తిరుపతి, ఆగస్టు 10
చిత్తూరు జిల్లాలో అరుదైన పక్షి కనిపించింది. బి.కొత్తకోట మండలం డేగాని పల్లిలో స్థానికులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. పొలాల్లో దూరంగా ఏదో విచిత్రమైన పక్షి కనిపించింది.. పంట పొలాలు కావడంతో ముందు కుందేలుగా భావించారు. కానీ ఆకారం చూస్తే కాస్త తేడాగా కనిపించింది.. కొంచెం దగ్గరకు వెళ్లి చూడగా.. అది ఎగిరేందుకు ప్రయత్నించింది. ధైర్యం చేసి దగ్గరకు వెళ్లారు.. తీరా చూస్తే కుందేలు కాదు పెద్ద పక్షిలా కనిపించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పుడూ ఎక్కడా కనిపించలేదు. ఇద్దరు కుర్రాళ్లు ధైర్యంగా ముందుకు వెళ్లి దానిని పట్టుకున్నారు.
పక్షిని చూస్తే వారికి పెద్ద గద్దాల కనిపించింది. ఓ అరుదైన జాతి పక్షిలా తేల్చారు. ఇది పురాణాల్లో చెప్పిన గరుడ పక్షని.. కాదు పెద్ద గద్ద అని చాలాసేపు చర్చ జరిగింది. ఓ వ్యక్తి ఇది అక్విలిన్ జాతి పక్షి అన్నాడు. ఆ పక్షిని జాగ్రత్త పట్టుకుని కొద్దిసేపు పరిశీలించారు. చాలా అరుదైన పక్షి కావడంతో స్థానికులంతా ఎగబడి చూశారు.. కొందరు సెల్ఫీలు కూడా దిగారు. తర్వాత మనకు ఎందుకులే అనుకున్నారేమో జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్లీ పొలాల్లోనే వదిలేశారు. ఆ పక్షి అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్లిపోయింది. ఈ పక్షి ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.