YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బకింగ్ హాం కెనాల్ తో జలరవాణా...

బకింగ్ హాం కెనాల్ తో జలరవాణా...

ఒంగోలు, ఆగస్టు 12, 
శతాబ్దాల చరిత్ర గల బకింగ్‌హాం కెనాల్‌ బ్రిటీష్‌ పాలకుల కాలంలో ఒక వెలుగు వెలిగింది. బంగాళాఖాతం సమద్ర తీరంలో లాంచీలు, బోట్లు, పడవలు ముమ్మరంగా తిరిగేవి. తీరం వెంబడి కళకళలాడుతూ దీపాలతో దేదీప్యమానంగా వెలుగొందేది. ఆ వైభవం కాలక్రమేణా మసకబారింది. అప్పటి పరిస్థితులు మళ్లీ తిరిగి రావాలంటే బకింగ్‌హాం కెనాల్‌ను పునరుద్ధరించాలి. అప్పుడే తిరిగి జలరవాణాకు మార్గం సుగమం అవుతుంది. బకింగ్‌హాంలో జలరవాణా ప్రారంభమైతే రవాణా వ్యవస్థ మరింత అభివృద్ధి చెందుతుంది. పోర్టుల అనుసంధానంతో విశాఖ–చెన్నై కోస్తా కారిడార్‌కు కూడా లాభం చేకూరుతుంది.విశాఖ–చెన్నై కోస్తా కారిడార్‌ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దాంతో పాటు బకింగ్‌హాం కెనాల్‌ను కూడా అభివృద్ధి చేస్తే అన్ని విధాల సముద్ర తీర ప్రాంతం ఎంతగానో అభివృద్ధికి నోచుకుంటుంది. తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి. మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. ఉపరితల రవాణాతో పోలిస్తే జలరవాణాకు ఖర్చు నామమాత్రం కావడంతో  రవాణా ఖర్చు తగ్గి  ఆదాయ వనరులు మరింతగా పెరుగుతాయి. మొత్తంగా  జలరవాణా  మరింత అభివృద్ది సాధించి తద్వారా త్వరితగతిన రాష్ట్రం అభివృద్ధి చెందటానికి దోహద పడుతుంది.చెన్నై నుంచి కాకినాడ వరకు ఉన్న బకింగ్‌హాం కాలువ దాదాపు కుచించుకుపోయింది. సరాసరి 100 మీటర్లు ఉండాల్సిన కాలువ ప్రస్తుతం 10 మీటర్లు కూడా లేదంటే కాలువ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధమవుతుంది. శిథిలావస్థకు చేరి ఆక్రమణ దారుల కబంధ హస్తాల్లో బకింగ్‌హామ్‌ చిక్కుకు పోయింది. ప్రకాశం జిల్లా పరిధిలోని సింగరాయకొండ, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లితో పాటు కందుకూరు పరిధిలో పెద్దపట్టపుపాలెం, కరేడు, చాకిచర్ల, గుండ్లూరు పరిధిలో మూర్తింపేట, ఆవులవారిపాలెం, మొండివారిపాలెంతోపాటు చీరాల, వేటపాలెం, చినగంజాం ప్రాంతాల్లో  అనేక మంది కాలువను ఆక్రమించి చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేశారు.బకింగ్‌హామ్‌ కెనాల్‌ పొడవు 427 కి.మీ. కృష్ణా, గోదావరి డెల్టాలను కలుపుతూ ఈ కాలువ కొనసాగుతుంది. కొన్ని చోట్ల సముద్రానికి మూడు మైళ్ల దూరంలోనూ, ఎక్కువభాగం అరకిలోమీటర్‌ దూరంలోనూ ఉండడం విశేషం. కొంత భాగం పులికాట్‌ సరస్సు పరిధిలోనూ ఉంది. బకింగ్‌హామ్‌ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కాలువ. 1806లో అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం నుంచి కో క్రైన్స్‌ అనే వ్యక్తి ఈ కాలువను లీజుకు తీసుకున్నాడు. దీంతో కొంత కాలం ఆయన పేరుమీదే కోక్రైన్స్‌ కెనాల్‌ అని పిలిచారు. లీజుకు తీసుకున్న ఆయన ఓడల వద్ద డబ్బులు వసూలు చేసేవాడు. 1837లో బ్రిటీష్‌ ప్రభుత్వం దీనిని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ కాలువ పనులను అప్పటి గవర్నర్‌ డ్యూక్‌ బకింగ్‌హాం పర్యవేక్షణలో జరగడంతో  ఈ కాలువకు బకింగ్‌హాం కెనాల్‌ అని పేరు వచ్చింది. బంగాళాఖాతం తీరానికి ఒక కిలో మీటర్‌ దూరంలో ఆంధ్రాలోని కాకినాడ నుంచి చెన్నైలోని విల్లీపురం వరకు  కాలువ నిర్మాణం జరిగింది. ఈ కాలువ ఆంధ్ర ప్రదేశ్‌లో 262 కిలో మీటర్లు, తమిళనాడులో 165 కిలో మీటర్లు పొడవు ఉంది.సముద్ర కెరటాల ఆధారంగా వచ్చే పోటు.. పాటు ద్వారా నౌకల ప్రయాణం సులువుగా ఉంటుంది. కాలువ మధ్య, మధ్యలో పటిష్టమైన భారీ కొయ్య చెక్కలతో తయారు చేసిన గేట్లు ఏర్పాటు చేశారు.  ఈ పోటు, పాటు ద్వారా వచ్చే అలలు ఉధృతికి నౌకలు, పడవలు వేగంగా వెళ్లేవి. తద్వారా ఇంధనం ఆదా ఎక్కువగా అయ్యేది. మొదటగా కాకినాడ పోర్టు నుంచి వివిధ వస్తువుల రవాణా తక్కువ ఖర్చుతో చెన్నైకి చేరవేసేవారు. రోజుకు 12.5 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా అయ్యేది. శ్రీహరికోట నుంచి మద్రాసుకు వంట చెరుకును పెద్ద ఎత్తున ఎగుమతి చేసేవారు.  కాలువ ఒడ్డున  మద్రాసు నుంచి కాకినాడ వరకు 50కి పైగా ట్రావెల్‌ బంగ్లాలు నిర్మించారు. కాలువ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. తీరం పొడవునా దాదాపు 150 మందికి పైగా ఇన్‌స్పెక్టర్లు కాలువ ప్రవాహ వేగాన్ని సమీక్షిస్తూ ప్రతి రోజూ బ్రిటిష్‌ ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చేవారు. కాలువ మధ్యలోని గేట్లు వద్ద మరికొంతమంది సిబ్బంది కూడా విధులు నిర్వర్తించేవారు. ప్రస్తుతం ఆ బకింగ్‌హాం కాలువ సిబ్బందిని ప్రస్తుతం నీటిపారుదల శాఖలో విలీనం చేశారు.క్రమంగా రైల్వే వ్యవస్థ రావడంతో బకింగ్‌హాం కెనాల్‌ తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఆతరువాత ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో బకింగ్‌హాం కెనాల్‌ పూర్తిగా శిథిలావస్థకు చేరి గత వైభవ చిహ్నానికి ప్రతీకగా నిలిచింది. క్రమేణ కాలువ కొన్ని చోట్ల కనుమరుగై మరి కొన్ని చోట్ల కుంచించుకుపోయింది. 1960, 1970 దశకాల్లో వచ్చిన తుఫాన్‌లు కాలువను పాక్షికంగా దెబ్బతీశాయి. 2004 సునామీతో కాలువ పూర్తిగా దెబ్బతింది. సునామీ ప్రభావాన్ని తగ్గించేందుకు కూడా బకింగ్‌ హామ్‌ కెనాల్‌ ఉపయోగపడిందనటంలో ఏమాత్రం సందేహం లేదు.బకింగ్‌హామ్‌ కెనాల్‌ను పునరుద్ధరిస్తే నేటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఉపయోగాలు ఉన్నట్లు విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే డీజిల్‌ రేట్లు పెరిగాయి. ఉపరితల రవాణా భారంగా మారింది. ట్రాఫిక్‌ ఇబ్బందులు సైతం ఇబ్బడి ముబ్బడిగా తలెత్తుతున్నాయి. బకింగ్‌హాం కెనాల్‌ను పునరుద్దరిస్తే రవాణా ఖర్చు తగ్గడంతో పాటు ట్రాఫిక్‌ ఇబ్బందులు సగానికి సగం తగ్గుతాయి. మరోవైపు సునామీ లాంటి విపత్తుల ప్రభావాన్ని తగ్గించేందుకు కూడా బకింగ్‌ హామ్‌ కెనాల్‌ ఉపయోగపడుతుంది.

Related Posts