విజయవాడ, ఆగస్టు 12
ఏపీ ప్రజలకు మరోసారి బ్యాడ్‌న్యూస్.. మరోసారి ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడింది. ఈ నెల 15న జరగడం లేదని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. మళ్లీ పంపిణీ ఎప్పుడు అనేది త్వరలోనే చెబుతామన్నారు. ఇక ఎగ్జిక్యూటివ్ కేపిటల్ శంకుస్థాపన కూడా త్వరలోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. టీడీపీ మూడు రాజధానుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని.. త్వరలోనే అన్ని ఇబ్బందులు తొలగిపోతాయంటున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షలమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదికాకముందే పంపిణీ చేయాలనుకుంది. ముందు సంక్రాంతి కానుకగా ఇవ్వాలని భావించారు.. తర్వాత అనివార్య కారణాలతో అంబేద్కర్ జయంతి రోజుకు వాయిదా వేశారు.. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి.. తర్వాత మళ్లీ కరోనా, లాక్‌డౌన్ దెబ్బకు ఆగిపోయాయి. తర్వాత లాక్‌డౌన్ ఎత్తేయడంతో ఇప్పుడు వైఎస్ జయంతి రోజు ఇవ్వాలనుకున్నారు.. కానీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం మళ్లీ వాయిదా పడింది. తర్వాత ఆగస్టు 15న పట్టాలు ఇవ్వాలని అనుకున్నారు.. కానీ కోర్టు కేసులతో పాటూ కరోనా కేసులు ఉండటంతో వాయిదా వేశారనే చర్చ జరుగుతోంది.