నెల్లూరు, ఆగస్టు 11,
ఇసుక బాధలు తీరడం లేదు. ట్రాక్టర్ ఇసుక కోసం వినియోగదారులు నానా తంటాలు పడుతున్నారు. ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకుంటే 72 గంటల్లో ఇంటికి ఇసుక వస్తుందని పదేపదే ముఖ్యమంత్రి మాటలు చెబుతున్నా ఆచరణలో అమలు కావడం లేదు. గ్రామ సచివాలయాల్లో బుక్ చేసుకోవాలని చెబుతున్నా ఎక్కడా సర్వర్లు పనిచేయడం లేదు. మరోవైపు కాలువలు, గుంటలు, చిన్న చిన్న ఏరుల్లో స్థానికుల అవసరాల కోసం ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకు సంబంధించి కలెక్టర్ గెజిట్ విడుదల చేశారు. 28 మండలాల్లోని 99 గ్రామాలకు ఇది వర్తిస్తోంది. మరోవైపు స్థానికులు వ్యక్తిగత అవసరాల కోసం ఇసుకను తీసుకెళుతుంటే విజిలెన్స్ ప్రత్యేక అధికారులు దాడులు చేసి పట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాణ పనులు నిలిచిపోయి లబోదిబో అంటున్నారు. మరోవైపు ఇసుక మాఫియా మాత్రం యథేచ్ఛగా బ్లాక్‌లో ఇసుక అమ్ముకుంటుంది. జిల్లా సరిహద్దుదాలు దాటి వెళ్లిపోతుంది.
ఇసుక కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ప్రభుత్వానికి ఈ విషయంలో చిత్తశుద్ధి లేదని తెలుస్తోంది. నూతన ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక కష్టాలు తీరడం లేదు. ఇల్లు కట్టుకోడానికి ఇసుకే ప్రధాన ఆటంకంగా మారుతోంది. అప్పో, సప్పో చేసుకొని ఇళ్లు నిర్మాణం చేసుకుంటున్నా ఇసుక లేకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. గత టిడిపి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందజేసిన విషయం తెలిసిందే. అప్పట్లో కొందరు వ్యక్తులు, రాజకీయ నాయకుల అండదండలతో చెన్నరు, బెంగళూరు, నగరాలకు ఇసుకను తరలించారు. ఓ వైపు పేదవాడికి ఉచితంగా ఇసుక ఇస్తూనే, మరోవైపు జేబులు నింపుకునే పనిచేశారు. వైసిపి ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చాక ఇసుకలో జరిగిన అవినీతిని రూపుమాపుతామని అసలకే ఎసరు పెట్టారు. గతేడాది జూన్ నుంచే ఇసుకను ఖరీదైన వస్తువులా మార్చేసింది ప్రభుత్వం. ఈ పరిణామాలతో దాదాపు ఏడాది నుంచి ఇసుక దొరక్క, భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేక నానా ఇబ్బందులు పడ్డారు. నూతన ఇసుక పాలసీ తీసుకొస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 30 ఇంటికే ఇసుక పథకం ప్రవేశపెట్టింది. ఇసుక అవసరం ఉన్న వ్యక్తులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఇంటికి ఇసుక అందిస్తామని ప్రకటించారు. ఇంతవరకు బాగున్నా ఒక ట్రాక్టర్ ఇసుక తెచ్చుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్‌ల్లో ఇసుక బుక్‌చేసుకోడానికి సర్వర్లు పనిచేయడం లేదు. మీ-సేవ కేంద్రాలు మూసేశారు. ఒక్క ట్రాక్టర్ ఇసుక కోసం గ్రామ సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులున్నాయి, బడాబాబులకు మాత్రం అధికారులే అన్ని చేసిపెడుతున్నారు. భారీ మొత్తాల్లో వందల లారీలు ఇసుక తరలించే వ్యక్తులు, నాయకులు అధికారుల చేతులు తడుపుతున్నారు.దాంతో చకచక ఇసుక వారికి కావాల్సిన చోటుకు చేరుతోంది.