YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సాంబశివరాజుకు తగిన గౌరవం..

సాంబశివరాజుకు తగిన గౌరవం..

విజయనగరం, ఆగస్టు 12, 
పెన్మత్స సాంబశివరాజు. దాదాపు నిండు జీవితాన్నే అనుభవించారు. రాజకీయంగా ఆయన విజయనగరం జిల్లాను శాసించారు. ఓ వైపు పూసపాటి వంశీకులు గట్టిగా ఉన్న సమయంలో వారికి ధీటుగా నిలిచి ఉనికి చాటుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు, కానీ సాంబశివరాజు సుదీర్ఘకాలం పాటు కొనసాగడమే కాకుండా ఎంతో మంది శిష్యులను తయారు చేశారు. పూసపాటి వారికి ఆ శిష్య పరంపర లేదు కానీ, సాంబశివరాజుకు మాత్రం ఎక్కడ చూసినా శిష్యులే. వారంతా ఇపుడు రాజకీయంగా బాగానే రాణిస్తున్నారు.సాంబశివరాజు రాజకీయాల్లో శిఖరాయమానంగా వెలిగినపుడు ఆయన దగ్గర బొత్స సత్యనారాయణ ఓనమాలు దిద్దారు. బొత్స ప్రతి ఎదుగుదలలో సాంబశివరాజు ఉన్నారని అంటారు. ఆయన ఈ రోజు మంత్రిగా కొనసాగుతున్నారు. బొత్స పీసీసీ చీఫ్ దాకా వెళ్లినా కూడా దాని వెనక బలమైన పునాది వేసింది మాత్రం రాజు గారే. చిత్రమేంటంటే రాజకీయాల్లో కులాలు, సామజిక సమీకరణలు పెద్ద పీట పోషిస్తాయి. ఆ విధంగా సాంబశివరాజు కేవలం రాజు అన్న ఒకే ఒక్క కారణంగా వెనకబడిపోయారు. చాలా కీలకమైన హోదాలు ఆయన దగ్గరకు రాలేదు. అయితే ఆయన మిత్రుడు నేదురుమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రి అయినపుడు పట్టుబట్టి మరీ సాంబశివరాజుని మంత్రిని చేశారు. అలా రెండేళ్ల పాటు మంత్రి పదవిలో ఆయన కొనసాగారు.ఇదిలా ఉంటే వైఎస్సార్ 2004లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయనతో కూడా రాజు గారు సఖ్యతగా ఉంటూ వచ్చారు. నిజానికి సాంబశివరాజుకు మంత్రి పదవి ఇవ్వాలి. సీనియర్ మోస్ట్ నేతగా అప్పటికే ఏడుసార్లు గెలిచి ఉన్నారు. కానీ వైఎస్సార్ ఆయన శిష్యుడు బొత్స సత్యనారాయణకు చాన్స్ ఇచ్చారు. అలా బొత్స రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. విజయనగరం జిల్లాలో హవా చాటారు. ఇక గురువు సాంబశివరాజు శిష్యుడు దూకుడు ముందు ఎందుకూ కాకుండా పోయారు. ఓ దశలో రాష్ట్ర రాజకీయాల నుంచి విరమించుకుని పెద్దల సభకు సాంబశివరాజు వెళ్లాలనుకున్నారు. తనకు రాజ్యసభ సీటు ఇవ్వమని వైఎస్సార్ని ఆయన కోరినట్లుగా ప్రచారం ఉంది. నాడు సర్వశక్తిమంతుడైన వైఎస్సార్ కూడా రాజకీయ, సామాజిక సమీకరణలు, జిల్లా రాజకీయాల నేపధ్యంలో ఇవ్వలేకపోయారంటారు.కాంగ్రెస్ 2009లో అధికారంలోకి వచ్చినా సాంబశివరాజు ఓడిపోయారు. దాంతో పాటుగా బొత్స గెలిచి మళ్ళీ మంత్రి కావడంతో శిష్యుని రాజకీయాలతో వేగలేక ఏకంగా కాంగ్రెస్ ని విడిచిపెట్టి అప్పటికే జగన్ పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిపోయారు. అలా జగన్ కి రాజకీయ కురువృద్దుడి బలం పెద్ద ఎత్తున దక్కింది. విజయనగరం జిల్లా వరకూ సాంబశివరాజుదే హవాగా ఉంటూ వచ్చింది. 2014 ఎన్నికల్లో టికెట్లు కూడా ఆయన కనుసన్నల్లోనే సాగాయని అంటారు. అయితే వైసీపీ నాడు ఓడిపోవడంతో పాటు, రాజు గారి కుమారుడు సూర్యనారాయణ రాజు కూడా నెల్లిమర్ల నుంచి పోటీ చేసి ఓడారు. ఆ తరువాత బొత్స సత్యనారాయణ వైసీపీలోకి రావడంతో మళ్లీ కాంగ్రెస్ కష్టాలే రాజుగారిని చుట్టుముట్టాయి. బొత్స తనదైన శైలిలో జిల్లా రాజకీయాలను శాసిస్తూ గురువు గారికి చెక్ పెట్టేశారు. ఈ పరిణామాల నేపధ్యంలో 2019 ఎన్నికల్లో టికెట్ కూడా రాజు గారి కుటుంబానికి దక్కలేదు, జగన్ ఎమ్మెల్సీ సీటు అయినా ఇస్తామని నాడు హామీ ఇచ్చారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా జగన్ హామీ తీర్చలేదు, ఈలోగా రాజు గారు ఈ లోకాన్నే వీడిపోయారు. మొత్తానికి రాజకీయంగా రాజులా బతికి అవినీతి మచ్చ లేని నేతగా ఉన్న సాంబశివరాజుకు జగన్ కూడా న్యాయం చేయలేదన్న విమర్శ మాత్రం అలాగే ఉండిపోయింది. అనుచరులకు ఇదే బాధగా ఉంది.

Related Posts