కాకినాడ,ఆగస్టు 12,
మాజీ ఎంపీ చేగొండి హరి రామజోగయ్య కాపులకు రిజర్వేషన్లు సాధించే బాధ్యతల్ని తీసుకున్నారు. కాపు రిజర్వేషన్ ఉద్యమ పగ్గాలను అందిపుచ్చుకోనున్నారు. ఆయన కాపు సంక్షేమ సేనను స్థాపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని నివాసంలో ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడిన ఆయన కీలక అంశాలను ప్రస్తావించారు. కాపు ఉద్యమానికి సంబంధించిన వివరాలపై క్లారిటీ ఇచ్చారు. కాపు సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం కలిగించేంత వరకూ ఉద్యమాల ద్వారా జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి కాపు సంక్షేమ సేనను స్థాపించామన్నారు.బీసీలకు ఎటువంటి నష్టం లేకుండా కాపుల్రి బీసీలుగా ప్రకటించడం లేని పక్షంలో ఓసీలలో 10 శాతం ఈబీసీ కోటాలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని జోగయ్య డిమాండ్ చేశారు. కాపు సంక్షేమ సేనకు ఏ పార్టీకి సంబంధంలేదని ఒక సామాజిక వర్గానికి చెందినదని కాదన్నారు. ఎన్నికలకు ముందు బీసీల కోసం కాపు రిజర్వేషన్ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదని కేంద్రం పరిధిలోనిదని జగన్ చెప్పారని.. అధికారం చేపట్టిన అనంతరం కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు కాపు నేస్తం పేరుతో కేవలం 2.50 లక్షల మంది మహిళలకు ఏడాదికి రూ.15 వేలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు.రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల మంది కాపు మహిళలు ఉంటే కేవలం 2.50 లక్షల మందికి కాపు నేస్తం సహాయం అందించారన్నారు. గత టీడీపీ ప్రభుత్వం కాపు సామాజిక వర్గం బీసీలా లేక ఈబీసీలా అనేది తేలకుండా రిజర్వేషన్ అంశం ఎటూ తేల్చకుండా వదిలేసిందన్నారు. ఈ ఉద్యమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, పారిశ్రామికవేత్త ఇర్రింకి సూర్యారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ వానపల్లి బాబూరావు, డాక్టర్ వేద వ్యాస్ సోదరుడు బూరగడ్డ శ్రీనాధ్, ప్రముఖ సినీ దర్శకుడు రాజా వన్నెంరెడ్డి, జర్నలిస్ట్ చందు, హైకోర్టు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ, జనసేన నేత కందుల దుర్గేష్, కాపు ఉద్యమనేత దాసరి రాము ఇలా ముఖ్యమైన వారు ఉంటారని జోగయ్య అన్నారు.