YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

కోలుకోలేని స్థితిలో సౌత్ సెంట్రల్ రైల్వే

కోలుకోలేని స్థితిలో సౌత్ సెంట్రల్ రైల్వే

హైద్రాబాద్, ఆగస్టు 11, 
లాక్‌డౌన్ నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే నష్టాల్లో కూరుకుపోతోంది. అందులో భాగంగా నష్టాలను పూడ్చుకోవడానికి ప్రస్తుతం సరుకు రవాణాతో ఆదాయాన్ని పెంచుకోవడానికి దక్షిణమధ్య రైల్వే కృషి చేస్తోంది. ప్రస్తుతం కోవిడ్ 19 నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే పరిధిలోని ప్రయణికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. గతంలో రోజుకు ఈ రైల్వే పరిధిలో 11 లక్షల మంది ప్రయాణించేవారు. షార్ట్‌టర్మ్ అంటే ప్రయాణిస్తుండగా, ఎంఎంటిస్‌లోనే ప్రయాణికులు ఉండేవారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఆ సంఖ్య 25 నుంచి 30 వేలకు పడిపోవడంతో దక్షిణమధ్య రైల్వే ఆదాయం భారీగా పడిపోయింది. గతంలో రోజుకు 750 ట్రెయిన్లు దక్షిణమధ్య రైల్వే పరిధిలో నడిచేవని, ప్రస్తుతం ఆ సంఖ్య 30కి పడిపోయిందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. అవి కూడా స్పెషల్ ట్రెయిన్లు మాత్రమేనని, అందులో చాలా రైళ్లలో స్టాప్‌లను కుదించడంతో ప్రయాణికులు సైతం దూరం ప్రయాణించడానికి వెనుకంజ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ జోన్ పరిధిలో నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 4 నుంచి 5 లక్షల మంది రోజువారీగా రైళ్లలో ప్రయాణించేవారు. ప్రస్తుతం రైళ్లు భారంగా నడుస్తున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో నగరంలో చిక్కుకుపోయిన దూరప్రాంతాల ప్రయాణికుల కోసం దక్షిణమధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు 23 ప్రత్యేక రైళ్లను నడిపింది. మే నెల నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ రైళ్లకు జూన్, జూలై రెండోవారం వరకు డిమాండ్ బాగానే ఉన్నా కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు మరింత పెరగడంతో ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గిపోయిందని దక్షిణమధ్య రైల్వే పేర్కొంటుంది.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఓ వైపు అన్‌లాక్ ప్రక్రియ మూడోదశకు చేరుకుంది. లాక్‌డౌన్ నిబంధనలను మరింత సడలించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినా ప్రయాణికులు ముందుకు రావడం లేదు. సికింద్రాబాద్ నుంచి కోల్‌కతాకు వెళ్లే హౌరా ఎక్స్‌ప్రెస్‌ను భువనేశ్వర్ వరకే పరిమితం చేశారు. ఇటీవల కొన్ని సర్వీసులను రైల్వే అధికారులు రద్దు చేశారు.లాక్‌డౌన్ కాలంలో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖ, తదితర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం మొదట బెంగళూర్ టు -ఢిల్లీ, సికింద్రాబాద్- టు ఢిల్లీ మధ్య రెండు రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఆ తరువాత సికింద్రాబాద్ నుంచి ముంబై, కోల్‌కతా, విశాఖ, తిరుపతి, బెంగళూర్, న్యూఢిల్లీ, తదితర ప్రాంతాలకు సర్వీసులను పెంచారు. దీంతో 23 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.సాధారణంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలో గతంలో రోజుకు 750 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా సుమారు 10 నుంచి 11 లక్షల మంది ప్రయాణం చేసేవారు. ఒక్క సికింద్రాబాద్ నుంచే సుమారు 220 రైళ్లు వివిధ ప్రాంతాలకు ప్రయాణించేవి. ఈ రైళ్ల వలన దక్షిణమధ్య రైల్వేకు రోజుకు రూ.12 కోట్ల మేర ఆదాయం లభించేది. కానీ ఈ ఆదాయం ఇప్పుడు పూర్తిగా పడిపోయింది. ప్రత్యేక రైళ్ల నిర్వహణ సైతం భారంగా మారింది. ప్రస్తుతం రోజుకు సుమారు రూ.కోటి నుంచి రూ.1.5 కోట్లు మాత్రమే వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

Related Posts