శీ మహావిష్ణువు అన్ని అవతారాలలో చైతన్యవంతమైనదీ , పండిత పామరులను పిన్నలను,పెధ్దలను అమితంగా ఆకర్షించే అవతారం
కృష్ణావతారం. కృష్ణుని లీలలు, కొంటెతనం, దయ, కరుణ, అందం, రాజకీయ చతురత ,
మొదలైన అంశాలన్నింటితో
కృష్ణావతారం జగత్ప్రసిధ్ధి పొందింది.
శ్రావణమాసంలో బహుళ అష్టమి తిధి అర్ధరాత్రి 12 గం.
శ్రీ కృష్ణ పరమాత్మ ఈ లోకాన అవతరించాడు. ఆ దినాన్ని అత్యంత పుణ్యప్రదమైనదిగా
ప్రజలంతా గోకులాష్టమి, కృష్ణజయంతి,
శ్రీ జయంతి
అనే పేర్లతో దేశవ్యాప్తంగా ఉత్సవాలు చేసుకుంటారు.
అర్ధరాత్రి అవతరించినా , మానవులలోని
అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి
భగవద్గీతని లోకానికి అందించిన కృష్ణ పరమాత్మ
అఖిల జగత్తు కి ప్రధమగురువు.
అర్జునునికి ఉపదేశించిన గీతలోని విషయాలన్నీ
జ్ఞానదీపికలు.
చిన్నతనంలోనే సకలచరాచరాలను తన చిన్న నోటిలోనే దర్శింప చేశాడు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం
ప్రతి యుగంలోను తను అవతరిస్తానని భగవద్గీత లో
తెలిపాడు. తానే సృష్టి , స్ధితి, లయకారకుడనని
తనలోనే త్రిమూర్తులు , ఇంద్రాది దేవతలున్నారని వివరించాడు.
భగవంతుని అనేక లీలలను,రూపాలను కృష్ణావతారంలోనే దర్శించగలము.
నవరాత్రి అమ్మవారికి, శివరాత్రి పరమేశ్వరునికి,
కందషష్టి కుమారస్వామికి
రామనవమి శ్రీ రామునికి
వారి అవతార పేరులతోనే
చెప్తాము. కానికృష్ణుని కి ఆయన పుట్టిన తిధిని బట్టి , కృష్ణాష్టమిగా, గోకులంలో పెరిగినందున గోకులాష్టమిగా ఉత్సవాలు వైభవంగా
జరుగుతున్నాయి.
ఆ తత్వం ఏమిటంటే , కృష్ణుడు సంపూర్ణ ఈశ్వరస్వరూపంగా అవతరించడమే .
ఇతర అవతారములన్నిటిని
శ్రీ మహావిష్ణువు అంశగా
చెప్తారు. రామావతారంలానే , కృష్ణావతారం కూడా సంపూర్ణావతారం.
శ్రీ కృష్ణుడు , తానే భగవంతుడనని భగవద్గీత లో
పలుచోట్ల తెలియ చేశాడు.
ప్రజలకు మేలు చేయడానికే
తాను మానవునిగా అవతరించానని తెలియజేశాడు.
లోకాన్ని తన కంటి రెప్పలవలె
కాపాడుతున్నందున "కణ్ణన్"(తమిళ భాషలో)
అని, మనిషి ఈ లోకంలో పుట్టి , జీవించి
ముక్తి పొందడానికి ముఖ్య కారకుడగుటచేత "ముకుందా" అని పిలువబడుతున్నాడు.
"ముర" అనే రాక్షసుని
సంహరించిన కారణంగా "మురారి" అని
కీర్తించబడినాడు.
కృష్ణుని పాద ముద్రలు ..
శ్రీకృష్ణ జయంతి పండుగ..
ఒకసారి నారదుడు కృష్ణ భక్తుల ఇళ్ళకు వెళ్ళి చూసినప్పుడు , అందరి ఇళ్ళలోను కృష్ణుని చూచి
విస్మయం చెందేడు.
అదేవిధంగా బృందావనంలోను అందరి ఇళ్ళలోనూ అందరితో ఆడుతూ, పాడుతూ దర్శనమిచ్చాడు.
పరమేశ్వరుడు ఈ దృశ్యాలను చూసి పరవశించాడు.
ఈవిధంగా, ఒకే సమయంలో
అన్ని చోట్ల దర్శనమిస్తున్న కృష్ణుని
సర్వాంతర్యామిగా భావించి గోకులాష్టమినాడు
అందరి గృహాలలో
పసిపిల్లల పాద ముద్రలను పిండిముగ్గుతో ప్రవేశద్వారము నుండి
పూజా గది దాకా వేయడం ఆచారంగా వస్తున్నది.
ఆ రోజున శ్రీ కృష్ణుడు భక్తుల గృహాలు పావనంచేసి అనుగ్రహిస్తాడని ఐహీకం.
