రాజమండ్రి ఆగష్టు 11
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం జొన్నాడ గౌతమి గోదావరి పాత బ్రిడ్జి పై నుండి గోదావరిలోకి ఒక యువకుడు దూకాడు. ఇది గమనించిన ఆలమూరు పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ (కోర్టు కానిస్టేబుల్ ) జి ప్రభాకర్ రావు ప్రాణాలకు తెగించి కాపాడిన సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కపిలేశ్వరం మండలం అంగర గ్రామానికి చెందిన ఎర్ర రమేష్ రావులపాలెం వైపునుండి జొన్నాడ వైపు వస్తుండగా ప్రాత బ్రిడ్జి నుంచి గోదావరిలోకి పడి పోతుండగా కొత్త బ్రిడ్జి పై రావులపాలెం వైపు వెళ్ళుతున్న ఆలమూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జి ప్రభాకరరావు సంఘటన చూసి అటుగా వెళ్తున్న లారీలను ఆపి వాటిలోనుంచి తాడుతీసుకొని కొత్త బ్రిడ్జి స్తంభాన్ని పట్టుకున్న యువకుడు రమేష్ ను స్థానికుల సహాయంతో పైకి లాగి ప్రాణాలను కాపాడాడు. హెడ్ కానిస్టేబుల్ చేసిన సాహసానికి అటుగా వెళ్తున్న ప్రజలు కొనియాడారు. విషయం తెలుసుకున్న ఆలమూరు ఎస్ఐ ఎస్ శివ ప్రసాద్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాగా యువకుడు గోదావరిలో పడిన సంఘటన పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి . సెల్ఫీ తీసుకుంటుండగా గోదావరిలో పడినట్లు గానూ, మరొకరు తన వెళ్లే వాహనంలో పెట్రోలు అయిపోగా పాత బ్రిడ్జి పై గల గోడపై కూర్చుని అకస్మాత్తుగా పడిపోయినట్లు గానూ, మరొకరు గోడ పైకి ఎక్కి గోదావరిలోకి దూకినట్లు గానూ కథనాలు వినిపిస్తున్నాయి