హైద్రాబాద్, ఆగస్టు 12,
హైదరాబాద్‌లో వేర్వేరు చోట్ల శాఖలున్న ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్న ఓ బాధితుడు ఉరి వేసుకొని ఆస్పత్రి చేసుకున్నాడు. మలక్ పేటలోని ఆస్పత్రి శాఖలో ఈ ఘటన జరిగింది. మంగళవారం తెల్లవారు జామున ఆస్పత్రిలోని ఐదో అంతస్తులో కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న 60 ఏళ్ల వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కరోనా నయం అవుతుందో లేదో అనే భయంతో ఇతను ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా అనుమానిస్తున్నారు. గదిలోని బాత్ రూమ్‌లో ఉన్న షవర్‌కు పేషెంట్ ధరించే గౌన్ తోనే ఉరి వేసుకున్నట్లు సమాచారం.బాత్రూంలో వ్యక్తి చనిపోయి ఉన్న విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది గమనించి చాదర్ ఘాట్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి ప్రత్యేక జాగ్రత్తలతో తరలించారు.కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ నెల 6వ తేదీన హాస్పిటల్‌లో చేర్చినట్లు సమాచారం. అయితే ఐసీయూలో ఉన్న అతడిని జనరల్ వార్డుకు మార్చామని రెండ్రోజుల్లో డిశ్చార్జ్ అయ్యేవాడని సిబ్బంది తెలిపారు. వ్యాధి వల్ల భయంతోనే అతను సూసైడ్ చేసుకున్నాడని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.