YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ తుమ్మల, నామా కలుస్తారా..?

మళ్లీ తుమ్మల, నామా కలుస్తారా..?

ఖమ్మం, ఆగస్టు 11, 
ఆ ఇద్దరు బ‌ద్ధశ‌త్రువులు మ‌ళ్లీ క‌లిశారా..? ఆ మంత్రి దూకుడును అడ్డుకోవ‌డ‌మే వారి వ్యూహ‌మా..? అంటే తాజా రాజ‌కీయ ప‌రిణామాలు మాత్రం ఔన‌నే అంటున్నాయి. ఇప్పుడు ఖ‌మ్మం రాజ‌కీయాల్లో ఇదే అంశం హాట్‌టాపిక్‌గా న‌డుస్తోంది. ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర‌‌రావు, నామా నాగేశ్వరావులు టీడీపీలో ఉన్నప్పుడు కూడా రాజ‌కీయ‌వ‌ర్గ పోరుతో ర‌గిలిపోయిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. జిల్లాలో తుమ్మల హ‌వా కొన‌సాగుతున్నప్పుడు చంద్రబాబు నామా నాగేశ్వర‌రావుకు ప్రాధాన్యం ఇవ్వడంతో జిల్లా టీడీపీలో అంత‌ర్గత పోరు మొద‌లైంది. ఈ పోరులోనే 2004 ఎన్నిక‌ల్లో వీరిద్దరు ఓడిపోయారు. ఇక 2009 ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోయినా వీరిద్దరు మాత్రం ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో వీరిద్దరు ఒక‌రిని ఒక‌రు ఓడించుకునే ప్రయ‌త్నం చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేగా ఖ‌మ్మం నుంచి తుమ్మల.. ఎంపీగా నామా నాగేశ్వర‌రావు ఇద్దరూ ఓడిపోయారు.ఆ త‌ర్వాత తుమ్మల నాగేశ్వర‌‌రావు టీఆర్ఎస్‌లో చేరి ఏకంగా మంత్రి కూడా అయ్యారు. జిల్లాలో మ‌ళ్లీ త‌న‌దైన స్టయిల్లో చ‌క్రం తిప్పారు. పోయిన ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తుమ్మల నాగేశ్వర‌‌రావు ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి దాదాపుగా ఇంటికే ప‌రిమితం అవుతున్నారు. అయితే.. ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌హాకూట‌మి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నామా నాగేశ్వర‌‌రావు పార్లమెంట్ ఎన్నిక‌ల స‌మ‌యంలో అనూహ్యంగా టీఆర్ఎస్‌లో చేర‌డం.. ఎంపీగా గెల‌వ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు ఉద్దండుల ప‌ప్పులు జిల్లా రాజ‌కీయాల్లో ఉడ‌క‌డం లేదు. వీరిద్దరిని ఓడించిన పువ్వాడ అజ‌య్‌కుమార్ ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల్లో జెయింట్ కిల్లర్‌గా నిలిచారు.ప్రస్తుతం ఉమ్మడి ఖ‌మ్మం రాజ‌కీయాల్లో మంత్రి పువ్వాడ అజ‌య్ దూకుడు పెరిగిపోవ‌డం ఎంపీ నామా నాగేశ్వర‌రావుకు న‌చ్చడం లేద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఖ‌మ్మం రాజ‌కీయ పెత్తనం మొత్తం కూడా అజ‌య్ చేతిలో ఉండ‌డంతో ఎంపీ నామాతో పాటు తుమ్మల నాగేశ్వర‌‌రావు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే రాజ‌కీయంగా బ‌ద్ధ శ‌త్రువులుగా ఉన్న ఎంపీ నామా నాగేశ్వర‌‌రావు మెల్లగా తుమ్మ‌ల‌కు ద‌గ్గర అయ్యేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నార‌నే టాక్ గులాబీవ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవ‌ల నామా తుమ్మల వ‌ద్దకు వెళ్లి ప‌రామ‌ర్శించ‌డం.. ఈ మ‌ధ్య త‌న కంపెనీలో త‌యారైన శానిటైజ‌ర్లను కూడా అంద‌జేశార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.అయితే.. ఇక్కడ తుమ్మల నాగేశ్వర‌‌రావు మ‌న‌సులో ఏముందో తెలియ‌దుగానీ నామా నాగేశ్వర‌‌రావు మాత్రం క‌ల‌సి న‌డిచేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా మంత్రి పువ్వాడ అజ‌య్‌కు చెక్ పెట్టాల‌న్న వ్యూహంతో పావులు క‌దుపుతున్నట్లు స‌మాచారం. జిల్లాలో అన్ని కీల‌క ప‌ద‌వులు పువ్వాడ చెప్పిన వాళ్లకే వ‌స్తున్నాయి. దీంతో తుమ్మల నాగేశ్వర‌‌రావు, నామా నామామాత్రమ‌య్యారు. ఇక నామా, తుమ్మల ద‌గ్గ‌ర‌వుతోన్న ప‌రిణామాల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్న మంత్రి పువ్వాడ త‌న‌దైన శైలిలో ముందుకు వెళ్తున్నార‌ట‌. తుమ్మల‌, నామా క‌ద‌లిక‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని ఎప్పటిక‌ప్పుడు తెప్పించుకుంటూ నామాకు ఎక్కడ..? ఎప్పుడు..? ఎలా ? చెక్ పెట్టాల‌న్న అంశంపై వ్యూహం ర‌చిస్తున్నట్లు గులాబీవ‌ర్గాల్లో బ‌లంగా టాక్ వినిపిస్తోంది. అయితే అదే స‌మ‌యంలో మంత్రి పువ్వాడ‌ను వ్యతిరేకిస్తోన్న కొంద‌రు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు నామాకు ద‌గ్గర అవుతున్నార‌ట‌. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ముందుముందు ఖ‌మ్మం రాజ‌కీయం స‌రికొత్త రూపు తీసుకోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

Related Posts