుగా లభించును. అవి ఏక బిల్వం, త్రిదళం, పంచదళం. ఈ మూడింటికి ఒక ప్రత్యేకత ఉంది. ఏక బిల్వం పరమశివ స్వరూపం. త్రిదళం వచ్చి శివుని మూడు కన్నులు , పంచదళ బిల్వము శివుని పంచముఖములు అయిన సద్యోజాతము , వామదేవుడు , తత్పురుషుడు , అఘోరుడు , ఈశానుడు అని భావించడం జరుగుతున్నది.
ఇక బిల్వ పత్రములను మనం పూలను పూజించినట్టుగా ఎప్పటికీ పూజించరాదు. బిల్వదళములను అథోముఖముగా పూజించవలెను. పూలను ఏ పూట కోసినవి ఆ పూట గానీ లేదా ఆరోజుగానీ వాడవచ్చు. మరుసటి రోజు వాడరాదు. బిల్వపత్రములు మరుసటి రోజు కూడా వాడవచ్చు. సోమవారం నాడు వినియోగం కోసం కోసిన దళములు సోమవారం మాత్రమే వాడాలి. మిగతారోజుల్లో వాడరాదు. మిగతా రోజులయందు కోసిన బిల్వ దళములు ఏరోజు అయినా వాడవచ్చు.
బిల్వ వృక్షము సాక్షాత్తు శివస్వరూపమే. సమస్త లోకముల యందలి పుణ్య తీర్థములు ఈ బిల్వ వృక్షముయొక్క మూల భాగమున వసించును. గంథము పుష్పములతో బిల్వ వృక్ష మూలమును పూజించువాడు అంత్యకాలమున శివలోకము చేరును. బిల్వ వృక్ష మూలమున మస్తకమును ప్రక్షాళన చేసుకొనిన సమస్త తీర్ధములు ఆడిన పుణ్యము సంప్రాప్తించును. బిల్వ వృక్ష మూలమున శివుని అర్చించి దీపారాధన చేయువాడు తత్వజ్ఞాన సంపన్నుడగును. మారేడు వృక్షముయొక్క వేర్లు , చెట్టు నీడ ఎంత దూరం వ్యాపిస్తాయో అంత దూరం ఆ నేల పరమ పవిత్రమైంది. ఎప్పుడూ బిల్వ మూలములందు జలం వుంచితే శివుడు సంతుష్టుడగును. బిల్వ వృక్షమును బిల్వములతో పూజిస్తే కష్టములు దూరమగును. సంతాన ప్రాప్తి కలుగును. సూర్యోదయమునే శుచి అయి మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేసి శివుని బిల్వ దళములతో అర్చిస్తే సమస్త శ్రేయస్సు సుఖశాంతులు లభించును. ప్రతిరోజు మండలంపాటు నలభైసార్లు మారేడు వృక్షమునకు శివుని సమేతంగా పూజిస్తే సమస్త నీచగ్రహ శక్తులు సమస్త రోగములు తొలగి మనశ్శాంతి ఆనందం పొందుతారు. ఈ బిల్వ వృక్షం కింద పంచాక్షరి జపించినట్టయితే అశ్వమేధ యాగఫలం సంప్రాప్తిస్తుంది. మారేడు వృక్షం కింద ఉత్తమ బ్రాహ్మణునికి అన్నదానం చేసిన దరిద్రమన్నది జీవితంలో రాదు. ఇక మారేడు దళం కాలికి తగలకుండా చూసుకోవాలి. అలా తగిలితే ఆయుక్షీణం. మారేడు ఫలములయందలి గుజ్జును తీసివేసి శుభ్రపరిచి ఎండబెట్టిన తరువాత ఆ మారేడు కాయ టెంక యందు విభూతిని ఉంచితే చాలా మంచిది. ప్రతి ఉదయం ఆ విభూతిని ధారణ చేస్తే ఋణవిముక్తుడవుతాడు.
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో