YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కొత్త జిల్లాలతో నేతలకు ఇబ్బందులే...

కొత్త జిల్లాలతో నేతలకు ఇబ్బందులే...

గుంటూరు, ఆగస్టు 11, 
కొత్త జిల్లాల ఏర్పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆనందంగానే ఉన్నప్పటికీ.. రాజ‌కీయంగా మాత్రం పార్టీ నేత‌ల‌కు తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిణామాలు ఎదుర‌వుతున్నాయి. కొంద‌రు నాయ‌కులు జిల్లాల మార్పుతో కీల‌క‌మైన పొజిష‌న్‌కు చేరుకుంటున్నారు. మ‌రికొంద‌రు మాత్రం జిల్లాల మార్పుతో త‌మ ప్రభావం కోల్పోయే ప‌రిస్థితులు వ‌స్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే.. గుంటూరు జిల్లా టీడీపీ నేత‌ల‌ను వేధిస్తోంది. ఇప్పటి వ‌ర‌కు రెండో అతిపెద్ద జిల్లాగా ఉన్న గుంటూరులో కీల‌క నాయ‌కులు చాలా మంది ఉన్నారు. ఈ జిల్లాలో ఎక్కడ నుంచి గెలుపు గుర్రం ఎక్కినా.. రాజ‌కీయంగా జిల్లా మొత్తం చ‌క్రం తిప్పుతున్నారు. అయితే, ఇప్పుడు జిల్లాల విభ‌జ‌న తెర‌మీదికి వ‌స్తే.. ఇలాంటి నాయ‌కుల హ‌వా త‌గ్గుముఖం ప‌డుతుంద‌నే వాద‌న ఉంది.ముఖ్యంగా అధికారపార్టీలోనే కాకుండా.. ప్రతిప‌క్ష టీడీపీలోనూ ఇలాంటి ప‌రిస్తితి వ‌స్తుంద‌ని అంటున్నారు. టీడీపీ సీనియర్‌ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, కొమ్మాలపాటి శ్రీధర్‌, జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, రాయ‌పాటి సాంబ‌శివ‌రావు వంటివారు. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో చ‌క్రం తిప్పుతూనే జిల్లా రాజ‌కీయాల్లోనూ ప్రభావవంత‌మైన రాజ‌కీయాలు చేశారు. అటు వ్యక్తిగ‌తంగా ఇటు రాజ‌కీయంగా కూడా గుంటూరు జిల్లాపై పెనుముద్ర వేశారు. అయితే, ఇప్పుడు ఆయా నేత‌లు ప్రాతినిధ్యం వ‌హించిన చిల‌క‌లూరిపేట‌, పెద‌కూర‌పాడు, వినుకొండ‌, గుర‌జాల వంటివి గుంటూరు నుంచి విడివ‌డి.. పల్నాడుకే పరిమితం కావలసి ఉంటుంది.ఇక న‌రసారావుపేట కేంద్రంగా ప్రత్యేక ప‌ల్నాడు జిల్లా ఏర్పాటు డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అది కార్యరూపం దాలిస్తే ప‌ల్నాడులో ఉన్న ఉద్దండ నేత‌లు అంతా త‌మ జిల్లాకే ప‌రిమితం కావాల్సి ఉంటుంది. వీరంతా కూడా గుంటూరు జిల్లాతో నేరుగా ఉండే సంబంధాల‌ను కోల్పోతారు. వీరి రాజ‌కీయాలు కూడా ప‌రిమితంగా మార‌తాయి. వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి.ఆంజ‌నేయులు జిల్లా పార్టీ అధ్యక్షుడు. చిల‌క‌లూరిపేట‌లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, గుర‌జాల‌లో పార్టీ కీల‌క నేత య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, పెద‌కూర‌పాడులో మ‌రో సీనియ‌ర్ నేత కొమ్మాల‌పాటి శ్రీథ‌ర్ ఉన్నారు. ఇక రేపో మాపో న‌ర‌సారావుపేట‌లో కోడెల వార‌సుడికి పార్టీ ప‌గ్గాలు ఇస్తే అక్కడ కూడా ఆ ఫ్యామిలీకి ప‌ట్టున్న నేప‌థ్యంలో బ‌ల‌మైన నేతే అవుతారు. వీరంతా పైకి బాగానే ఉన్నా లోప‌ల మాత్రం ఎవ‌రి ఎదుగుద‌ల ఎవ్వరికి ఇష్టం ఉండ‌దు. ఈ బ‌ల‌మైన నేత‌ల మ‌ధ్య స‌ఖ్యత ఎంత వ‌ర‌కు ఉంటుంద‌న్నదే సందేహం.పార్టీ ప‌రంగా చూస్తే గుంటూరు జిల్లాలో ప‌రిమిత సంఖ్యలోనే ధూళిపాళ్ల న‌రేంద్ర, ఆల‌పాటి రాజా, గ‌ల్లా జ‌య‌దేవ్ లాంటి నేత‌లు మాత్రమే ఉంటారు. ఇక బాప‌ట్ల జిల్లాలో వేగేశ‌న న‌రేంద్రవ‌ర్మ, మాజీ మంత్రి న‌క్కా ఆనంద్ బాబుతో పాటు ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి ర‌వికుమార్‌, ఏలూరి సాంబ‌శివ‌రావు లాంటి నేత‌లు ఉంటారు. ఏదేమైనా ప‌ల్నాడు జిల్లాలో అంద‌రూ యోధాను యోధులు అయిన నాయ‌కులు ఉండ‌డంతో ఇక్కడ పార్టీని ముందుకు న‌డిపించే నాయ‌కుడిని ఎంపిక చేయ‌డం కూడా అధిష్టానానికి పెద్ద స‌వాల్ లాంటిదే. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇప్పటి వ‌ర‌కు గుంటూరులో తిరుగులేకుండా ఉన్న టీడీపీ నేత‌లు.. ఇక‌పై కొంత మేర‌కే ప‌రిమిత‌మై పోనున్నారు.

Related Posts