విజయవాడ, ఆగస్టు 12
ఏపీలో మహిళలకు జగన్ సర్కార్ మరో పథకానికి శ్రీకారం చుట్టింది. వైఎప్సార్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. మొదటి విడత సాయంగా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.18,750లు జమచేశారు. ఈ చేయూత పథకం 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో అర్హత ఉన్న మహిళలకు వర్తిస్తుంది. ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్ల కాలంలో రూ. 75,000 లను మహిళలకు ఉచితంగా ప్రభుత్వం అందించనుంది.మహిళా సాధికారతే లక్ష్యంగా అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపడానికి వైఎస్సార్ చేయూత పథకాన్ని తీసుకొచ్చామన్నారు సీఎం జగన్. వైఎస్సార్ చేయూతను ప్రారంభించడం తన అదృష్టమని.. 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఏ పథకం లేదని.. వైఎస్ఆర్ చేయూత ద్వారా వారి కుటుంబాలకు మంచి జరగాలి అని ఆకాక్షించారు. మహిళలకు తోడుగా ఉంటాం.. నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో రూ.18,750 జమ చేస్తున్నాం.. నాలుగేళ్లలో రూ.75వేల ఆర్థిక సహాయం అందుతుంది అన్నారు. దాదాపు 25 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరుంది. మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నామన్నారు సీఎం.ఈ పథకం కింద 5 లక్షల మంది అకౌంట్లలోకి డబ్బులు జమ చేస్తారు. మహిళల్లో ఆర్థిక సుస్థిరత, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పాటును అందించేలా ఈ పథకాన్ని రూపొందించారు. రాష్ట్ర బడ్జెట్‌లో వైఎస్సార్ చేయూత పథకానికి రూ.4,700కోట్లు కేటాయించారు. గతంలో ఏ ప్రభుత్వం అందించని విధంగా దాదాపు 25లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా 4 ఏళ్లలో రూ.17 వేల కోట్లు లబ్ధిపొందనున్నారు.