YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సోము వీర్రాజు స్టైల్ మార్చేశారు...

సోము వీర్రాజు స్టైల్ మార్చేశారు...

విజయవాడ, ఆగస్టు 11, 
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తన వైఖరిపై పక్కాగా ఉంది. రాజధాని అమరావతి విషయంలో రైతులకు న్యాయం చేయాలన్న డిమాండ్ తప్పించి మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకం కాదన్నది బీజేపీ నిర్ణయం. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారు కూడా లేకపోలేదు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నంత వరకూ బీజేపీ నేతలు కొంత దూకుడుగా ఉండేవారు. రాజధాని తరలింపుపై వారు నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను వెల్లడించేవారు.కానీ సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడయిన తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. బీజేపీ స్టాండ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేస్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నేతలే ఎక్కువగా రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీరిలో ప్రధానంగా కొద్దికాలం క్రితం సుజనా చౌదరి అనుచరుడు లంకా దినకర్ కు బీజేపీ అధిష్టానం నోటీసులు జారీ చేసింది.ఇటీవల రాజధాని అమరావతి విషయంలో పార్టీ స్టాండ్ కు వ్యతిరేకంగా ఒక పత్రికలో వ్యాసం రాసినందుకు ఓవీ రమణను పార్టీ సస్పెండ్ చేసింది. కనీసం షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా ఏకంగా సస్పెండ్ చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని బీజేపీ అగ్రనాయకత్వం పదే పదే చెబుతోంది. అయినా ఇటీవల దానికి విరుద్ధంగా మాట్లాడిన వెలగపూడి గోపాలకృష్ణను కూడా పార్టీ సస్పెండ్ చేయడం విశేషం.సోము వీర్రాజు స్పష్టమైన సంకేతాలను పార్టీ నేతలకు పంపుతున్నారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా ఏకంగా సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది. గతంలో ఎప్పుడూ పార్టీలో ఇలాంటి ధోరణి లేదని సీనియర్ నేతలు సయితం అభిప్రాయపడుతున్నారు. సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన వెంటనే తొలుత క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది. బీజేపీ లైన్ ను సమర్థించే వారే పార్టీలో ఉంటారని, ఇష్టం లేని వారు వెళ్లిపోవచ్చన్న అభిప్రాయాన్ని పార్టీ అధినాయకత్వం వెల్లడిస్తుండటం విశేషం. మొత్తం మీద ఏపీలో తెలుగుదేశం పార్టీ అనుకూల స్టాండ్ తీసుకున్న నేతలపై వేటు పడుతుండటం విశేషం.

Related Posts