ప్రొద్దుటూరు ఆగస్టు 10
కరోనా విజృంభన నేపథ్యంలో ఇంటా బయటా కరోనాపై పోరాటం చేస్తున్నానని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు. తన కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో ఆయన ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి స్వయంగా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇదే సందర్భంలో కరోనా పరీక్షలు, అందిస్తున్న వైద్యంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా పరీక్షకు శాంపిల్ ఇచ్చిన తరువాత, ఈసీజీ, బిపీ పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వచ్చిందని ఎవరూ భయపడవద్దని, కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల పర్యవేక్షణలో చిన్నమొత్తంతో దొరికే మందులు తీసుకుని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఎమ్మెల్యే రాచమల్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన వ్యక్తిగత సహాయకునికి, డ్రైవర్‌కు, ఇంట్లో తన భార్యకు, ఇతర కుటుంబ సభ్యులకు కరోనా వచ్చిందని, అందరూ చికిత్స చేయించుకుని ఆరోగ్యవంతులు అయ్యారని ప్రజలు కరోనాకు భయపకుండా ధైర్యంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. తన భార్యకు కరోనా వచ్చిందని నిర్ధారణ అయినప్పటి నుంచి తాను కూడా లక్షణాలు ఏవీ లేనప్పటికీ కరోనా మందులు మూడు రోజులుగా వాడుతున్నానని చెప్పారు. కరోనాపై మార్చి నుంచి ప్రొద్దుటూరులో యుద్ధం చేస్తున్నామని, రెండు నెలలుగా కుటుంబ సభ్యులకు కరోనా సోకడంతో కుటుంబ బాధ్యతగా తాను వారికి సహాయంగా ఉంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం అందిస్తున్న వైద్యం మెరుగ్గా ఉందని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందకుండా కరోనా లక్షణాలు కనిపించినవెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్యుల సలహా మేరకు నడుచుకోవాలన్నారు. ఈ క్రమంలో కుటుంబానికి, స్నేహితులకు, సమాజానికి, ఇతర వ్యాపకాలకు దూరంగా ఉంటే మనకు, సమాజానికిమేలు చేసిన వారవుతారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా చెప్పారు. తన కుటుంబ సభ్యులకు కరోనా వచ్చిన నేపథ్యంలో పరీక్షలు చేయంచుకుంటున్నారని, తనకు ఒక వేళ నిర్ధారణ అయితే తాను ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స చేయించుకుంటానని చెప్పారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని, మొన్నటి వరకూ కరోనా పరీక్షలకే పరిమితమైన ఆసుపత్రులను ఇప్పుడు కరోనాకు వైద్యం చేసే ఆసుపత్రులుగామార్చి అవసరమైన అన్ని వసతులు, మందులు అందిస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్నారని ఎమ్మెల్యే రాచమల్లు చెప్పారు.