YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అసలే.. భయం... ఇప్పుడు బీ రూట్ తో అయోమయం

అసలే.. భయం... ఇప్పుడు బీ రూట్ తో అయోమయం

విశాఖపట్టణం, ఆగస్టు 12, 
విశాఖ ఇపుడు తరచూ ప్రమాదాలతో తల్లడిల్లుతోంది. విశాఖలోని అనేక ప్రమాదకర రసాయన పరిశ్రమలు ఉన్నాయి. వాటి నిర్వహణలో జరుగుతున్న పొరపాట్లు కారణంగా విలువైన ప్రాణాలు గాలిలోకి కలసిపోతున్న సంగతి తెలిసిందే. ఎల్జీ పాలిమర్స్ లో స్టెర్లిన్ విషవాయువు లీక్ కావడంతో ఏకంగా 15 మంది చనిపోయారు. అంతే కాదు, వందలాది మంది గాయపడ్డారు, వేలాది మంది ఇప్పటికీ అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ఆ తరువాత పరవాడ సెజ్ లో రెండు ప్రమాదాలు జరిగి నలుగురు చనిపోయారు. ఇక ఈ మధ్యనే షిప్ యార్డులో క్రేన్ కూలి 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఇవన్నీ విశాఖ జనానికి భీతవహం కలిగించే ఘటనలే.తాజాగా లెబనాన్ రాజధాని బీరూట్ లో సంభవించిన భారీ విస్పోటనంతో మరోసారి విశాఖ విషయం మేధావుల్లో చర్చకు వస్తోంది. అక్కడ పోర్టు ప్రాంతంలో అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన రసాయనాలు ఒక్కసారిగా పేలి నగరం మొత్తం బ్లాస్ట్ అయింది. అంతే కాదు దేశం మొత్తం ఆ దెబ్బకు వణికిపోయింది. ఈ పేలుళ్ల వల్ల బీరూట్ లో శ్మశాన వాతావరణం ఏర్పడింది. విషవాయులు నగరమంతా వ్యాపించి జనం మొత్తం వేరే చోటకు తరలిపోయారు. ఇపుడు విశాఖ సిటీ కూడా దాన్ని తలచుకుని భయపడుతోంది. ఎందుకంటే విశాఖ కూడా పోర్ట్ సిటీ. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున రసాయన పదార్ధాలు ఎగుమతి,దిగుమతి అవుతూంటాయి.బీరూట్ లో పేలిన రసాయన పధార్ధాలు 2,750 టన్నులు మాత్రమేనట. విశాఖలో 2018-19లోనే 2, 69,505 టన్నుల అమ్మోనియం నైట్రేట్ దిగుమతి అయింది. ఇక విశాఖలో ఈ ఎగుమతులు దిగుమతులు కారణంగా ఎపుడూ కనీసంగా 30 వేలకు తక్కువ కాకుండా రసాయన పదార్ధాలు నిల్వ ఉంటాయని ఒక అంచనా. అందులోనూ అనుమతి లేకుండా నిల్వ ఉంచినవే ఎక్కువ. వీటిని కూడా నగరాన్ని ఆనుకుని ఆరు చోట్ల నిల్వ ఉంచుతున్నారు. మరి వీటి విషయంలో అధికారులు భద్రతా ప్రమాణాలు ఎంతవరకూ పాటిస్తున్నారో తెలియదు. ఈ నేపధ్యంలో విశాఖలో ఇప్పటికే పలు పరిశ్రమల్లో సేఫ్టీ డొల్లతనం బయటపడిందని మేధావులు అంటున్నారు. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే పెను ప్రమాదాలే పొంచిఉన్నాయని చెబుతున్నారు.విశాఖకు అందాల సిటీ అని పేరు. కానీ ప్రమాదాలు పక్కనే ఉన్నాయని అంటున్నారు. విశాఖ సముద్రపు ఒడ్డున ఏర్పాటు అయిన సిటీ. వెనకకు వెళ్తే కొండలు ఉంటాయి. నగరం చుట్టూ పరిశ్రమలు ఉంటాయి. ఏదైనా అనుకోకుండా అతి పెద్ద విస్పోటనం కనుక సంభవిస్తే విశాఖ జనం తప్పించుకునేందుకు కూడా భౌగోళికంగా చూస్తే ఏ వైపునా దారి లేదని నిపుణులు చెబుతారు. అటువంటి చోట మరింత అప్రమత్తత‌ అవసరమని పర్యావరణవేత్తలు, మేధావులు కోరుతున్నారు. బీరూట్ ఘటనతోనైనా మేలుకుని విశాఖను ప్రమాదరహిత నగరంగా చేసుకునేందుకు అధికారులు అడుగులు వేయాలని కూడా సూచిస్తున్నారు.

Related Posts