కాకినాడ ఆగష్టు 11
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా టెస్టింగ్ కిట్ల భాగోతం బయటపడింది. ఉచితంగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇస్తోన్న ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నట్లు అధికారులు నిర్దారించారు. కాకినాడ కార్పోరేషన్ పరిధిలో కిట్లు పక్కదారి పట్టినట్టు గుర్తించారు. నగరపాలక సంస్థ మెడికల్ ఆఫీసర్ కరీముల్లా ను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సస్పెండ్ చేసారు. హెల్త్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ ను మాతృసంస్థకు బదిలీ చేసారు. కిట్ల మాయాజాలంపై పూర్తి స్థాయి విచారణకు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశించారు. ఫోర్జరీ సంతకాలతో జిజిహెచ్ కు చెందిన ఉద్యోగి మరో 300 కిట్లు తీసుకున్నట్టు విచారణలో గుర్తించారు. గతంలో కాకినాడ జీజీహెచ్ లో ఎంఎన్ఓగా పని చేసిన బాషా ఫోర్జరీ చేసినట్టు నిర్ధారించారు. ప్రస్తుతం అమలాపురం ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తోన్న బాషా, జీజీహెచ్ ఆర్ఎంఓ సంతకం ఫోర్జరీ చేసి 300 కిట్లు తీసుకుని వెళ్లినట్టు పోలీసులకు డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరీ ఫిర్యాదు చేసారు. విచారణకు కాకినాడ త్రీ టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. దాంతో బాషా తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇప్పటి వరకు వచ్చిన కిట్లు, నిర్వహించిన పరీక్షలపై పోలీసులు విచారణ చేపట్టారు.