వాషింగ్టన్, ఆగస్టు 12
అమెరికా ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్ధిగా భారతీయ అమెరికన్ కమలా హ్యారిస్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని ఖరారుచేస్తూ డెమొక్రాటిక్ నుంచి అధ్యక్ష బరిలో ఉన్న జో బిడెన్ నిర్ణయం తీసుకున్నారు. కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించడంపై రిపబ్లికన్‌ల అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డెమొక్రాట్ల వైస్-ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలా హ్యారిస్‌ను జో బిడెన్ ప్రకటించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆమెను అతి భయంకరమైన వ్యక్తి అంటూ అభివర్ణించారు.శ్వేతసౌధం వద్ద మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రైమరీలలో డెమొక్రాటిక్ నామినేషన్ కోసం పోటీ పడుతున్నప్పుడు జో బిడెన్‌ను కమలా హ్యారిస్ ఆకట్టుకోలేకపోయారని అన్నారు. అన్నిటి కంటే ఏంటంటే.. అత్యంత బలహీనమైన వ్యక్తిని ఎంపిక చేసుకోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.యుఎస్ సెనేట్‌లో ఎవరికైనా అతి తక్కువ, అత్యంత భయంకరమైన, అత్యంత అగౌరవమైన వ్యక్తి ఉన్నారంటే అది కమలా హ్యారీస్ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రెట్ కవానాగ్ సైతం 2018లో సెనేట్ నిర్ధారణ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారని పేర్కొన్నారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి తన వద్ద కావాల్సినంత డబ్బు లేదని పేర్కొంటూ కమలా హ్యారిస్ ఎన్నికల బరి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.డెమొక్రటిక్ పార్టీలో కీలక నేతగా ఉన్న కమల.. అధ్యక్షుడు ట్రంప్ విధానాలను విమర్శిస్తూ పతాక శీర్షికల్లో నిలిచారు. ఆఫ్రికన్- ఆసియా(భారత్) మిశ్రమ సంతతికి చెందిన కమలను తోటి సభ్యులు ఫిమేల్ ఒబామాగా అభివర్ణిస్తారు. మరోవైపు, కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల ప్రవాస భారతీయ సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. భారతీయులను గుర్తించినట్టయిందని ప్రవాస భారతీయుడు ఎంఆర్ రంగస్వామి వ్యాఖ్యానించారు. తాను కూడా చెన్నైకి చెందిన వాడినేనని, అదే నగరం నుంచి వచ్చిన శ్యామలా గోపాలన్ కుమార్తె కావడం తనకు గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు.