YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

శివకేశవ తత్త్వం భాగవతం

శివకేశవ తత్త్వం భాగవతం

చేతులారంగ శివుని బూజింపడేని నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువడేని,
దయయు సత్యంబు లోనుగా దలపడేని గలుగ నేటికి దల్లుల కడుపు జేటు
శివకేశవుల అద్వైతాన్ని- అభేద స్వరూపాన్ని అందమైన తెనుగు నుడికారంతో సులభసుందరంగా తేటపరిచే హృద్యపరిచే ఈ తేటగీతి పద్యం, ఈ సుధామయ సూక్తి, పోతన మహాకవి స్వీయస్ఫూర్తి. ‘ఈ తెలుగు పద్యం నోటికి రానివాడు ఆంధ్ర భారతీయుడు కాడు. దానంతటదే నోటికి వచ్చే పద్యమిది. రాకుండా ఎలా ఉంటుంది నోటికి తాళం వేసుకుంటే తప్ప’ అని కవి సమ్రాట్‌ వివ్వనాథ వారు సున్నితంగా సుత్తితో కొట్టారు.
పోతన వంశీకులు, తల్లిదండ్రులు, అన్నగారు, తాను... అందరూ శివదీక్షాపరులే. పైగా పోతన ‘పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్రుడు’ కూడా. ఆయన అవతారికలో చేసిన తన వంశవర్ణన ద్వారా ఇది స్పష్టం. ‘పోతన జీవించిన కాలం వీరశైవం విజృంభించిన కాలం.  ఈ విజృంభణకు ఓరుగల్లు వేదిక కావడం విశేషం. భాగవతానికి ముందు ఆయన ‘వీరభద్ర విజయం’ అనే శైవ కావ్యం రాయడం కూడా ఈ ఊహకు ఊతమిస్తున్నది.
వయసుతో పాటు మనసు పరిపక్వత చెంది తత్త్వం బోధపడగా రజోగుణ రంజిత వీరశైవి మతాసక్తిని విడిచి పోతన, తిక్కన వలెనే హరిహరులకు భేదం పాటించని పరమ అద్వైతిగా పరిణతి చెందాడు.
పోతన రాయాలనుకున్నది విష్ణుకథ. ద్యానించింది విశ్వనాథుణ్ణి. దర్శనమిచ్చింది దయా శరధి దాశరధి. ఆ ‘రాజశేఖరుడు’- ‘భాగవతాన్ని నాకు అంకితంగా తెనిగించు. నీ భవబంధాలు తెగిపోతాయి’ అని ఆనతిచ్చి అంతర్థానం చెందాడు. రామేశ్వరుని ధ్యానిస్తే రామదర్శనమేమిటని తత్‌క్షణం ఆశ్చర్యానికి లోనైనా మరుక్షణమే- విరాజిల్లింది ‘రాజశేఖరుడు’ కదా! అని గ్రహించి పరవశించాడు పోతన. ఎంత సున్నితమైన శ్లేష! రాజశేఖరుడంటే రాజులలో శ్రేష్ఠుడైన రామచంద్రుడు కావచ్చు లేక నెలరాజు శిరోభూషణంగా కల నీలకంఠుడూ కావచ్చు. ఇంతాచేసి భాగవతాన్ని అంకితమిచ్చింది రామునికి కాదు, కృష్ణునికి! హరిహరులకు, రామకృష్ణులకు అభేదమని ధ్వనింపజేయటమే ఈ జిగిబిగి అల్లికకు అంతరార్థం.
తిక్కన భారత తెనుగు సేతలో శివకేశవ అభేదాన్ని సాధిస్తూ ‘హరి హరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ నమశ్శివాయ’ అంటూ అభీష్ట సిద్ధికి తన ఇష్టదైవమైన హరిహరనాథుని నిష్ఠాగరిష్ఠుడై ప్రార్థించాడు. హరిహరనాథుడనగా శివకేశవుల ఉమ్మడి మూర్తి. తిక్కన మానసదైవం. హరిహరనాథుని గృహిణి శ్రీగౌరి. తిక్కన గొప్ప మతాచార్యుడు కూడా. ఆయన ప్రతిపాదించి, ప్రవర్తింపచేసిన మతమే హరిహరనాథ మతం. ఇది శాస్త్రసమ్మతమైన మతం. మతమౌఢ్యంతో సతమతమవుతున్న నాటి సమాజంలో సామరస్యం, శాంతి స్థాపన ద్వారా జనహితానికి పాటుపడటమే తిక్కన మతానికి అభిమతం. తన దైవాన్ని గురించి ఒక రసమయ శ్లోకాన్ని తెలుగువారికి అనుగ్రహించి తిక్కన మహాకవి సుశ్లోకుడయ్యాడు-
‘ఆహార్యం- అలంకరణలో ఆభరణంగా నీవు కపాల అస్థిమాల (పుర్రెలు, ఎముకల దండ)ను ఇష్టపడతావా లేక కౌస్తుభ మణినా? ఆహారంగా కాలకూట విషం ఇష్టమా లేక యశోదా మాత స్తన్యమా? నాకు చెప్పు స్వామీ’ అంటూ నేర్పుగా నిలదీస్తాడు తిక్కన. పోతన కూడా భాగవతంలో అవసరమనిపించినప్పుడు, అవకాశం చిక్కినప్పుడల్లా హరిహర అభేద తత్త్వాన్నే అభివర్ణిస్తూ వచ్చాడు. ‘చేతులార శివుని పూజింపడేని’- మనిషిగా పుట్టిన ప్రతివాడు చేతులారా- నిండుగ, దండిగ, మెండుగ శివపరమాత్ముని పూజించాలి. శివుడు ఆనందరూపుడు. ‘యశ్శివో నామరూపాభ్యాం’- శివుని నామం, రూపం- రెండూ సౌభాగ్యాలు కల్గించేవి. శివుడు అన్నాధిపతి. శివార్చనాపరులకు గ్రాసవాసోదైన్యం- అన్నవస్ర్తాలకు లోటు ఉండదు. తన భక్తులకు ఆశుతోషుడు (ఉబ్బులింగడు). ఆధ్యాత్మిక జ్ఞానవైరాగ్య సంపద కూడా అనుగ్రహిస్తాడు. ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని’- నోరారా (నోరునొచ్చే దాకా ఉచ్ఛ స్వరంతో) శ్రీహరి యశస్సును గానం చెయ్యాలి. ‘కలౌ సంకీర్త్యకేశవం’- కలిలో కేశవుని నామ, రూప, గుణ, లీలా, ధామముల సంకీర్తనం ముక్తికి సులభసోపానం. శివుని మెప్పించి, జ్ఞానమనే ‘టోకెన్‌' సంపాదించి, దానిని శ్రీహరికి సమర్పిస్తే ఆయన మారు మాటాడక ముక్తిని ప్రసాదిస్తాడు. ఇదీ వారి అన్యోన్యత. అలాంటి వారి పట్ల భక్తి ప్రపత్తులు కలగాలంటే- ‘దయయు సత్యంబు లోనుగా దలపడేని’ సర్వభూత దయ, సత్యభాషణం మొదలైన దైవీగుణాలు అలవర్చుకోవాలి. సదయ హృదయుని, సత్యభాషణుని, పరోపకాల పారీణుని కరాళ కలికాలం కూడా కలవరపెట్టలేదు! ‘కలుగు నేటికి దల్లుల కడుపుజేటు’- దుర్లభమైన మానవ జన్మ పొంది కూడా ఈశ్వరపూజ, హరికీర్తన, దయా సత్యాలను సాధించని దౌర్భాగ్యుడు తల్లి కడుపున చెడబుట్టినవాడే. ‘మాతుః కేవలమేవ యౌవ్వన వనచ్ఛేదే కుఠారా వయం’ అన్నట్టు తల్లుల యవ్వనమనే సుందర నందనవనాన్ని గొడ్డలితో తెగనరికిన తుచ్ఛుడే అవుతాడు. చేతులారంగ, నోరు నొవ్వంగ, కలుగనేటికి వంటి నుడికారాలు నేటికీ తెలుగువారి గుండెల్లోను, నాలుకలపై సవ్వడి చేస్తున్నాయి.
భాగవతం దశమ స్కంధంలో కూడా పోతన బాలకృష్ణునిలో బాలశివుని దర్శిస్తాడు. వ్రేపల్లెలో నందుని ఇంటి ముంగిట సర్వవేద వేదాంత సిద్ధాంతం (పరబ్రహ్మ) బాలకృష్ణుని రూపంలో దుమ్ము కొట్టుకున్న దేహంతో నృత్యం చేస్తున్నది. ఈ బాల ముకుందునికి, ఆ బాల మృత్యుంజ
యునికి అభేదాన్ని రూపించి నిరూ
పించాలి. అదెలా సాధ్యం? తత్త్వం ఏకం, అద్వితీయమైనా ఉపాధులు వేరు కనుక గుణ ధర్మాలు కూడా వేరుగా, విరుద్ధంగా ఉంటాయి. ఒకడు నల్లనివాడు, మరొకడు తెల్లనివాడు. పోలిక, ఎలా? కానీ రవిగాననిచో కవి గాంచునే కదా! ముద్దులు మూట గట్టినట్లున్న ఈ సీస పద్యపు మూసలో పోత పోసి తీసిన హరిహరమూర్తిని దర్శిద్దాం-   
మట్టిలో ఆడటం వల్ల ముకుందుని దేహానికి పులుముకున్న దుమ్ము- ధూళి పొరలే భస్మరేఖల విభూతి పూతగా వెలుగుతున్నాయి. శ్రీధరుని సిగముడి పై శోభిల్లు ముత్యాల మాల ధూర్జటి జటల పై బాలేందు లేఖలా భాసిస్తోంది. నొసటిపై తీర్చిదిద్దిన ఎర్రని తిలకం మన్మథుని మసి చేసిన ముక్కంటి మూడవ కన్నులా మెరిసిపోతున్నది.
సీ. తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నెఱి భూతి పూత గాగ
ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుక గాగ
ఫాలభాగంబు పై బరుగు కావిరి బొట్టు  కాముని గెల్చిన కన్నుగాగ
గంఠమాలికలోని ఘననీలరత్నంబు  కమనీయమగు మెడ కప్పుగాగ
ఆ. హార వల్లులురగ హార వల్లులు గాగ బాల లీల బ్రౌఢ బాలకుండు
శివుని పగిది నొప్పె శివునికి, దనకును వేఱు లేమి దెల్వ వెలయనట్లు.
శ్రీకాంతుని కంఠహారంలో కాంతులీనుతున్న నీలమణి శ్రీకంఠుని (శివుని) కంఠసీమలో కాలకూట కలభూషణంగా కనువిందు చేస్తున్నది. మాధవుని మెడలో మెరుస్తున్న ముక్తామణిహారాలే (ముత్యపు సరాలు) ఉమాధవునికి ఉరగ (సర్ప) హారాలై ఉజ్జ్వల దీప్తులను వెదజల్లుతున్నాయి. ఇలా బాలకృష్ణుడు, ‘జగన్నాథుడనైన నాకు విశ్వనాథుడైన శంకరునికి కించిత్తు కూడా తేడా లేదు సుమా’ అని హెచ్చరిస్తున్నాడా అన్నట్లుగా బాలశివుని వలె శోభించాడట! మూలంలో ఈ పద్యానికి మాతృక లేదు, మహాకవి కపోల కల్పితమిది. అందుకే, ‘బాలకృష్ణునికి ఆ భావం ఉందో లేదో కాని, శివయ్యకీ, కన్నయ్యకీ భేదం లేదని తెల్పాలనే ఉత్సాహం,ఉత్కంఠ సహజపాండిత్యుల వారికి ఉన్నదనటంలో సందేహం లేదు’ అని కరుణశ్రీ జంధ్యాల చమత్కరిస్తారు.
కిమస్థి మాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాం బహుమన్యసే త్వం,
కిం కాలకూటః కిం వా యశోదా స్తన్యం తవ స్వాదు వద ప్రభో మే.
తిక్కన మహాకవే గాక, గొప్ప మతాచార్యుడు కూడా. ఆయన ప్రతిపాదించి, ప్రవర్తింపచేసిన మతమే హరిహరనాథ మతం. ఇది శాస్త్రసమ్మతమైన మతం.  మతమౌఢ్యంతో సతమతమవుతున్న నాటి సమాజంలో సామరస్యం, శాంతి స్థాపన ద్వారా జనహితానికి పాటుపడటమే తిక్కన మతానికి అభిమతం.

Related Posts