విశాఖపట్టణం, ఆగస్టు 11,
నలుగురూ నవ్వేలాగ నాలుగు జిల్లాల కోవిడ్ సెంటర్ 'విమ్స్'ను తయారు చేశారంటూ జిల్లా యంత్రాంగంపై జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మరోసారి మండిపడ్డారు. గతంలోనూ జిల్లా యంత్రాంగంపై మంత్రి విరుచుకుపడ్డారు. గడచిన వారంలో కరోనా కేసులు జిల్లాలో మరింత ఆందోళన కలిగించే స్థాయికి వెళ్లిపోయాయి. మంత్రి సమీక్ష సంబంధిత వైద్య అధికారులను నిలదీసేలా చేసింది. అయితే పారిశుధ్య కార్మికులు కావాలని, ఐఎంఎ నుంచి వైద్యులు వస్తారని, ఎదురు చూస్తున్నామంటూ విమ్స్ డైరెక్టర్ సత్య వరప్రసాద్ చెప్పే ప్రయత్నం చేసినా ఆ ఆసుపత్రిలో మోగుతున్న 'మరణ మృదంగం' వల్ల ఆయన మొర ఆలకించేవారూ లేకపోయారంటే ఆశ్చర్యం కలుగక మానదు. విశాఖలో ప్రభుత్వ, ప్రయివేటు వైద్యులు ఎంత మంది ఉన్నారు? ఎంత మంది కోవిడ్ ఆసుపత్రుల్లో సేవలందిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం వీరికి కల్పిస్తున్న భద్రతల మాటేమిటి? మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యవేక్షణ ఎంత? నాలుగు జిల్లాల కోవిడ్ సెంటర్ విశాఖలో 'విమ్స్' మాత్రమే ఉంది. ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి. లోపలకు వెళితే బయటకు జీవంతో రావడం కష్టమేనని అనుకునే ప్రస్తుత పరిస్థితులకు కారణం ఏమిటి? ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలుగానే ఉంటున్నాయి. విమ్స్ ఆసుపత్రి కోవిడ్ స్టేట్ సెంటర్ అయినందున చివరాఖరులో తీసుకుని వస్తున్నందున వైద్యం చేయలేకపోతున్నామని, శవాలు తేలుతున్నాయంటూ వైద్యాధికారులు పలుమార్లు మొరపెట్టుకున్న సంగతి విస్మరించరానిది. విశాఖ జిల్లాలో దాదాపుగా 10వేల మంది వైద్యులు (ప్రభుత్వ, ప్రైవేట్) ఉన్నా విమ్స్ లాంటి చోట్ల అతి తక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. గీతంలోనూ 400 బెడ్స్ ఉండగా 100 మంది వైద్యులు పనిచేస్తున్నారు. షిఫ్టుల వారీగా కరోనా రోగులను చూసేందుకు విమ్స్, గీతం లాంటివి పనిచేస్తున్నా కరోనా రోగులు పెరుగుతున్న రీత్యా వైద్యులు వారివైపు కన్నెత్తి చూడడం లేదన్నది స్పష్టమవుతోంది. చెస్ట్ ఆసుపత్రిలో పరిస్థితి ఇంకా విషమం. టెస్టులు కూడా ఇక్కడ చేయకుండా కొన్ని రోజుల క్రితం నుంచే చేతులెత్తేశారు. ఒక దశ దాటిన తర్వాత పేషెంట్లు పెరిగిపోతున్నందున ఒక్కమాటలో చెప్పాలంటే 'కమ్యూనిటీ స్ప్రెడ్' ప్రారంభం అయ్యాక కొన్ని సదుపాయాలు ఆసుపత్రుల్లో ఉండకపోవడం, ప్రభుత్వం వైపునుంచీ సరైన స్పందన లేనందున ఏమీ చేయలేని స్థితిలోకి నెట్టబడ్డారన్నది తెలుస్తోంది