న్యూఢిల్లీ, ఆగస్టు 11,
ఏపీలో ఇవే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. త్వరలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మార్చే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. ఏపీ. తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ ను తప్పించిన తర్వాత ఏపీ గవర్నర్ గా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన బిశ్వభూషణ్ హరిచందన్ ని గవర్నర్ గా నియమించింది. తాజాగా హరిచందన్ ని మార్చాలని భావిస్తోందనే వార్తలు వస్తున్నాయి.బీజేపీ నేత అయిన హరిచందన్‌ని ఏపీ గవర్నర్ సీటునుంచి మార్చాలని కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని గత రెండు రోజుల నుంచి ప్రచారం ఊపందుకుంది. రాజధాని విషయంలో ఆయన కేంద్రానికి చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారు అని కొందరు అంటున్నారు. ఆయన సంతకం పెట్టిన విషయంలో కేంద్ర ప్రభుత్వం కాస్త ఆగ్రహంగా ఉందని ప్రచారం జరుగుతోంది. గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో కూడా ఆయన ఇదే విధంగా దూకుడుగా నిర్ణయాలు తీసుకున్నారు. అప్పుడు ఏపీ హైకోర్టు ఆయనకు షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో గవర్నర్ మార్పు గురించి కేంద్రం బాగా ఆలోచిస్తోందని తెలుస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరహాలోనే రాజధాని విషయంలో ఇప్పుడు కూడా ఏపీ హైకోర్టు లో గవర్నర్ నిర్ణయానికి షాక్ తగిలే అవకాశాలు దాదాపుగా కనబడుతున్నాయి. న్యాయ సలహాలు తీసుకోకుండా ఆయన రాజధాని విషయంలో సంతకం పెట్టారని, అందుకే ఆయన వల్ల రాజ్యాంగ వ్యవస్థలపై వేరే సంకేతాలు బయటకు వెళతాయని కేంద్రం ఆలోచిస్తోంది. దీంతో కేంద్రం గట్టిగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కోసం అన్వేషణ సాగించిందని అంటున్నారు. బిబి హరిచందన్ స్థానంలో పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీని ఏపీరకి తేవాలని భావిస్తోంది.
కిరణ్ బేడీ అయితే సీఎం జగన్ దూకుడుకి కళ్లెం వేయవచ్చని అంటోంది. కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలుస్తోంది. త్వరలోనే ఆయన మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే కిరణ్ బేడీ ఎంట్రీ ఎప్పుడనేది ఇంకా తేలాల్చి వుంది. అయితే ఈ విషయం ఎప్పటికి క్లారిటీ వస్తుందో చూడాలి. ఇంతకుముందే కిరణ్ బేడీని కేంద్రంలో మంత్రిగా తీసుకునే అవకాశాలున్నాయనే వార్తలు వచ్చాయి. హర్షవర్థన్ స్థానంలో కిరణ్ బేడీని తీసుకుని కరోనా నివారణ బాధ్యతలు ఇస్తారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కిరణ్ బేడీకి ఏపీ గవర్నర్ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి మోడీ-అమిత్ షా ఆలోచన ఎలా వుందో చూడాలి.