ప్రభుత్వ ఏర్పడినప్పటి నుంచి ఇసుక సమస్య తీరడం లేదు. ఎన్నో వేల మంది కార్మికులు, ఇంటి యజమానులకు సంబంధించిన అంశం కావడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మనబడి నాడు-నేడు పథకం అమలు చేస్తుంది. దీని కోసం ఇసుక ఇబ్బందులున్నాయి. ఇక పేదలు చిన్న చిన్న ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక తెచ్చుకోడానికి అవస్థలు పడుతున్నారు. ఇసుక కోసం ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోడానికి వినియోగదారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఎప్పుడూ సర్వర్లు బిజీబిజీ అనే మాట తప్ప మరొకటి వినిపించడం లేదు. తమ బాధలు చెప్పుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టోల్‌ప్రీ నెంబర్‌కు ఫోన్‌చేస్తే తీసుకోవడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. జిల్లాలోని పెన్నా, స్వర్ణముఖి, కాళంగి, పంబలేరు, బీరాపేరు, మామిడి కాలువ, జిల్లాలో 12 ఇసుక రీచ్‌లున్నాయి. పొట్టేపాళెం 1,2,3,4, సజ్జాపురం, గొల్లకందుకూరు, మినగల్లు, విరువూరు, ముదివర్తి, పడమటి కంభంపాడు, లింగంగుంట, అప్పారావుపాళెం ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్ణయించిన రీచ్‌లు నడుస్తున్నాయి.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తరువాత 72 గంటల్లో ఇంటికి ఇసుక పంపాల్సి ఉంది.జిల్లాలో ఇది అమలు జరగడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టన్ను ఇసుక రూ. 375. ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు మరో రూ.400 కలిపి ఇంటికి చేరాల్సి ఉంది. వినియోగదారులు తిరిగి తిరిగి ఆన్‌లైన్ నగదు చెల్లిస్తున్నారు. 72 గంటల్లో రావాల్సిన ఇసుక రోజుల తరబడి రావడం లేదు. ఎవరిని అడగాలో తెలియక, ఏం చేయాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా అధికారులకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేద్దామన్నా అధికారులు ఎవరూ ఫోన్ తీసుకోవడం లేదు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఇసుక కొరత ఉంది. పేదలు నిర్మించుకుంటున్న ఇళ్ల విషయంలో మరీ దారుణమైన పరిస్థితులున్నాయి. స్థానికంగా గ్రామ సచివాలయాల్లో ఇందుకోసం అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అక్కడకు వెళ్లి బుక్‌చేసుకోవాలన్నా వీలు కావడం లేదు. కరోనా, సర్వర్లు పనిచేయకపోవడం ఇలా ఏదొక కారణంగా సకాలంలో ఇసుక సామాన్య జనానికి అందడం లేదు. ప్రభుత్వ నూతన ఇసుక పాలసీ ఈ సమస్య నుంచి గట్టేక్కించలేక పోయింది.ఇసుకను స్థానిక అవసరాలకు ప్రజలు ఉపయోగించుకోడానికి కలెక్టర్ చక్రధర్‌బాబు గెజిట్ నెం.164 విడుదల చేశారు. 28 మండలాలకు సంబంధించి 99 గ్రామాల ప్రజలు దీనిని ఉపయోగించుకోవచ్చు. స్థానిక గ్రామ సచివాలయాల్లో అనుమతి తీసుకొని ఉచితంగా ఐదు కిలో మీటర్లు వరకు తీసుకెళ్లడానికి అవకాశం కల్పించారు. వెంటనే ఉత్తర్వులు అమలు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ఎఎస్‌పేట మండలంలో 6 గ్రామాలు, ఆనంతసాగరంలో 3, ఆత్మకూరు 10, బాలాయపల్లి 3, చిట్టమూరు 2, డక్కిలి 3, దుత్తలూరు 1, గూడూరు 3, జలదంకి 3, కలిగిరి 2, కొండాపురం 6, కోట 2, మనుబోలు 4, మర్రిపాడు 6, నాయుడుపేట 3, ఓజిలి 3, పొదలకూరు 1, రాపూరు 1, సైదాపురం 4, ఉదయగిరి 11, వికెపాడు 6, వింజమూరు 6, వాకాడు 1, కావలి 1, సూళ్లూరుపేట 3, డివి సత్రం 3 గ్రామాలకు అనుమతిచ్చారు. ఇసుక రీచ్‌లు కాకుండా స్థానికంగా ఉండే పిల్లకాలువలు, గుంటలు, ఇతర చోట్ల తీసుకోడానికి అవకాశం కల్పించారు. ఇక్కడ నాణ్యమైన ఇసుక లభ్యత అంతంత మాత్రమే కావడం విశేషం.