బాలకృష్ణుడు 3 ఏళ్ళదాకా గోకులంలోను, 3 నుండి 6 సంవత్సరాలదాకా బృందావనంలోను.
7 వసంవత్సరంలో గోకులంలో గోపికలతోను,
8 సంవత్సరముల నుండి
10 సంవత్సరాల వయసు వరకూ మధురలో నివసించాడు. కంసుని వధించిన సమయానికి కృష్ణుని వయస్సు 7 సంవత్సరములు.
కృష్ణ జయంతి నాడు పిల్లలకి
రాధా కృష్ణుల వేషాలను ధరింప చేసి కృష్ణునికి యిష్టమైన తీపి పిండివంటలు చేసి పంచిపెట్టి
ఆనందిస్తారు.
ఇలా వేషాలు
ధరింపజేసి పూజలు చేసినందువలన
కృష్ణుడంతటి, జ్ఞానిగా
ఉన్నతంగా పేరుపొందుతారని
భక్తుల విశ్వాసం.
ఆనాడు ఉదయముననే
గృహాన్ని, పూజా గదిని శుభ్రపరచి, మామిడాకు
తోరణాలు కట్టి, గుమ్మం వద్ద నుండి , పూజాగది దాకా
కృష్ణుని పాద ముద్రలు పిండితో పెట్టి కృష్ణుని పటానికి, చందనం, కుంకుమ ,పుష్పాలు తులసిమాలలతో
అలంకరిస్తారు. పగలు వారి వారి ఆచారాలతో పూజిస్తారు.
సాయంకాలం తిరిగి స్నానం చేసి , శుభ్ర వస్త్రాలు ధరించి
దీపం వెలిగించి, కృష్ణుని కి
ఇష్టమైన వెన్న, పెరుగు
అటుకులు, పేలాలతో చేసిన బెల్లపు వుండలు , చక్కిలాలు,
పాలకాయలు, అప్పాలు,
అటుకుల పాయసం , లడ్డు , వడలు , పలురకాల ఫలాలు
వారి వారి వసతులను బట్టి పెట్టి
ధూప, దీప , నైవేద్యాలతో
పూజించి ఆరాధిస్తారు.
కృష్ణుని పూజ సాయంకాలం
6 గం నుండి 7 గం లోపల చేయడం ఒక విశిష్టత .
ఆలయాలలో కృష్ణ జయంతి ఉత్సవాలలో వుట్టి కొట్టడం
రాధాకళ్యాణ వైభవాలు
ఆధ్యాత్మిక ప్రవచనాలు , కోలాటాలు, గొబ్బి తట్టడం కృష్ణుని ఉత్సవ విగ్రహల ఊరేగింపులు మొదలైనవి జరుగుతాయి. ఉత్తర దేశంలో శ్రీకృష్ణుడు
కన్నయ్యా అని పిలువ
బడుతున్నాడు.
శ్రీ కృష్ణుని పూజించడం వలన మనిషిలోని
అహం తొలగిపోతుంది.
చిన్న పిల్లలలో మూర్ఖత్వం
తగ్గుతుంది.
కన్యలు పూజిస్తే
వివాహభాగ్యం కలుగుతుంది.
రాజస్ధాన్ రాష్ట్రంలో నాధ్వారా అనే పుణ్య క్షేత్రంలో శ్రీ కృష్ణునికి
( శ్రీ నాధ్ జీ) ఏమేమి
కైంకర్యం చేయాలో500 సంవత్సరాల క్రితమే
నిర్ణయింపబడి వున్నవి.
అవి, బాదం పప్పలు, పిస్తాపప్పులు, లడ్డు, తీయని పూరీలు , మజ్జిగ పులుసు మొదలైనవి.
శ్రీ కృష్ణుడు తన
" నీవు నాకు ఒక పత్రమో, పుష్పమో, ఏమీ ఇవ్వలేక పోయినా భక్తితో నీరైనా
సమర్పించు . స్వఛ్ఛమైన
మనసు కలవారు ఏమిచ్చినా
నేను తీసుకుంటాను" అని అన్నాడు.
అష్టమి, నవమి
తిధులు మానవులు తమని చెడ్డ తిధులుగా భావిస్తున్నారని వ్యధ చెందాయి. అందుకే శ్రీ మహావిష్ణువు మానవ అవతారాలలో నవమి నాడు శ్రీ రామునిగాను, అష్టమినాడు కృష్ణుని గాను అవతరించాడు.
శ్రీ కృష్ణుని విశ్వరూప దర్శనం
ఎలాగైతే వర్ణింపతరం కాదో అలాగే శ్రీ కృష్ణుని లీలలను ,
కీర్తీని కూడా సామాన్య మానవులు వర్ణించ లేరు.
శ్రీ కృష్ణుని అనుగ్రహము లభిస్తే
సకల కష్టనష్టాలు తీరి
సుఖ సంతోషాలు లభిస్తాయి